సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డిని గంటకుపైగా చిత్రహింసలు పెట్టి, అతి క్రూరంగా గొడ్డలితో నరికి హత్య చేసిన తీరు ఇదే అంటూ తెలుగుదేశం పార్టి ప్రత్యేకంగా పుస్తకాన్ని ముద్రించింది. ఈ పుస్తకాన్ని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు, ఇతర నేతలతో కలసి రిలీజ్ చేశారు. గుండెకు స్టంట్స్‌ వేయించుకొని చికిత్స పొందుతున్న 70 ఏళ్లు పెద్ద మనిషి వివేకానందరెడ్డిని 2019 మార్చి 15 రాత్రి 1 గంటల నుంచి 3 గంటల మధ్య కిరాతకంగా హత్య చేశారని తెలిపారు. వివేకా గృహంలోకి ప్రవేశించిన నరహంతకులు ఆయన ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతోపాటు ఛాతీ మీద ఏడు సార్లు కొట్టారని పుస్తకంలో తెలుగుదేశం పేర్కొంది. ఆ తరువాత గొడ్డలి వేటు వేశారని, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వివేకాతో బలవంతంగా తన డ్రైవర్‌ ప్రసాద్‌ చంపబోయాడంటూ అతన్ని వదిలిపెట్ట వద్దంటూ ఉత్తరం రాయించి సంతకం పెట్టించారని వెల్లడించింది. ఆ తరువాత బెడ్‌ రూమ్‌ నుంచి బాత్‌రూమ్‌కు లాక్కెళ్లి కిరాతకంగా హత మార్చారని టీడీపీ ఆరోపించింది.


హత్యకు రూ.40 కోట్లు సుపారీ ఇచ్చే స్తోమత జైలులో ఉన్న వారికి లేదని... 2019 ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం అవినాష్‌రెడ్డి ఆస్తి రూ.18 కోట్లైతే, రూ.40 కోట్ల సుపారీ ఇచ్చే స్తోమత ఎవరికుందని పుస్తకంలో టీడీపీ ప్రశ్నించింది. వివేకా హత్యానంతరం తెల్లవారుజామున 3 గంటలకు భారతిరెడ్డి పీఏ నవీన్‌కు అవినాష్‌రెడ్డి ఎందుకు ఫోన్‌ చేశారు, నవీన్‌ ఫోన్‌ నుంచి భారతిరెడ్డి ఆ సమయంలో అవినాష్‌రెడ్డితో ఏం మాట్లాడారు. కాల్‌ డేటా ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.


ఓఎస్‌డి కృష్ణమోహన్‌రెడ్డి ఫోన్‌ ద్వారా సీఎం జగన్‌రెడ్డితో వైయస్‌ అవినాష్‌రెడ్డి హత్య జరిగిన రాత్రి మాట్లాడినట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. నవీన్‌, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి ఫోన్ల భాగోతం బహిర్గతమైన తర్వాత కూడా జగన్‌రెడ్డి, అతని భార్య భారతీరెడ్డి ఎందుకు మౌనం పాటిస్తున్నారని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశం లేకుండా సీబీఐ అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టగలరా అని ప్రశ్నించారు.
హత్యా ప్రదేశానికి ఉదయం 6.29కు వెళ్ళిన ఎంపీ అవినాష్‌రెడ్డి సమక్షంలో రక్తపు మడుగులు కడిగివేయడం, వివేకా దేహానికి భారతిరెడ్డి తండ్రి హాస్పిటల్‌ సిబ్బందితో కుట్లు వేయించడం, శవాన్ని ఫ్రీజర్‌ బాక్స్‌లో పెట్టించి ఖననానికి ఏర్పాట్లు చేయించడం అంటే హత్యను కప్పిపెట్టే కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఇది చట్టప్రకారం హత్యానేరంతో సమానం కాదా నిలదీశారు. 


అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి సీఐ శంకరయ్యకు ఫోన్‌ చేసి పిలిపించి, వివేకా గుండెపోటుతో మరణించారని వారే ఆయనకు చెప్పారని,గాయాల గురించి మాట్లాడవద్దని సీఐని బెదిరించారని ఆరోపించారు. సీబీఐ విచారణ కావాలని హైకోర్టులో పిటిషన్‌ వేసిన జగన్‌రెడ్డి, అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారని అగిడారు. చిన్నాన్న వివేకా హత్య గురించి ఆ రాత్రే తెలిసినా సీఎం పులివెందులకు వెంటనే ఎందుకు వెళ్ళలేదన్నారు. సాయంత్రం వరకు ఎందుకు జాప్యం చేశారని టీడీపీ అనుమానాలు వ్యక్తం చేసింది.


కేవలం కడప ఎంపీ సీటు కోసమే డి.శంకర్‌రెడ్డి ద్వారా అవినాష్‌రెడ్డి, వివేకానందరెడ్డిని చంపించారని అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన కౌంటర్‌ అఫిడవిట్‌ 270 పేజీ, పేరా 116లో పేర్కొన్నది వాస్తవం కాదా అని పుస్తకంలో రాశారు.


వివేకా హత్య కేసును బేస్ చేసుకొని వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని సీఈసీకి లేఖ రాస్తామని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 2019 ఎన్నికల్లో వివేకా హత్యపై జగన్ సహా వైసీపీ అంతా దుష్ప్రచారం చేసిందని, అసత్య ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందిందని ఆయన ఆరోపించారు. వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని వివరిస్తూ సీఈసీకి లేఖ రాస్తామని తెలిపారు. వివేకా హత్య కేసులో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డని ఆరోపించారు.