అష్టాదశ పురాణాలు
1. మత్స్యపురాణం
మత్స్యరూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు మనువు అనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు లాంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏంటి? ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటి? వీటన్నింటి వివరణ ఉంటుంది.
2. కూర్మపురాణం
కూర్మావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
3. వామన పురాణం
పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతం, రుతువుల గురించిన వర్ణన ఉంటుంది.
Also Read: ఈ రోజు (ఆగష్టు 16 ) అధికమాస అమావాస్య - ఆచరించాల్సిన విధులివే!
4. వరాహపురాణం
వరాహావతారం దాల్చిన శ్రీ మహా విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
5. గరుడ పురాణం
గరుత్మంతుడి సందేహాలపై శ్రీ మహావిష్ణువు చెప్పిన వివరణ గరుడ పురాణం. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది లాంటి విషయాలు ఉంటాయి.
6. వాయుపురాణం
వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో పరమేశ్వరుడి మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు ఉంటాయి.
7. అగ్నిపురాణం
అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు
8. స్కాందపురాణం
కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం సహా వివిధ ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడు. ఇందులో రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి ఉంటుంది
9. లింగపురాణం
లింగరూప శివుడి ఉపదేశాలు, శివుడి మహిమలతో పాటూ ఖగోళ, జ్యోతిష్యం గురించి వివరిస్తుంది లింగ పురాణం.
10. నారద పురాణం
బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారద మహర్షి చెప్పిన ఈ పురాణంలో వేదాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి ఉంటుంది.
11. పద్మపురాణం
ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి వివరణాత్మకంగా ఉంటుంది
12.విష్ణుపురాణం
పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన విష్ణుపురాణంలో..శ్రీ మహా విష్ణువు అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్ర ఉంటుంది.
Also Read: మీ దంతాలు ఊడినట్టు కలొచ్చిందా - అది దేనికి సంకేతమో తెలుసా!
13.మార్కండేయ పురాణం
మార్కండేయ పురాణంలో శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.
14.బ్రహ్మపురాణం
బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి ప్రస్తావించారు వ్యాసమహర్షి
15. భాగవత పురాణం
భాగవత పురాణంలో శ్రీ మహావిష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి శకమహర్షి చెప్పగా..శకుడికి మొదట బోధించాడు వ్యాసమహర్షి
16. బ్రహ్మాండ పురాణం
బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి ఉంటుంది.
Also Read: అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ద్రౌపది అడిగిన ఒకే ఒక ప్రశ్న!
17.భవిష్య పురాణం
మనువుకు సూర్యభగవానుడు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది.
18.బ్రహ్మావైవర్తపురాణం
బ్రహ్మావైవర్తపురాణంలో భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి.
మొత్తం ఈ 18 పురాణాలలో మార్కండేయ పురాణం చిన్నది..పద్మపురాణం పెద్దది..
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.