గ‌ణ‌ప‌తులు ఎంద‌రంటే కొంద‌రు ఎనిమిదిమంది అని, మరికొందరు తొమ్మిది మంది అని ఇంకొందరు 16 మంది అని చెబుతారు. వాస్తవానికి మొత్తంగా 32మంది గ‌ణ‌ప‌తులు ఉన్నారు. వారిలో 16 పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. ఈ 16మంది గ‌ణ‌ప‌తుల‌్లో  `హేరంబ గ‌ణ‌ప‌తి` కి ఒక ప్రత్యేక‌త ఉంది.


ఐదు త‌ల‌ల‌తోనూ, ప‌ది చేతుల‌తోనూ ఉండే ఈ హేరంబ గ‌ణ‌ప‌తిని నేపాల్ దేశంలో విస్తృతంగా పూజిస్తారు. `హేరంబం` అన్న పేరుకి దీన‌జ‌న‌ర‌క్షకుడు అన్న అర్థం ఉంది. త‌న త‌ల్లి పార్వతీదేవికి వాహ‌న‌మైన సింహమే ఈ హేరంబ గ‌ణ‌ప‌తికి కూడా వాహ‌నం. ఎప్పుడూ ఉండే ఎలుక బ‌దులు సింహాన్ని వాహ‌నంగా గ్రహించ‌డమంటే భ‌క్తుల స్థితికి అనుగుణంగా వీర‌త్వాన్నీ, రాజ‌స‌త్వాన్నీ ప్రద‌ర్శించ‌డ‌మే. భ‌క్తుల కోసం ఎంత‌టి యుద్ధానికైనా సిద్ధమ‌న్నట్లుగా చేతుల‌లో పాశం, దంతం, గొడ్డలి, అంకుశం, క‌త్తి, ముద్గరం అనే ఆయుధాల‌ని ధ‌రించి ఉంటాడు. హేరంబ గ‌ణ‌ప‌తి ఇంత‌టి ఉగ్రరూపంలో ఉంటాడు కాబ‌ట్టే కొంద‌రు తాంత్రికులు `హేరంబ గ‌ణ‌ప‌తి`నే ఆరాధిస్తారు. 


Also Read:  శివరాత్రి గురించి పార్వతికి శంకరుడు చెప్పిన కథ ఇదే


హేరంబ గణపతిని ధ్యానిస్తే సర్వ శుభాలు, విజయాలు చేజిక్కుతాయంటారు. ఈ విషయాన్ని హేరంబోపనిషత్‌ ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడట. ప్రాణులంతా దుఃఖాలు పోగొట్టుకుని సుఖాలు పొందడం ఎలా అన్నదానికి ఉపాయం చెప్పమని పార్వతి అడిగితే  శివుడు తన అనుభవంలోకి వచ్చిన విషయాన్నే ఆమెకు వివరించి చెప్పాడు. 


హేరంబ గణపతి గురించి శివుడు పార్వతికి ఏం చెప్పాడంటే
దేవతలను వేధించిన త్రిపురాసుర సంహారం కోసం స్వయంగా శివుడు రంగంలోకి దిగుతాడు.తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు. అప్పుడు హేరంబ గణపతిని ధ్యానించి ఆ గణపతి శక్తిని తన బాణంలో నిక్షిప్తం చేసి త్రిపురాసురుడిని సంహరిస్తాడు. బ్రహ్మ, విష్ణు తదితర దేవతలు కూడా హేరంబ గణపతి రక్ష వల్లనే తమ తమ స్థానాలలో సుఖంగా ఉండగలుగుతున్నారట. ఈ కారణంతోనే వినాయకుడిని ప్రభువులకే ప్రభువు అంటారు. 


Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే


అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా 
అంటూ హేరంబ గ‌ణ‌ప‌తిని కొలుస్తారు. ముఖ్యంగా ప్రయాణ స‌మ‌యాల‌్లో ఎలాంటి ఆప‌ద క‌లుగ‌కుండా ఉండేందుకు ఈ గ‌ణ‌ప‌తిని త‌లుచుకుంటారు. ఇంత ప్రత్యేక‌మైన హేరంబ గ‌ణ‌ప‌తి కాశీవంటి కొద్దిపాటి క్షేత్రాల‌లో మాత్రమే కొలువై ఉన్నాడు. హేరంబ గణపతిని పూజిస్తే ఎంతటి కష్టమైనా తీరిపోతుందని చెబుతారు. సింధూర వర్ణంతో కనిపించే హేరంబ గణపతి పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది.