Seven Addictions: వ్యసనం అంటే కేవలం చెడుమాత్రమే అనుకోవడానికి లేదు. చదువో వ్యసనంలా మారింది, పని ఓ వ్యసనంలా మారిందనే మాటలు కూడా వింటుంటాం. అంటే ఆ వ్యసనం జీవితానికి ఓ మార్గం చూపించాలి..మంచి చేయాలి కానీ మనిషిని అదఃపాతాళానికి తొక్కేయకూడదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. జీవితంలో మనిషికి ఉండకూడని ఏడు వ్యవసనాలున్నాయి. అవేంటి? ఎందుకు? ఇక్కడ తెలుసుకుందాం..


వెలది జూదంబు పానంబు వేటపలుకు
ప్రల్లదంబును దండంబు పరుసదనము।
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత
యనెడు సప్త వ్యసనముల జనదు తగుల॥


పరస్త్రీ వ్యామోహం, జూదం, మద్యపాన సేవనం, వేట, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించడం, వృధాగా సొమ్ములను ఖర్చుచేయడం.. ఇవే సప్త వ్యసనాలు అని పద్యం అర్థం.


Also Read: కుజుడి ప్రభావంతో 40 రోజుల పాటూ ఈ రాశులవారికి మానసిక ఆందోళన, సమస్యలు!


పరస్త్రీ వ్యామోహం


సప్తవ్యసనాల్లో మొదటిది పరస్త్రీ వ్యామోహం. ఇందుకు ఉదాహరణ రావణుడు. సీతాదేవిపై వ్యామోహంతో సాధువు వేషంలో వెళ్లి ఆమెను అపహరించి కోరి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. భార్య మండోదరి ఎన్ని హెచ్చరికలు చేసినా, సీత అస్సలు పట్టువీడకపోయినా రావణుడిలో ఎలాంటి మార్పు రాలేదు. ఫలితం…తన కుటుంబాన్ని, వంశాన్ని, అయినవారినీ, చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. మనది కాని వస్తువైనా - మనలో సగ భాగం కాని మనిషిపైనా వ్యామోహం పెంచుకోవడం వల్ల మిగిలేదేం ఉండదు...


జూదం


జూదం...పాండవులు-కౌరవుల మధ్య జరిగిన పాచికలాట కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో  తెలుసు. మంచి చెడులు నిర్ణయించే అంత గొప్పవాడే ఆ రోజుల్లో జూదం ఆడి... తాను అవస్తలు పడడంతో పాటూ తమ్ముళ్లు, భార్య కష్టాలకు కూడా కారణమయ్యాడు. ఇప్పటికీ జూదానికి బానిసై రోడ్డున పడిన కుటుంబాలెన్నో..


Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం


మద్యపానం


మద్యపానం ఎంత ప్రమాదకరమో రాక్షసగురువైన శుక్రాచార్యుడే ఇందుకు ఉదాహరణ. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. అంటే చనిపోయిన వారిని బతికించే విద్య. రాక్షసులను ఆ విద్యతో వెంటనే బ్రతికించేవాడు. కానీ సురాపాన మత్తులో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో  కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. కచుడంటే బృహస్పతి కుమారుడు. మృతసంజీవని విద్య నేర్చుకునేందుకు శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరతాడు. కచుడిపై కక్ష కట్టిన తోటి విద్యార్థులు కచుడిని చంపేసి బూడది చేసి..శుక్రాచార్యుడు సేవించే మద్యంలో కలిపి ఇచ్చేస్తారు.  అలాంటి పరిస్థితుల్లో కడుపులో ఉన్న కచుడికి మృత సంజీవినీ విద్య నేర్పించి… శిష్యుడిని బతికించి.. ఆ తర్వాత శిష్యుడి ద్వారా మళ్లీ ప్రాణం పోసుకున్నాడు శుక్రాచార్యుడు. 


వేట


వేట అనే మాట అప్పట్లో రాజులకు సంబంధించిన విషయం అయినప్పటికీ….ఇప్పటికీ స్థితిపరులకు ఇదో వ్యసనమే. ఈవేటలో పట్టుబడి కేసులు ఎదుర్కొంటున్న వారెందరో . ఇప్పుడు కోర్టులు శిక్షలు ఉంటే అప్పట్లో శాపాలుండేవి. దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి జంతువులను చంపేవాడు. ఓసారి నీటి శబ్దం విని బాణ వేసినప్పుడు శ్రవణకుమారుడు బలైపోతాడు. తనకు తెలియకుండా చేసినా పాపం పాపమే కదా. శ్రవణకుమారుడి వృద్ధ తల్లిదండ్రుల శాపానికి గురైన దశరధుడు…మరణ సమయంలో తనయుడు శ్రీరాముడికి దూరమయ్యాడు. అంటే మూగజీవాలను వేటాడితే శాపమో-శిక్షో తప్పదు…


Also Read: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!


కఠినంగా మాట్లాడటం


కఠినంగా, పరుషంగా మాట్లాడటం..ఎదుటివారిపై మాట విసరడం ఎంతో ప్రమాదకరం. మాటతీరు సరిగా లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు విఛ్చిన్నమవుతున్నాయి. మహాభారంతో దుర్యోధనుడు పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నాడో పురణాలపై అవగాహన ఉండేవారికి తెలుసు. 


కఠినంగా దండించటం


ఈ వ్యసనానికి కూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని  బందిఖానాలో పెడతాడు. వారికి సరైన ఆహారం కూడా అందించకండా ఇబ్బంది పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు. ఎవరినైనా కఠినంగా దండించామనే అహం సంతృప్తి చెందినా మళ్లీ అది ఎప్పటికైనా తిరిగి కొడుతుందనేందుకు ఇదే ఉదాహరణ.


Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!


ధనం దుర్వినియోగం


ఎవరికైనా మీరు గౌరవం ఇస్తే మీకు తిరిగి గౌరవం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవిని  గౌరవిస్తే…అమ్మవారు తిరిగి కరుణిస్తుంది. క్రమశిక్షణ లేకుండా ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తాత్కాలిక ఆనందం పొందొచ్చుకానీ….శాశ్వత కష్టాలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం తప్పదు. ప్రస్తుతం రోజుల్లో అందరికీ క్రెడిట్ కార్డులు ఓ వ్యసనంగా మారింది. ఏదో డబ్బులు చెట్లకు కాస్తున్నట్టు…షాపింగులు, సినిమాలు, సరదాల పేరుతో కార్డులు గీకేస్తున్నారు. నిండా మునిగాక లబోదిబోమంటున్నారు. కొందరైతే ఆత్మహత్య చేసుకునే స్థాయివరకూ వెళుతున్నారు. అందుకే సంపాదనని మించి ఖర్చులు ఉండకూడదు, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సరైన మార్గంలోనే వెచ్చిస్తున్నామా అని ఆలోచించాలి..