AP Politics :   అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరు. నిలబెట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మొదటి మూడేళ్లు ఎలా రాజకీయం చేసినా.. ఎలా పరిపాలన చేసినా.. చివరి రెండేళ్లు మాత్రం రాముడు మంచి  బాలుడు తరహాలో..  ప్రభుత్వం చాలా మంచిది అనే భావన ప్రజలకు కల్పించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తారు. విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా.. తమ ప్లస్ పాయింట్లను హైలెట్ చేయడానికే ప్రయత్నిస్తాయి. కానీ ఈ సంప్రదాయ రాజకీయానికి వైసీపీ అధినేత జగన్ బ్రేకిచ్చారు. ఎన్నికల చివరి వరకూ.. తనదైన ఉద్రిక్తతల రాజకీయం నడిపించేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ప్లస్ పాయింట్లు చర్చల్లోకి రావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


ఒక దాని తర్వాత ఏదో ఓ వివాదం


ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ.. వైఎస్ఆర్‌సీపీ నేతల దుందుడుకు చర్యల వల్ల కానీ.. ఏపీలో ప్రభుత్వ పాలనా తీరుపై ఎప్పుడూ ఏదో ఓ వ్యతిరేక ప్రచారమే జరుగుతూ ఉంటుంది. గత వారమే తీసుకుంటే పుంగనూరు దాడులతో కలకలం రేగింది. తర్వాత చిరంజీవి ఏదో అన్నారని ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ రెండు అంశాల్లోనూ ప్రభుత్వ తీరు సామాన్యుల్లో .. విస్మయానికి గురి చేసింది. గత నాలుగేళ్లుగా అమరావతి దగ్గర నుంచి పోలవరం వరకూ అన్ని  విషయాల్లోనూ ఎప్పుడూ ఏదో ఓ వివాదం వెంటాడుతూనే ఉంది.  విపక్ష పార్టీలపై దాడులు, కేసులు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వంటివి కూడా  హైలెట్ అయ్యాయి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా అవే ఉద్రిక్తలు కనిపిస్తున్నాయి. 


సంక్షేమ  ప్రచారం వెనక్కి పోతోందా ?


వైసీపీ ప్రభుత్వం ఏకైక లక్ష్యం సంక్షేమం.  అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదు.  ప్రజలందరి ఇళ్లకూ పథకాలు అందించడమే టార్గెట్ గా పెట్టుకుంది. దీన్ని ప్రచారం చేసుకోవడానికి మూడేళ్ల కిందటి నుంచి ప్రణాళికలు రూపొందించుకుంది. గడప గడపకూ మన ప్రభుత్వం, స్పందన, జగనన్న సురక్ష, జగనన్నకు చెప్పుకుందాం.. ఇలా వరుస కార్యక్రమాలు ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడూ అవి హైలెట్ కాలేదు. ఎక్కడైనా ప్రజలు ప్రజా ప్రతినిధుల్ని నిలదీస్తే అవే హైలెట్ అయ్యాయి. అదే సమయంలో బటన్ నొక్కే సభల్లో కూడా సీఎం జగన్ తన సంక్షేమ పథకాల గురించి పైపైన చెప్పుకుని మిగతా సమయం అంతా విపక్షాలను విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో ఆ మాటలే హైలెట్ అవుతున్నాయి. అందుకే ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాల ప్రభావం ప్రజలపై ఎంత ఉందనేదానిపై రాజకీయవర్గాలు అంచనాకు రాలేకపోతున్నాయి. 


కక్ష సాధింపు రాజకీయాలతో వైసీపీ వ్యూహం దారి తప్పిందా ?


రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేవి..  వేధింపులకు గురయ్యే వారికి  ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాయి. ఎందుకంటే ప్రజలు సానుభూతి చూపిస్తారు. అందుకే ఎక్కడైనా రాజకీయ పార్టీలు .. ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాయి. ఇబ్బంది పెట్టాలని అనుకుంటాయి కానీ.. ప్రజల నుంచి సానుభూతి లభించే అంతగా చేయాలని అనుకోవు. కారణం ఏదైనా.. గత నాలుగేళ్లుగా ఏపీలో విపక్ష పార్టీ నేతలపై ఎప్పుడూ జరగనన్ని దారుణాలు జరిగాయని.. రాజకీయంగా ప్రభుత్వం మారితే అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడుతారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా  రాజకీయాల్లో చర్చ అంతా..  వైసీపీ పాలనలోని మైనస్‌లపై నే సాగుతోంది ..కానీ వైసీపీ నమ్ముకున్న పథకాలు.. సంక్షేమంపై మాత్రం సాగడం లేదు. దీనికి  ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతమే కారణం.