మొన్నటి వరకూ విడాకులు తీసుకుంటోందంటూ వార్తల్లో ఉన్న శ్రావణ భార్గవి ఇప్పుడు అన్నమయ్య కీర్తనను అవమానించింది అంటూ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. 'ఒకపరి కొకపరి కొయ్యారమై' అనే పాట అర్థం ఏంటంటే...


పల్లవి :
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున గళలెల్లా మొలచినట్లుండె


చరణం 
జగదేకపతిమేన జల్లిన కర్పూరధూళి
జిగిగొని నలువంక జిందగాను
మొగి జంద్రముఖి నురమున నిలిపెగనక
పొగరువెన్నెల దీగబోసినట్లుండె


చరణం 
పొరి మెఱుగు జెక్కుల బూసిన తట్టుపుణుగు
కరగి యిరుదెసల గారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
టతొరిగి సామజసిరి దొలికినట్లుండె


చరణం 
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తఱచయిన సొమ్ములు ధరియించగా
మెఱుగుబోణి యలమేలుమంగయు దాను
మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె


ఈ కీర్తన అర్థం
కళలన్నీ ముఖంలో మొలకలెత్తినట్లు నిత్యం కొత్తకొత్త ఒయ్యారాలతో కనిపిస్తుందట పురుషోత్తముని ముఖం! దానికి కారణం ఏంటో చిరణాల్లో వివరించారు పెదతిరుమలయ్య.  అలంకరణకోసం దేవుడి ఒంటిపై చల్లిన కర్పూరధూళి కింద రాలుతుంది. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతూ నలువైపులా రాలుతూ ఉందట. తెల్లటి ధూళి చిందితే వెలుతురు రావడం ఏంటంటారా..అమ్మవారు చంద్రముఖికదా? ఆమెను గుండెపైన అయ్యవారు పొదుముకున్నారుకదా? రాలే తెల్లటి కర్పూర ధూళి పొగరువెన్నెలలు కురిసినట్టు కనిపిస్తుందంటే అది ఆ చంద్రముఖి మహిమేనని భావన. భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలురకం పునుగు చెక్కిళ్ళనుంచి కారుతుందట. రెండుపక్కలా కారుతున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపుటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట. (మగ ఏనుగుకి మదమెక్కిన సమయాల్లో ఒంటిలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఎక్కువవ్వడంవల్ల కంటికీ చెవికీ మధ్యభాగంలో నీరు ఊరి స్రవిస్తుంది). మదపుటేనుగుతో పోల్చడం ఏంటి? అమ్మవారిని కరిగమన అని అంటాం కదా అంటే ఏనుగులాంటి ఒయ్యారమైన నడకగలది అని అర్థం. అందుకే స్వామివారిని కరిగమన విభుడు అన్నాడు కవి. దేవుడికి దేవిపైనున్న మోహాన్ని మదపుటేనుగు చంపలపైన ఒలికిపోతున్న ద్రవంతో పోల్చాడు కవి.


Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!


వివాదం ఎందుకంటే!
‘అన్నమయ్య పెద్ద కుమారుడు పెదతిరుమలాచార్యులు స్వామివారికి అభిషేకం చేస్తూ కీర్తించిన ఈ పాటను శ్రావణ భార్గవి తన అందాన్ని వర్ణించుకుంది అన్నదే ఇప్పుడు వివాదం. భార్యని గుండెలపై పెట్టుకుని తిరుమల కొండపై కొలువైన వెంకన్నకు సంబంధించిన ఈ వర్ణని...ఆమె కాళ్లు ఊపుతూ, తన అందాన్ని వివిధ భంగిమల్లో చూపిస్తూ చిత్రీకరించడం తప్పు అంటున్నారు  అన్నమయ్య వంశస్థులు, పలువురు భక్తులు.ఈ పాటను రెండు రోజుల క్రితమే యూట్యూబ్ లో పోస్టు చేసింది శ్రావణ భార్గవి.ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.