Religious News in Telugu: గుడి ఒక పవిత్ర స్థలం, ఇక్కడ భక్తులు పూజలు, ప్రార్థనలు, ఆచారాలు, ధ్యానం, దర్శనం చేస్తారు. గుడిని దైవిక నివాసం, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా భావిస్తారు. గుడిలో పవిత్రత, స్వచ్ఛత , శాంతిని కాపాడటం ప్రతి భక్తుడి కర్తవ్యం. అందుకే ఆలయంలోపలకు చాలా వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతించరు. ఇందులో భాగమే మొబైల్ ఫోన్..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగమైపోయింది. శరీరంలో భాగంగా మారిపోయింది. ఒక్క క్షణం ఫోన్ పక్కనపెట్టిన ప్రపంచానికి దూరంగా ఉన్నట్టే భావిస్తున్నారు. మరి మతపరమైన ప్రదేశాల్లోకి ఫోన్ తీసుకెళ్లడం సరైనదేనా? గుడిలోకి ఫోన్ తీసుకెళ్లడం అశుభమా? మతపరమైన , శాస్త్రీయ కోణం నుంచి ఇది సముచితమేనా?
మతపరమైన కోణంలో చూస్తే...ఆలయాన్ని భగవంతుని పవిత్ర స్థలంగా భావిస్తారు. అందువల్ల, ఇక్కడ ధ్యానం, భక్తి ఏకాగ్రత అవసరం, అయితే ఫోన్ వాడకం ఏకాగ్రతను భంగపరుస్తుంది. ఫోన్ దగ్గర ఉంటే, మీ దృష్టి పదేపదే ఫోన్ మీదే ఉంటుంది, దీనివల్ల పూజలు లేదా ధ్యానానికి ఆటంకం కలుగుతుంది.
శాస్త్రపరంగా దీన్ని ప్రూవ్ చేయలేం ఎందుకంటే...ఆలయంలో నియమాలు మొదలయ్యేనాటికి మొబైల్స్ లేవు. అందుకే వీటి గురించి శాస్త్రాల్లో ఎలాంటి ప్రవస్తావన ఉండదు. కానీ కొన్ని శ్లోకాల్లో ఆచరణాత్మక నియమాల గురించి ప్రస్తావన ఉంటుంది
"శౌచాచ మనః సంయమో భక్తిః, శుద్ధ వస్త్రం సమాహితః।
తేనైవ దేవపూజా కార్యం, ధర్మోఁయం సనాతనః॥"
దేవతారాధనలో మానసిక ఏకాగ్రత, స్వచ్ఛత , క్రమశిక్షణ అవసరం. దీని నుంచి భగవంతుని పూజించేటప్పుడు ఏకాగ్రత, స్వచ్ఛతకు భంగం కలిగించే పని లేదా వస్తువును దగ్గర ఉంచుకోకూడదని స్పష్టమవుతుంది.
మొబైల్‌లో రింగ్ టోన్, నోటిఫికేషన్‌లు లాంటి శబ్దం మతపరమైన వాతావరణాన్ని అపవిత్రం చేయవచ్చు. దాని శబ్దం మీ దృష్టిని మాత్రమే కాకుండా, గుడిలో ఉన్న ఇతర భక్తుల దృష్టిని కూడా మరల్చుతుంది. అందుకే చాలా మంది మత గురువులు మొబైల్ ఫోన్‌ల వల్ల మతపరమైన పనులు ప్రభావితమవుతాయని నమ్ముతారు.
మొబైల్ తీసుకెళ్లొచ్చా?
ఇంతకీ గుడిలోకి మొబైల్ తీసుకెళ్లడం సరైనదా లేదా తప్పా అనేదానికి మతపరమైన మరియు శాస్త్రీయ కోణం నుంచి తప్పు అనే అంశాలు వేర్వేరుగా ఉండవచ్చు. కానీ ఆధునిక కాలంలో లేదా డిజిటల్ యుగంలో భక్తి విధానం కూడా మారుతోందనే వాస్తవాన్ని కూడా కాదనలేం. భగవంతుని ఆన్‌లైన్ దర్శనం పూజల వ్యవస్థ కూడా ఉంది. కొన్ని గుడుల్లో ఫోన్ తీసుకెళ్లడం నిషేధించినప్పటికీ, కొన్ని గుడులలో నిషేధం లేదు. భక్తులు మొబైల్ తీసుకెళ్లి ఫోటోలు , వీడియోల ద్వారా వారి ఆధ్యాత్మిక యాత్రను భద్రపరుచుకుంటారు. పైగా ఈ రోజుల్లో ఆలయాల్లో డిజిటల్ విరాళాలు లేదా సహకారాల వ్యవస్థ కూడా ఉంది. అందుకే సాంకేతికత భక్తిని సరళంగా, సులభంగా విస్తృతంగా చేసిందని చెప్పడంలో తప్పులేదు. కానీ గుడిలో మొబైల్ తీసుకెళ్లడంపై ఎల్లప్పుడూ పూజల పవిత్రత మరియు సాంప్రదాయంపై ప్రశ్నలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో, పరిష్కారం ఏంటి?
మతపరమైన స్థలం లేదా గుడికి మొబైల్ తీసుకెళ్తే, మొబైల్ ఫోన్ సైలెంట్ లేదా స్విచ్ ఆఫ్ చేయడం మంచిది
గుడిలో దర్శనం, ధ్యానం, మంత్ర జపం లేదా పూజల సమయంలో పదేపదే ఫోన్ తీసి మెసేజ్‌లు లేదా నోటిఫికేషన్‌లు చూడకండి
చాలా గుడులలో ఫోన్‌లను డిపాజిట్ చేయడానికి మొబైల్ కౌంటర్‌లు ఉన్నాయి, మీరు అక్కడ మీ ఫోన్‌లను డిపాజిట్ చేయవచ్చు
కొన్ని ఆలయాల్లో ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి ఉంది, మరికొన్ని ఆలయాల్లో నిషేధం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆలయాల నియమాలు పాటించాలి
మీరు QR కోడ్ ద్వారా గుడికి విరాళం ఇస్తుంటే, విరాళం లేదా సహకారం కోసం మాత్రమే మొబైల్‌ను ఉపయోగించండి. కానీ ఇది మీ పూజను ప్రభావితం చేయకుండా చూసుకోండి.
ప్ర: ఆలయంలోకి మొబైల్ తీసుకెళ్లడం పాపమా?
A: లేదు, గుడిలోకి మొబైల్ తీసుకెళ్లడం పాపం కాదు. కానీ మీ పూజకు, ఇతరుల భక్తిభావానికి అడ్డంకిగా మారకూడదు
ప్ర: మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచి తీసుకెళ్లవచ్చా?
A: మొబైల్ నిషేధించని ఆలయాల్లోకి సైలెంట్ మోడ్ లో పెట్టి కానీ స్విచ్చాఫ్ చేసి కానీ తీసుకెళ్లొచ్చు
ప్ర: ఆలయంలోకి ఏం తీసుకెళ్లకూడదు?
A: తోలుతో చేసిన వస్తువులు, పదునైన వస్తువులు , ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు మరియు సమాచారం ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.