Ramayapatnam Port News: రామాయపట్నం పోర్టు పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు (జూలై 20) ప్రారంభించనున్నారు. పోర్టు పనులకు అన్ని అనుమతులు వచ్చినందున రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు బుధవారం భూమి పూజ జరగనుంది. ఆ తర్వాత నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. 


రూ.3,736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు జరగనున్నాయి. తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం ఉంటుంది. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ఉంటుంది. ఏడాదికి 25 మిలియన్‌ టన్నుల సరకు ఎగుమతి చేయనున్నారు. రెండోదశలో 138.54 మిలియన్‌ టన్నులకు విస్తరిస్తారు. అప్పటికి మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం పూర్తవుతుంది. పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు,  తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ్య, రవాణా సేవల్లో రామాయపట్నం పోర్టు కీలకం కానుంది. ఈ పోర్టు ద్వారా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సులభతరం అయ్యాయి. ఇదే పోర్టుతోపాటు మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం కూడా జరుగుతుంది.


రామాయపట్నం పోర్టు ద్వారా ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం లభిస్తుంది. ప్రకాశం జి

ల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్మిస్తోంది. బొగ్గు, ఇనుపఖనిజం, గ్రానైట్, ఆహార ధాన్యాలు, బియ్యం సహా ఇతర ధాన్యాలు, సిమెంటు, ఫెర్టిలైజర్స్, పొగాకు, మిర్చి, ఆక్వా ఉత్పత్తులు, కంటైనర్లు తదితర రవాణాలో ఈ పోర్టు కీలకం కానుంది.


రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవారంగానికి ఈ పోర్టు ఊతం ఇవ్వనుంది. ఫుడ్‌ప్రాసింగ్, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్, విద్యుత్, టెక్స్‌టైల్, టూరిజం రంగాలకు పోర్టు ద్వారా మేలు జరుగుతుంది. ఔషధాలు, రసాయనాలు, ప్లాస్టిక్, ఖనిజాలు, చేతి వృత్తులు, టెక్స్‌టైల్స్, లెదర్‌ తదితర ఎగుమతుల్లో రాయాయపట్నం పోర్టు కీలకం కానుంది. 


9 ఫిషింగ్ హార్బర్‌లు కూడా
ప్రతి కోస్తా జిల్లాలకూ ఒక ఫిషింగ్‌ హార్బర్‌ ఉండేలా 9 హార్బర్లను ప్రభుత్వం నిర్మిస్తుంది. రూ.3,500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్‌ హార్బర్ల నిర్మాణం అవుతాయి. ఫేజ్‌–1లో 4 హార్బర్ల నిర్మాణం ఉంటుంది. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలి దశలో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం ఉంటుంది. రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరగనుంది. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తారు. వీటిద్వారా 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తులు సేకరణకు వీలు కలుగుతుంది. వీటి ద్వారా విస్తృతంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికవ్యవస్థ మెరుగు అవుతుంది. దాదాపు 85 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.