Kotakonda Durgamma  :  ఆంధ్రా ఒడిశా సరిహాద్దులో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ఆ ప్రాంతంలో ఓ ప్రత్యేక కొనసాగుతుంది. తాతల తండ్రుల కాలం నుంచి వారసత్వాన్ని పాటిస్తూనే ఉన్నారు. తరాలు మారుతున్నా మనుషుల నడవడికలో మార్పులు వస్తున్న సంప్రదాయాలకు  పెద్దపీట వేస్తున్నారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లా భామినిలో రాజులకాలం నుంచి దుర్గమ్మను కొలిచేందుకు ఊరుఊరంతా వెళ్లి మొక్కుకోవడం దొరల దసరా పండుగ ప్రత్యేకత.  


కోటకొండ దుర్గమ్మ ఉత్సవాలు


శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రా-ఒడిశా సరిహాద్దులోని  భామిని గ్రామం ఉంది. మండల కేంద్రమైన భామినిలో రాజుల కాలం నుంచి కీర్తిరాయి కొండ దొరల ఇలవేల్పుగా కోటకొండ దుర్గమ్మను మొక్కుకుంటున్నారు. అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.  గిరిజన దొరల కుటుంబమైన కీర్తిరాయి వంశీయులు జరుపుకునే దొరల దసరా పండుగను  ఇక్కడి వారి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ అందరూ ఐక్యమత్యంగా ఈ  దసరా ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకోవడం పూర్వం కొనసాగిస్తున్న ఆచారం.  ఇప్పటికి అదే పంథాలో  విజయదశమికి ముందుగా వచ్చే పోలాల అమావాస్య నుంచి 5 రోజుల పాటు దొరలు దసరా పండుగను ఉన్నంతలో వైభవంగా జరుపుకొవడం ఆనవాయితీగా వస్తుంది.  ఒడిశాలోని పర్లాకిమిండి గజపతి మహారాజుల పాలనలో ఉన్న ప్రాంతాన్ని గిరిజన వంశీయులైన కీర్తిరాయి దొర కుటుంబీకులకు అప్పగించారు. అప్పటి నుంచి దొరల ఆధ్వర్యంలో కోట దుర్గమ్మ పండుగ సందర్భంగా దసరాను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది భామిని దొరల దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 


వేపచెట్టు వద్ద అమ్మవారు 


ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ముందుగా గ్రామం నలుదిక్కుల్లో ఉన్న గ్రామదేవతలకు ముర్రాటలతో అభిషేకాలు చేసి పూజిస్తారు. ఆ తర్వాత కీర్తిరాయి వంశీయుల ఆయుధాలను మేళతాళాలలో వంశధార నదితీరానికి తీసుకువెళ్లి అక్కడ నీటిలో శుద్ధి చేస్తారు. తిరిగి వాటిని కీర్తిరాయి దొర ఇంటి వద్దకు తీసుకువచ్చి వాటిని పూజిస్తారు. చివరి రోజున మేళతాళాలు, డప్పువాయిద్యాల నడుమ కీర్తిరాయి వంశీయుడైన  క్రిష్ణచంద్ర దొర రాజ వేషధారణలో గుర్రపు స్వారీగా కోట కొండ దుర్గమ్మ ఆలయానికి ఊరేగింపుగా బయలు దేరి అక్కడ కూడా ఈ ఆయుధాలను పూజిస్తారు. తద్వారా శక్తి వస్తుందని నమ్మకం. అయితే ఈ ఏడాది కృష్ణచంద్రదొర కుమారుడు నవీన్ చంద్రదొర   గుర్రంపై మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి దసరా పూజలు నిర్వహించారు. ఆయన వెనుక మహిళలు, వృద్ధులు, యువత ఇలా ఊరు ఊరంతా బయలుదేరి వెళ్లారు. భామిని గ్రామానికి కొంతదూరంలో ఉన్న వేప చెట్టువద్ద అమ్మవారు కొలువై ఉందని నమ్మకం. ఆ విశ్వాసంతో అక్కడ రాత్రి పూట అమ్మవారి సన్నిధిలో ఆయుధాలు ఉంచి పూజలు చేయడం సంప్రాదాయం. ఆయన వెంట చుట్టుపక్కల ఉన్న గిరిజనులతో పాటు గ్రామస్థులు సంప్రదాయ నృత్యాలతో ఆలయానికి వెళ్లి అక్కడ కొలువైన అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. 


ఐదు రోజుల పాటు దొరల దసరా 


 వేప చెట్టుపై ఓ తురాయి పువ్వును ఉంచి దాన్ని కొడతారు అది ఎటువైపు పడితే ఆ ప్రాంతంలో పంటలు బాగాపండుతాయనే విశ్వాసం కూడా ఉంది.  అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఈ మొక్కులు చెల్లించడం ద్వారా గ్రామానికి అక్కడ ఉండే ప్రజలకు శుభం జరుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. అలా చేయడం వల్ల పంటలకు ఛీడపీడతెగులు రాకుండా  బాగా పండుతాయని వారి నమ్మకం. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా భామినిలో దొరల దసరా ఐదు రోజుల పాటు వైభవంగా జరిగింది. రాజుల కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం రాచరికాలు అంతరించిపోయినప్పటికీ ఇక్కడి దొరల వంశీయులు దీనిని కొనసాగిస్తున్నారు. ఈ సరిహద్దు ప్రాంతంలో కేవలం భామినిలో సాగిన ఈ సంప్రదాయానికి స్థానికులు  కూడా గౌరవిస్తూ  వాటిలో  పాలుపంచుకోవడం  దుర్గమ్మపై ఉండే అపారమైన విశ్వాసంగానే చెప్పుకోవచ్చును.