రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రం జూన్ 16 శుక్రవారం థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాఘవడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. టి సిరీస్ బ్యానర్ సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమా ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. అయితే ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించగా ప్రభాస్ అభిమానుల నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సినీ విశ్లేషకులు నుంచి ఈ సినిమాకి ఒకింత విమర్శలు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా హిందీలోని ప్రముఖ టెలివిజన్ షో ‘రామాయణం’తో గుర్తింపు పొందిన రామానంద్ సాగర్ కుమారుడు ప్రేమ్ సాగర్ ఆదిపురుష్ పై విమర్శలు గుప్పించారు.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో, ప్రేమ్ తన తండ్రి రామాయణ ప్రదర్శనను ఎలా రూపొందించాడో గుర్తుచేసుకున్నాడు. ఆదిపురుష్‌ని 'నేటి రామాయణం' అని పిలిచిన ప్రేమ్, ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా కాకుండా ముంబైలోని బ్రీచ్, క్యాండీ, కొలాబాలో ప్రదర్శించాలని విమర్శలు చేసాడు.  ఈ మేరకు ఇంటర్వ్యూలో ప్రేమ్ మాట్లాడుతూ.. "ఓం రౌత్ ఆదిపురుష్ ద్వారా అద్భుతాన్ని సృష్టించడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. మా నాన్న కూడా రామాయణం చేశారు. కానీ ఆయన సృజనాత్మక స్వేచ్చని ఉపయోగిస్తూ ఆ భగవంతుడ్ని అర్ధం చేసుకున్నారు. అంతేకాదు చాలా పుస్తకాలు చదివిన తర్వాత రామాయణం లో కేవలం చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసారు. కానీ ఆయన ఎప్పుడూ రామాయణం లో వాస్తవాలను తారుమారు చేయడానికి ప్రయత్నించలేదు. రామాయణాన్ని మొత్తం మార్చేసి ఇలాంటి చిత్రం తీసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దు. కృత్తివాసి, ఎక్ నాథ్ తో సహా చాలా మంది రామాయణాన్ని రాశారు. కానీ ఎవరూ కంటెంట్‌ని మార్చలేదు. వాళ్ళంతా కేవలం రంగు, భాషను మాత్రమే మార్చారు. కానీ ఇక్కడ మొత్తం వాస్తవమే మార్చేశారు." అంటూ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ప్రేమ్ సాగర్.


ఇక రామానంద్ రూపొందించిన 'రామాయణం' టీవీ సీరియల్ ని రామాయణం పురాతన ఇతిహాసం నుంచి తీసుకున్నారు. 1987 - 88 కాలం మధ్య ఈ సీరియల్ ని టెలివిజన్ లో ప్రసారం చేశారు. అప్పట్లో ఈ సీరియల్ ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ సీరియల్ గా పేరు తెచ్చుకుంది. కాగా ఆది పురుష్ మూవీపై ఎన్ని విమర్శలు వస్తున్న కలెక్షన్స్ లో మాత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మొదటి రోజు సుమారు రూ.90 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక అటు హిందీ లోనూ ఈ సినిమా రూ.50 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: భయంకరమైన నెగిటివిటీ ఉన్నా భారీ కలెక్షన్స్ - మొదటి రోజు అదరగొట్టిన 'ఆదిపురుష్'