Spirituality: ఆధ్యాత్మిక క్రమశిక్షణకు విద్యాలయాలు ఆలయాలు. ఏకమ్ సత్ విప్రా బహుదా వదన్తి' అన్న వేదోక్తిని అనుసరించి హిందువులు భగవంతుడిని చేరుకునేందుకు ఎన్నో మార్గాలు అవలంభిస్తూ వస్తున్నారు. భారతదేశంలో వైదికపరమైన యజ్ఞయాగాదులతో కూడిన ఆరాధన ఓవైపు… పౌరాణిక మూర్తిమత్వ ఆరాధన మరోవైపు ఏకకాలంలో అభివృద్ధి చెందాయి. యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి కానీ ఆలయ వ్యవస్థ మాత్రం కుల,మత, వర్ణ, లింగ బేధాలకు అతీతంగా అందర్నీ ఒకే రీతీలో అక్కున చేర్చుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే ఆ ఆలయానికి ఏం సాయం చేయాలనే సందిగ్ధంలో పడతారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం
Also Read: పురాణాల్లో ఈ వీరులంతా 'నాన్నకు ప్రేమతో' బ్యాచ్!
ఆలయానికి భక్తులు రావడం విరాళాలు ఇవ్వడం చూస్తుంటాం. మరి ఆలయాలకు ఏఏ వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా
- ఆలయ ప్రాంగణాన్ని అంతట పరిశుభ్రంగా ఉంచడం, ఆలయానికి రంగులు వేయడం వంటివి చేస్తే దేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు
- ఆలయానికి గంటను దానం చేయడం వల్ల గొప్ప కీర్తి లభిస్తుంది
- దేవుడు గుడికి శంఖం దానం చేయడం వల్ల సిరిసంపదలు దేవుడు అందిస్తాడు
- నువ్వులను దానం చేసిన వారికి చేసిన పాప కర్మలు నశిస్తాయి
- ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది
- లోహాలు దానం చేయడం వల్ల కోరికలు తీరుతాయి
- అన్నదానం చెయ్యడం వల్ల రాబోయే పది తరాల వారికి మంచి జరుగుతుంది
- అద్దం దానం చేయడం ద్వారా మంచి రూపం లభిస్తుంది
పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. - ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు.
- మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు.
- వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి
- ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తి కలుగుతుంది
- చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది
- దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు.
- ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు.
- పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి
- ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి
- వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే. పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.
Also Read: రామాయణంతో ముడిపడిన ప్రదేశాలు శ్రీలంకలో ఎన్నో ఉన్నాయి!
దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందుతారు.అంత ఉత్తమమైన వ్యవస్థకోసం చిరకాలం నిలిచే దానం చేస్తే మంచిది అంటున్నారు పండితులు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.