పదాహారణాల తెలుగు అమ్మాయి అంటే పదహారేళ్ళ తెలుగు అమ్మాయి అని పొరపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలుగు సంస్కృతిని అచ్చంగా, కల్తీ లేకుండా, ఇతర సంస్కృతుల ప్రభావం లేకుండా ప్రతిబింబించే అమ్మాయిని ఊహించుకుని పదహారణాల తెలుగమ్మాయి అంటారు. అంతా ఈ మాట ఉపయోగిస్తారు కానీ...మరి పదహారణాల తెలుగమ్మాయి అని ఎందుకంటారో తెలియాలంటే పదహారణాలు అంటే ఏంటో తెలియాలి.
పూర్వం మన కరెన్సీ అణాల రూపంలో ఉండేది. ఆ తర్వాత కాలంలో రూపాయి వచ్చింది. రూపాయి అంటే వంద పైసలు. మరి అణాలను పైసలుగా, పైసలను అణాలుగా మార్చలంటే ఎలా. పదహారణాలు అంటే ఎంతఅవుతుంది.
ఒక అణా అంటే = 6.25 పైసలు..అంటే రూపాయిలో పదహారో వంతు
చారాణా (చార్, అణా) = 4 * 6.25 =25 పైసలు
ఆటాణా (ఆట్, అణా) = 8 * 6.25 = 50 పైసలు
బారాణా (బారహ్, అణా) = 12 * 6.25 = 75 పైసలు
Also Read: మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..
పదహారణాలు అంటే 16 * 6.25 = 100 పైసలు. అంటే నిండు రూపాయి. లేదా నూటికి నూరు శాతం (100%). 99.9999..% కూడా 100% కి సమానం కాదు. ఇక పదహారణాల తెలుగమ్మాయంటే నూటికి నూరుశాతం తెలుగమ్మాయి, నిండైన తెలుగమ్మాయి, సంపూర్ణమైన తెలుగమ్మాయి అని చెప్పాలి. తన భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్ర ధారణలో ప్రతివిషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయిని పదహారణాల తెలుగమ్మాయి అంటారు.
పదహారు అణాలు కలిస్తే 100 పైసలు అయినట్టే... పదహారు అలంకారాలను కలిగి ఉన్న అమ్మాయిని పదహారణాల తెలుగమ్మాయి అంటారు.
స్త్రీ 16 అలంకారాలు
- దంతధావనం
- నలుగుపెట్టి స్నానం
- పసుపు రాసుకోవడం
- చీర, రవిక ధరించడం
- కాళ్లకు పారాణి
- జుట్టు చక్కగా దువ్వుకోవడం
- జడకి నిండుగా పూలు పెట్టుకోవడం
- పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం
- బుగ్గన చక్కటి చుక్క
- నుదిటిన బొట్టు
- చేతులకు గోరింటాకు
- తాంబూలం
- పెదవులకి ఎర్రటి రంగు
- కళ్లకి కాటుక
- సర్వాభరణ అలంకరణ
- పెళ్లైన స్త్రీకి మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు వేసుకోవడం
Also Read:ఎవరీ రామానుజులు, ఆయన ఏం చెప్పారు, సమాజం-సమానత్వం కోసం ఏం చేశారు..