Telangana News: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. జులై నెలలో అయిన మొత్తం డెలవరీల్లో 72.8 శాతం సర్కారు ఆసుపత్రుల్లోనే జరిగాయి. ఈ రికార్డుపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు 30 శాతం.. ఇప్పుడు 72.8 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు జరగడం చాలా గర్వించదగ్గ విషయం అని అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి ఇది నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు. 






జులై నెలలో అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 86.9 శాతం, మెదక్ లో 83.5 శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 81.1 శాతం ప్రసవాలు జరిగాయని వెల్లడించారు. అలాగే వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నిర్మల్ జిల్లాలో డెలివరీలు తక్కువగా నమోదు అవుతున్నాయని, ఫలితాలు మెరుగు పడాలని ఆయా జిల్లాల వైద్యాధికారులకు సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు చేసిన సిబ్బందికి టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ ఇస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. గతేడాది మొత్తం రూ.1.60 కోట్ల ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చామని గుర్తు చేశారు. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ లో జోగులాంబ గద్వాల, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయని చెప్పారు. ఆయా జిల్లాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే వ్యాక్సినేషన్ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కరీంనగర్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను మంత్రి ప్రశంసించారు. 






ఇటీవలే ఒకేరోజు 44 మందికి పురుడు పోసిన వైద్యులు


గతంలో కాన్పుల కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అనేక రకాలుగా దోపిడీకి గురయ్యేవారని మంత్రి హరీష్ రావు వివరించారు. అవసరం లేకుండా ఆపరేషన్లు చేసి పేద ప్రజల ఒళ్లు, ఇల్లు గుల్ల చేసేవారని తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సుఖ ప్రసవం చేయడంతో పాటు, కేసీఆర్ కిట్ అందిస్తూ, అన్ని రకాల వైద్య సేవలను అందించి, ప్రభుత్వ వాహనంలో ఉచితంగా ఇంటికి పంపిస్తున్నామని చెప్పుకొచ్చారు. 2014కు ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతం మాత్రమే కాగా, నేడు 70 శాతం కావడం గొప్ప విషయం అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రభుత్వాసుపత్రులు ఎంతగా మెరుగుపడ్డాయో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదన్నారు. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశనలో ప్రజా వైద్యంలో తెలంగాణ సాధించిన విప్లవానికి ఇదో మచ్చు తునక అంటూ కొనియాడారు. ఒకే రోజు 44 మందికి పురుడు పోసి, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్ట నిలిపిన మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ వైద్యసిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.