Shravan Shukrawar:  అష్టకష్టాలు అంటే ఎనిమిది రకాల కష్టాలు. వీటిని తీర్చే శక్తి అష్టలక్ష్మిలకే ఉందని చెబుతారు పండితులు. మరీ ముఖ్యంగా శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణశుక్రవారం రోజు అష్టలక్ష్మిలను పూజిస్తే రెట్టింపు ఫలితాలు పొందుతారంటారు. ఇంతకీ అష్టలక్ష్మిలు ఎవరు, ఏ లక్ష్మిని పూజిస్తే  ఎలాంటి కష్టం తీరుస్తుందో తెలుసుకుందాం...
 
1. ఆదిలక్ష్మి
వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉంటుంది ఆదిలక్ష్మి. లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలం పవిత్రతకు చిహ్నం. ఈమెనే ఇందిరాదేవి అని కూడా పూజలందిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధిస్తే సంతోషం మీ సొంతం. 


2. ధాన్య లక్ష్మి 
ధాన్యం అంటే పండించిన పంట. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించటం వలన  ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు. పంటలు సరిగ్గా పండాలన్నా, అతివృష్టి-అనావృష్టి రాకుండా ఉండాలన్నా ధాన్య లక్ష్మి అనుగ్రహం ఉండాలి.


3. సంతాన లక్ష్మి 
సంతాన లేమి సమస్య తీర్చే శక్తి సంతాన లక్ష్మికి ఉంది. కొందరు పిల్లలు లేక బాధపడితే మరికొందరు పిల్లలు కలిగినప్పటకీ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడతుంటారు. సంతాన లక్ష్మిని పూజిస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు. 


4. గజలక్ష్మి 
క్షీరసాగర మథనం సమయంలో సముద్రుడి కుమార్తెగా ఉద్భవించింది గజలక్ష్మి. రెండు ఏనుగులు అమ్మవారి పక్కన నిలబడి జలధారని కురిపిస్తూ ఉంటాయి.  ఇక్కడ ఏనుగులను గణపతి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించటం వల్ల నూతన గృహం,  వాహనాలు సమకూరుతాయని విశ్వాసం


Also Read: దైవారాధన నుంచి ఖగోళంలో జరిగే అద్భుతాల వరకూ అన్నిటికీ ఈ పురాణాలే ఆధారం!


5. ధైర్య లక్ష్మి 
సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే వారితో సమస్య లేదు కానీ చిన్న కష్టం రాగానే కుంగిపోయేవారితోనే పెద్ద సమస్య. ఇలాంటి వారు ప్రార్థించాల్సింది ధైర్య లక్ష్మిని. ధైర్య లక్ష్మికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉండేది. ఒక మహారాజు గ్రహస్ధితి బాగోపోవడంతో  అష్ట లక్ష్మిలు అందరూ ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు. చివరిగా వెళ్లిపోతున్న ధైర్యలక్ష్మిని మాత్రం తనని విడిచి వెళ్లొద్దని వేడుకున్నాడట రాజు. అందరూ వెళ్లిపోయినా ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు మళ్లీ వారందరినీ పొందగలనని నమ్మకంగా చెబుతాడు.


6. విజయ లక్ష్మి
ప్రారంభించిన  ప్రతి పనిలోనూ విజయం సాధించాలన్నా..జీవితంలో ప్రతి అడుగు సక్సెస్ ఫుల్ గా పడాలన్నా విజయలక్ష్మి అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగించి సక్సెస్ అను అందిస్తుంది విజయలక్ష్మి. 


7. ధనలక్ష్మి
ధన లక్ష్మి అంటే సంపద, బంగారం మాత్రమే కాదు ప్రకృతి నుంచి లభించే ప్రతి వస్తువు ధనలక్ష్మి ఖాతాలోవే. అంటే పచ్చని చెట్లు, పండ్లు, పూలు, కురిసే వర్షాలు ఇవన్నీ సంపదే.ధనంగా మారేది ఇవే కదా. 


Also Read: మీ దంతాలు ఊడినట్టు కలొచ్చిందా - అది దేనికి సంకేతమో తెలుసా!


8. విద్యాలక్ష్మి
ఆధ్యాత్మికం, భౌతికం ఎందులో ఏ విద్య అయినా అందులో అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే విద్యాలక్ష్మి దయ ఉండాలి. విద్యా లక్ష్మి కరుణ లేకుండా ఏమీ సాధించలేరు. 


అష్ట లక్ష్మీదేవిలను పూజిస్తే షోడశ (16) ఫలాలు లభిస్తాయని చెబుతారు
1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం, బలం
4 విజయం , 5 సత్సంతానం, 6 యుద్ధ నైపుణ్యం
7 బంగారం ఇతర సంపదలు, 8 సంతోషం
9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం
12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు, ధ్యానం
14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః


శ్రావణ శుక్రవారం పఠించాల్సిన అష్టలక్ష్మీ స్తోత్రం

ఆదిలక్ష్మి 
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||


ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||


ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||


గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||


సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||


విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||


విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||


ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||


Also Read: అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ద్రౌపది అడిగిన ఒకే ఒక ప్రశ్న!


ఫలశృతి
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||


శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్