సంధ్యాసమయంలో ఆ కోరిక ఎందుకు తగదో తెలియాలంటే ముందు హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడి పుట్టుక గురించి తెలుసుకోవాలి...
కళ-మరీచిమహర్షుల కుమారుడు కశ్యపమహర్షి. ప్రసూతి-దక్షప్రజాపతి దంపతులు తమ కుమార్తెలు 13 మందిని వారి ఇష్ట ప్రకారం కశ్యపునకు ఇచ్చి వివాహం చేశారు. వారే అదితి, దితి, ధను, కష్ట, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, వినత, కద్రు. వీరిలో దితితో తప్ప మిగిలిన భార్యలందరితోనూ కశ్యప మహర్షికి సంతానం కలిగింది. దితి మనసులో అదే కోరిక మిగిలిపోయింది. సంతానం కావాలనే బలమైన కోరికతో ఉన్న దితి..ఒకరోజు విరహవేదన భరించలేక వాంఛతో కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లింది. ఆయన అప్పుడే అగ్నికార్యం నెరవేర్చి సూర్యాస్తమం సమయంలో హోమశాల ముందు కూర్చుని ఉన్నారు. ఆసమయంలో అక్కడకు వచ్చిన దితి తన మనసులో కోర్కెను బయటపెట్టింది.కశ్యపునితో దితి వినయంగా..“స్వామీ నాతోడి సవతులు అందరు నీ కృపవల్ల గర్భవతులై సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం వ్యాకులమైన మనస్సుతో బాధపడుతున్నాను ..పుత్రభిక్ష పెట్టమని వేడుకుంది. అప్పుడు కశ్యపుడు ఏమన్నాడంటే...
"ఒక్క ముహూర్తకాలం ఆగు..ఇది సంధ్యాసమయం...ఇప్పుడు మన్మథునికి శత్రువైన శివుడు వృషభ వాహనుడై భూతగణాలతో కూడి విహరిస్తూ ఉంటాడు..కాబట్టి ఈ సమయం మంచిది కాదు. ఈ వేళలో కలయిక నిషేధం..మనం ధర్మాన్ని ఎందుకు అతిక్రమించాలి" అన్నాడు. అయినా సరే దితి తన పట్టు వదలలేదు. కశ్యపుడు తన భార్య కోరికను కాదనలేక పరమేశ్వరుడికి నమస్కరించి ఏకాంతంగా తన భార్య కోరిక తీర్చాడు. ఆ క్షణం నుంచి తేరుకున్న తర్వాత దితికూడా తాను చేసిన అపరాధాన్ని తలుచుకుని సిగ్గుతో తలవంచుకుంది.
“అందరినీ సంరక్షించే ఓ పరమేశ్వరా నేను చేసిన అపరాధాన్ని క్షమించి నా గర్భాన్ని రక్షించు" అని వేడుకుంది
Also Read: వైకుంఠ ద్వారపాలకులు విష్ణు మూర్తికి ఎందుకు విరోధులయ్యారు? మూడు జన్మలనే ఎందుకు ఎంచుకున్నారు?
ఆ తర్వాత దితి గర్భం దాల్చింది. దితి ఎంతో సంతోషించింది కానీ.. కశ్యుపుడుమాత్రం...
కశ్యపుడు: “నువ్వు మోహానికి తట్టుకోలేక , లోకనిందకు జంకకుండా సిగ్గూ భయమూ విడిచి పెట్టి, అకాలంలో వ్యామోహానికి లొంగిపోయావు. అందుకే భూతగణాలచే ప్రేరేపించబడిన ఆ భగవంతుని అనుచరులు నీకు కుమారులై జన్మిస్తారు. మిక్కిలి శక్తి సంపన్నులూ, భయంకరమైన కార్యాలు చేసేవారూ, మహా బలవంతులు, అతి గర్విష్టులూ అయిన వారిద్దరూ తమ పరాక్రమంతో నిరంతరం సజ్జనులను బాధిస్తూ భూమికి భారమవుతారు. చివరకు ఆ శ్రీహరి చేతిలో హతమవుతారు.” అని చెప్పాడు
దితి: 'మన కుమారులు ఆర్యులకు అపరాధం చేసినందువల్ల ఆ బ్రాహ్మణుల కోపాగ్నికి బలికాకుండా, భగవంతుడైన శ్రీహరి చేతులలో మరణించడమనేది మహాభాగ్యం' అంది దితి.
కశ్యపుడు: నువ్వు చేసిన విపరీతకార్యం వల్లనే ఈ దురవస్థ వచ్చింది. బాధపడొద్దు..ఆ శ్రీహరిని భక్తితో ప్రార్థించు.. నీ కొడుకుల్లో హిరణ్యకశిపుడికి పుట్టే సంతానంలో నుంచి ధర్మబుద్ధి గలవాడూ, శ్రీహరి మీద మిక్కిలి భక్తి భావం కలవాడూ ( ప్రహ్లాదుడు) జన్మిస్తాడు. దుర్మార్గుడైన హిరణ్యకశిపుని పుత్రుడే అయినప్పటికీ శ్రీహరి భక్తుడు కావటం వల్ల వంశానికి పరమ పవిత్రుడౌతాడు.
Also Read: కార్తీకమాసం ఎప్పటితో ఆఖరు, పోలిపాడ్యమి రోజు ఇలా చేస్తే పుణ్యం మొత్తం మీదే!
భువన కంఠకులైన ఇద్దరు కుమారులను కన్నది దితి. ఆ సమయంలో భూమి కంపించింది, పర్వతాలు వణికాయి,సముద్రాలు ఉప్పొంగాయి, నక్షత్రాలు నేల రాలాయి, అష్ దిక్కులు ఊగిపోయాయి, దిక్కుల్లోంచి నిప్పులు ఎగసిపడ్డాయి,భూమిపై పిడుగులు పడ్డాయి... ఇద్దరు పిల్లలు భూమ్మీద పడ్డారు. కుమారులను చూసేందుకు వచ్చిన కశ్యపుడు... “హిరణ్యకశిపుడు” , “హిరణ్యాక్షుడు” అనీ నామకరణం చేసాడు.
సంధ్యా సమయం ఎంత పవిత్రమైనదో అంతకన్నా శక్తివంతమైనది. అందుకే ఈ సమయంలో కేవలం దైవ ప్రార్థనలో మాత్రమే ఉండాలి కానీ ఎలాంటి శృంగార కార్యకలాపాలకు పాల్పడకూడదంటారు. కాదు కూడదు అనుకుంటే ఇలాంటి రాక్షస లక్షణాలున్నావారే భూమ్మీద అడుగుపెడతారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో అరాచకాలకు ఇలాంటి వారే కారణం అవుతున్నారు..అందుకే దేనికైనా సమయం సందర్భం ఉంటుంది అంటారు...