Significance of Subrahmanya Sashti : వివాహానికి అడ్డంకులు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, జాతకంలో కుజదోషం వల్ల వివాహం కానివారు, కాలసర్ప దోషం వెంటాడుతున్న వారు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు. 2023లో సుబ్రహ్మణ్య షష్టి డిసెంబరు 18 న వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే...


శివుని రెండో కుమారుడైన కుమారస్వామే సుబ్రమణ్యస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రమణ్య స్వామి షష్టి జరుపుకుంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవర షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు  స్కంద షష్టి అని అంటారు. 


Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!


మాతృగర్భం నుంచి పుట్టలేదు
కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు. శివుడు ఓసారి ధ్యానంలో ఉండగా మన్మథుడు ఆటంకం కలిగించాడు. తీవ్రమైన ఆగ్రహందతో మూడోకన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు. అదే సమయంలో శంకరుడి నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజం గంగానదిలో విడచి పెడతాడు అగ్ని. ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగులు కృత్తికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది. రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు. ఆ పొదల నుంచి ఆరుముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాశం తీసుకెళ్లారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని,  ఆరుముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని, కార్తీకేయుడని...గౌరీశంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు.. దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకారుసుర సంహారం చేయిస్తారు. 


Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!


ఆరు ముఖాలు ఇవే 



  • మొదటిది- మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం

  • రెండోది - పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం

  • మూడోది-  శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం

  • నాలుగోది-  శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం

  • ఐదోది - శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం

  • ఆరోది-  లౌకిక సంపదల్ని అందించే ముఖం


Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!


గ్రహదోషాలు తొలగిపోతాయి
వల్లీదేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి
సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించినా, అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది
నాగుల చవితి, నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయలేకపోయినవారు...సుబ్రహ్మణ్య షష్టి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి, బియ్యంపిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి
మంచి సంతానం కలగాలన్నా, ఆర్థిక సమస్యలు తీరాలన్నా, కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలన్నా, విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలంటే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనే మంచి పరిష్కారం


సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యంయే పఠంతి ద్విజోత్తమాః 
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః 
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ 
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి