Mla Vasantha Krishna Prasad : మైలవరం పంచాయితీ మళ్లీ మొదలైంది. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ కలగజేసుకుంటున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తిలో ఉన్నారు. ఆ మేరకు ఆయన నిన్న సీఎం జగన్ ను కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలపై చర్చించారు. తాజాగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... మంత్రి జోగి రమేశ్‌ తీరుతోనే మైలవరం వైసీపీలో సమస్యలు వచ్చాయని ఆరోపించారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదని సీఎం జగన్‌ స్పష్టత ఇచ్చారన్నారు. తాను ఎవరి నియోజకవర్గంలో జోక్యం చేసుకోనన్న ఆయన.. మైలవరం నియోజకవర్గంలో మాత్రం ఎవరైనా కలగజేసుకుంటే సహించేది లేదన్నారు. నియోజకవర్గంలో విభేదాలు తన వరకు రాకముందే  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపేయడం సరికాదని సీఎం జగన్ అన్నారని, ఇకపై ఆ కార్యక్రమం పూర్తిచేయాలని జగన్‌ సూచించారని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌ అన్నారు. గతంలో ముగ్గురు మంత్రులతో పనిచేసినా ఎప్పుడూ విభేదాలు రాలేదన్నారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్‌ కల్పించుకోవడంతో సమస్యలు వస్తున్నాయన్నారు.  


సీఎం వద్దకు పంచాయితీ 


మైలవరం నియోజకవర్గం వైసీపీలో వర్గవిభేదాలు నడుస్తున్నాయి.  వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్ మధ్య నెలకొన్న వివాదాలు సీఎం జగన్ వరకూ వెళ్లాయి.  ఇరువురి నేతల అనుచరులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం వ్యతిరేకంగా ప్రచారం చేసుకునే వరకూ వెళ్లింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ను సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. ఈ సమావేశంలో మైలవరంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.  ఈ భేటీ మంత్రి జోగిరమేశ్‌పై వసంత కృష్ణ ప్రసాద్‌ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.  


అసంతృప్తులపై ఫోకస్ 


ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త తరహా రాజకీయం కనిపిస్తోంది. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. వరుసగా పార్టీలో విభేదాలు బహిర్గతం కావటం, నెల్లూరు వంటి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో సైతం అసంతృప్తు స్వరాలు పెరగడంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యిందని చెబుతున్నారు. దీంట్లో భాగంగా శాసన సభ్యులు అసంతృప్తులుగా ప్రచారం జరుగుతున్న చోట్ల పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. అలాంటి శాసన సభ్యులు ఇప్పటికే పలుమార్లు పార్టీ అగ్రనేతలను కలసి పూర్తి తమ వివరణ ఇచ్చారు. అంతే కాదు తమ ఇబ్బందులను కూడా నాయకత్వానికి వివరించారు. అధికార పార్టీ శాసన సభ్యులు అసంతృప్తి పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని క్యాడర్‌కు కూడా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది అధిష్ఠానం. ప్రతిపక్షానికి కూడా అవకాశాలు చేతిలో పెట్టినట్లు అవుతుందని అంచనా వేస్తోంది. అలాంటి నేతలందరికీ విషయంలో ఓ కీలకమయిన ఆదేశం జారీ చేసిందట అధినాయకత్వం. ఫలాన శాసన సభ్యుడు అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుందని పార్టీ అగ్రనాయకత్వానికి తెలిసిందంటే చాలు ఆయా ఎమ్మెల్యేలంతా నెలకు ఒకసారి అయినా ప్రెస్‌మీట్ పెట్టి, వాస్తవాలను గురించి వివరించాలని ఆదేశాలు ఇచ్చిందట. సో ఆయా శాసన సభ్యులు అంతా ఇప్పుడు వరుసగా ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ పార్టీ గురించి చెబుతారట.