సాక్షాత్తు పరమేశ్వరుని అవతారంగా భావించే ఆది శంకరాచార్యులు కృపవల్లే ప్రస్తుతం హిందూమతం వెలుగుతోందని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదంటారంతా. వేదాలను వక్రీకరించి, సమాజంలో విభజనను కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతాలవైపు ప్రజలను మళ్లిస్తున్న సమయంలో సాక్షాత్తూ పరమశివుడే శంకరుడి రూపంలో జన్మించాడంటారు. కేరళలో కాలడి అనే గ్రామంలో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో శివగురువు, ఆర్యాంబ దంపతులకు వైశాఖ శుద్ధ పంచమి రోజు జన్మించారు శంకరులు. మూడో ఏట తండ్రి మరణించగా, తల్లి ఆ బాలుడుకి ఐదో ఏట ఉపనయనం చేయించింది. ఆ తర్వాత గొకర్ణ క్షేత్రానికి వెళ్ళి మూడేళ్లపాటూ సాంగోపాంగంగా వేదాలు నేర్చుకున్నారు. అంత చిన్న వయసులో బాల శంకరుల ప్రతిభ చూసి, ఆయనని భగవంతుని అవతారమని భావించేవారు.
తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించిన శంకరులు.. ఎనిమిదేళ్ల వయసులో గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలంలో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శిష్యునిగా స్వీకరించారు. గోవింద భగవత్పాదుల వద్ద వేదవేదాంగాలను అభ్యసించారు. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా ఒకరోజు శంకరులు ఓ ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆ బ్రాహ్మణుడి ఇంట్లో ఏమీ లేకపోవడంతో లేదు అని చెప్పలేక ఓ ఉసిరికాయ దొరకితే అదే భిక్షగా వేసిది ఆ ఇంటి ఇల్లాలు. ఆమె దారిద్ర్యం, ధర్మబద్ధతతో హృదయం కరిగిన శ్రీ శంకరులు ఆశువుగా "కనకధారస్తోత్రం" అనే మహోత్తరమైన స్తోత్రంతో అమ్మవారిని స్తుతించారు. వెంటనే ఆ పేద బ్రాహ్మణి ఇంట, బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది. అదే శంకరులు చేసిన మొట్టమొదటి స్తోత్రం..కనకధార స్తోత్రం !
Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు
తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుంచి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పుపెట్టారు శంకరాచార్యులు. ఈ ప్రపంచమంతా తన కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఆది శంకరాచార్య అద్వైతాన్ని ప్రచారం చేస్తూ యావద్భారతాన్ని రెండుసార్లు చుట్టి వచ్చారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లోని భిన్నత్వాన్ని గ్రహించిన ఆయన, వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలని అషమాన కృషి చేశారు. ఐదో ఏటే ఉపనయనాన్ని చేసుకుని ఎనిమిదేళ్లకు చతుర్వేదాలు, 12 ఏళ్లకు సర్వశాస్త్రాలను అధ్యయనం చేశారు. భ హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులను, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.
తన యాత్రల చివర్లో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశించారట. అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమయ్యారట శంకరులు. ఆయన కృపవల్లే అష్టాదశ శక్తి పీఠాలు, చార్ ధామ్ లాంటి పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, విష్ణు సహస్ర నామాలకు శంకరుల రాసిన భాష్యాలు, ఆయను అనుసరించినవారికీ, విభేదించిన వారికీ కూడా చాలా ఉపయోగపడ్డాయి. గురు శిష్యుల సంబంధం గురించి సనందుడు అనే శిష్యుడు ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు. హిందూ మతంలో పాతుకుపోయిన కుసంప్రదాయాలు, దురాచాలను తొలగించి వైదిక మార్గంలోకి మళ్లించిన గొప్ప ధీశాలి. శంకరాచార్యుల రాసిన 108 గ్రంథాల్లో గణేశ పంచరత్న స్త్రోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి లాంటి రచనలు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా మారాయి. 32 ఏళ్లు మాత్రమే జీవించిన శంకరుల ప్రభావం హిందూమతంపై అనన్యసామాన్యం.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే