ఏడు చేపల కథకు సంబంధించి ఆధ్యాత్మిక వివరణ చూద్దాం


రాజుగారు అంటే మనిషి
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు (రసము, రక్తము, మాంసము, మేధస్సు ,అస్థి (ఎముక), మజ్జ (మూలుగ), శుక్రము) 
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం..జీవితమే ఒక వేట అని అర్థం
రాజ కుమారులు వేటాడిన చేపలు  మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు (1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ  5.మద 6.మాత్సర్యాలు)
మనిషి సాధన ద్వారా వీటిని ఎండగట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు. అందులో ఎండని ఒక్క చేప మనస్సు. మనసుని నియంత్రించడం, జయించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది ఎండదు.  


Alos Read: ఇవాల్టి నుంచి శ్రావణం ప్రారంభం, రేపే (ఆగష్టు 18) మొదటి శ్రావణ శుక్రవారం!


మనస్సు  అంటే
మనస్సు అంటే సంకల్ప వికల్పాలు. ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది. అలా కొత్త కోరికలు మొలుస్తూనే ఉంటే జీవితకాలం సరిపోదు. కొందరైతే కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు. ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది గడ్డిమేటు ఏంటంటే కుప్పపోసిన అజ్ఞానం. గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలి. అయితే మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగి లాగి ఖాళీ చేయొచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే ఆ కుప్ప తరిగేది కాదు.


ఆవు దేనికి సంకేతం
ఆ అజ్ఞానం పోవాలంటే ఆవు వచ్చి మేయాలి - ఇక్కడ ఆవు అంటే జ్ఞానం. జ్ఞానం అనే ఆవు ఆజ్ఞానాన్ని మేయడం ద్వారా అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది . లేదా జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది. అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు. జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.


Also Read: సౌభాగ్యం, సత్సంతానం కోసం వివాహితలు ఆచరించే నోము ఇది!


ఈ గోవును మేపే గొల్లవాడు ఎవరు
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు, జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా. అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు. ఏం నాయనా అని అడిగితే అవ్వ అన్నం పెట్టలేదన్నాడు. ఆ గొల్లపిల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ...అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ లోకాన్నేలే జగన్మాత. 


పిల్లవాడు-చీమ ఎవరు!
చీమ కుట్టిందని పిల్లవాడు ఏడుస్తున్నాడు. దానికి ఇకో పేరు సంసారం. అంటే సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది. మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన  తన విధిని నిలిపి వేసాడా అంటే లేదు అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.


Also Read: ఆగష్టు 17 రాశిఫలాలు, ఈ రాశులవారు అకస్మాత్తుగా డబ్బు పొందుతారు!


చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక జనులంతా ఏడుస్తున్నారు.  ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. చీమలు పుట్టలోనే ఉంటాయి...ఈ పుట్టే సంసారం. జీవితంలో అడుగుపెట్టేముందు ఈ గొప్ప విషయం తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ కథను పిల్లలకు చెబుతారు. 


 Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.