Sravana Mangalvaram: సౌభాగ్యం, సత్సంతానం, అన్యోన్యదాంపత్యం కోసం ఏటా శ్రావణమాసంలో వివాహితలు ఆచరిస్తారు మంగళ గౌరీ వ్రతం. ఈ సారి అధికశ్రావణం మాసం రావడంతో మొదటి నెల రోజుల్లో ఏ నోమూ నోచరు. మరి నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలైంది. ఈ ఏడాది ఎన్ని మంగళవారాలు వచ్చాయో చూస్తే...ఆగష్టు 17 గురువారం నుంచి నిజ శ్రావణమాసం మొదలై సెప్టెంబరు 15 వరకు ఉంటుంది. అంటే ఈ ఏడాది నాలుగు శ్రావణ మంగళవారాలుంటాయి
- ఆగష్టు 22 -మొదటి శ్రావణ మంగళవారం
- ఆగష్టు 29 -శ్రావణ మంగళవారం రెండోది
- సెప్టెంబరు 5 - మూడో శ్రావణ మంగళవారం
- సెప్టెంబరు 12 - ఆఖరి శ్రావణ మంగళవారం
శ్రావణంలోని ప్రతి మంగళవారం స్త్రీలు మాంగల్యానికి అధిదేవత అయిన ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తమ మాంగల్యాన్ని పదికాలాల పాటు కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు తల్లి దగ్గరుండి చేయించాలి. అలాగే మొదటి వాయనం తల్లికి ఇవ్వడమే శ్రేష్ఠం అంటారు పండితులు. అత్తవారింట్లోనూ, ఇతర ముత్తైదువుల సమక్షంలోనూ నోము ప్రారంభించవచ్చు
Also Read: ఇంట్లో ట్యాపులు లీకవుతూనే ఉన్నాయా - అయితే ఈ సమస్యలు తప్పవు!
వ్రతాన్ని ఆచరించే వారు పాటించాల్సిన నియమాలు
- మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే వారు ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి
- వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనం ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనం అందించాలి)
- శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఐదేళ్లపాటూ నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి ఐదుగురు ముత్తైదువులు చొప్పున మొదటి ఏడాది 5, రెండో ఏడాది 10, మూడో ఏడాది 15 ఇలా ఆఖరి ఏడాది 25 మంది ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏడాదికి ఐదుగురు ముత్తైదువులకు మాత్రమే ఇస్తారు.
- ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించేవారు కొందరైతే... ఏ వారం ఎక్కడున్నా అక్కడ పసుపుతో అమ్మవారిని ఏర్పాటుచేసుకుని పూజ పూర్తిచేసేవారు ఇంకొందరు. ఇది పూర్తిగా మీ ప్రాంతంలో పాటించే నియమాల ఆధారంగా అనుసరించాల్సి ఉంటుంది.
Also Read: స్త్రీలు మంగళసూత్రం విషయంలో సాధారణంగా చేసే పొరపాట్లు ఇవే!
పూజా ఇలా చేసుకోవాలి
ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దానిపై గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని తయారు చేసుకుని ముందుగా వినాయకపూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశపూజ, షోడశ ఉపచారాలతో అమ్మవారిని ఆరాధించి మంగళ గౌరి అష్టోత్తరం చదువుకోవాలి. తోరాలు తయారు చేసి అమ్మవారి దగ్గర ఉంచి, పిండి దీపారాధనలు తయారు చేసుకుని (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి ఓ తోరం అమ్మవారికి కట్టి, మరొకటి పూజ చేసుకునేవారు కట్టుకుని మిగిలినవి ముత్తైదువులకు కట్టాలి ( మీరు ఎంతమంది ముత్తైదువులను పిలుస్తారో అన్ని ఉండాలి). ముత్తైదువుకి పసుపు రాసి, బొట్టు పెట్టి , తోరం కట్టి తాంబూలంతో ఇచ్చి ఆమెను గౌరీ స్వరూపంగా భావించి కాళ్లకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.