దేవాదిదేవుడైన మహాదేవుని ఆరాధనకు శివరాత్రి అత్యంత ముఖ్యమైన రోజు. పవిత్రమైన ఈ రోజున శివారాధనలో చేసే కీర్తన, ధ్యానం, పూజా పారాయణం ఇలా అన్ని ప్రక్రియలకు నియమనిబంధనలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా ఆ దేవదేడుడి అనుగ్రహం పొందవచ్చు. వీటిని అస్సలు విస్మరించకూడదు.


ఈ ఏడాది ఫిబ్రవరి 18, శనివారం రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. ప్రతి నెలలోని కృష్ణపక్ష త్రయోదశిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. సంవత్సరంలోని చివరి మాసమైన ఫల్గుణ మాసం కృష్ణ పక్ష త్రయోదశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివ భక్తులు ప్రతి మాస శివరాత్రి రోజున కూడా ప్రత్యేక శివారాధన చెయ్యడం నియమానుసారం ఆరోజు గడపడం చేస్తుంటారు. కానీ మహా శివరాత్రి మాత్రం హిందువులంతా కూడా జరుపుకుంటారు. ఈ రోజున శివారాధన చేసిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని ప్రతీతి. శివపురాణాన్ని అనుసరించి ఈరోజున శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. మహా శివరాత్రి రోజున శివారాధనకు జపం, ధ్యానం, పూజ, పారాయణం వంటి వాటన్నింటి కోసం ప్రత్యేక నిమయాలు ఉన్నాయి. శివరాత్రి రోజున చెయ్యాల్సిన పూజా విధానం, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


⦿ శివారాధనకు పొరపాటున కూడా తులసి ని ఉపయోగించకూడదు. ఇది అత్యంత ముఖ్యమైన నియమం.


⦿ శివుడు అభిషేక ప్రియుడు. కానీ శివాభిషేకంలో విష్ణువుకు జరిపినట్టుగా శంఖాన్ని ఉపయోగించకూడదు. ఇది పెద్ద దోషంగా పరిగణించబడుతుంది.


⦿ శివారాధనకు ఉపయోగించే పాత్రలు రాగి వైతే చాలా శ్రేష్టం. రాగి పాత్రలతో మాత్రమే శివాభిషేకం చెయ్యాలి. మరే లోహపు పాత్రను ఇందుకు వినియోగించకూడదు.


⦿ రాగి పాత్రలో శివుడికి నీళ్లు సమర్పించవచ్చు. కానీ శివుడికి పాలు నైవేద్యంగా ఇవ్వకూడదు. శివపూజలో పాలు నైవేద్యంగా పెట్టకూడదనే నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.


⦿ శివరాత్రి రోజున ఉపయోగించే ఎలాంటి నైవేద్యమైనా  దేవుడికి సమర్పించిన తర్వాత తప్పకుండా అందరికీ పంచాలి.


⦿ శివరాత్రి రోజున పూజకు ఉపక్రమించే ముందు మీరు ఎటు వైపు తిరిగి కూర్చుంటున్నారనేది కూడా చాలా ముఖ్యం. తప్పకుండా మీరు ఉత్తరాభిముఖం లేదా తూర్పు అభిముఖంగా కూర్చుని పూజ చేసుకోవాలి.


⦿ మహా శివరాత్రి రోజున శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు, శమీ పత్రాల తొడిమె మొదటి భాగాన్ని తీసివేయాలి. ఆ తర్వాతే శివలింగం మీద ఉంచాలి. తొడిమెలతో కూడిన పత్రాలను శివుడికి సమర్పించకూడదు.


⦿ గోగుపూల సేవ శివుడికి ప్రీతి పాత్రం. కనుక వీలైతే గోగుపూలతో ఈరోజున శివపూజ చేసుకోవడం మంచిది.


⦿ శివరాత్రి రోజు చేసే అభిషేకానికి అవసరమైన వస్తువులన్నీంటిని ముందుగానే సేకరించి అందుబాటులో పెట్టుకున్న తర్వాత పూజకు ఉపక్రమించాలి. పూజ మధ్యలో లేవకూడదు. 


⦿ శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం.


⦿ కేవలం పూజ, ఆరాధన మాత్రమే కాదు, ఈరోజున ప్రశాంతంగా గడపాలి. ఎక్కువగా మాట్లాడడం, ఆవేశకావేశాలకు లోనవడం చెయ్యకూడదు.


⦿ చాలా మంది ఈరోజంతా ఉపవాసం చేస్తారు. అంతేకాదు రాత్రి జాగరణ కూడా చేస్తారు. ఈ రాత్రి నడుము వాల్చకూడదని పురాణాలు చెబుతున్నాయి.



Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?