Bharath Rice In Market : దేశంలో బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోయాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు పెరిగిన ధరలతో విలవిల్లాడుతున్నారు. వేతనాలు, ఆదాయ వనరులు పెరగకపోయినా ఖర్చులు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా గడిచిన కొంత కాలం నుంచి బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలను నియంత్రించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరికొత్త రకం బియ్యాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించిన కేంద్రం.. ఈ మేరకు వచ్చే వారం నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు.
కేంద్రీయ బండార్‌ల్లో విక్రయాలు
భారత్ రైస్‌ను కేంద్రీయ బండార్‌ల్లో వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15 శాతం మేర పెరిగాయని చోప్రా వెల్లడించారు. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు కేజీలు, పది కేజీలు బ్యాగుల్లో భారత్ రైస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్ మార్కెట్‌లో విక్రయించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారత్ గోదుమ పిండి కిలో రూ.27.50, భారత్ డాల్(శనగ పప్పు)ను రూ.60 చొప్పున పలు ఆన్‌లైన్‌లో సంస్థల్లో అందుబాటులో ఉంచి విక్రయిస్తోంది.
ఎగుమతులపై నిషేధం..
దేశ వ్యాప్తంగా బియ్యం ధరలను అదుపు చేయడంపై దృష్టి సారించిన భారత్.. ఎగుమతులపై నిషేదం విధించింది. రానున్న రోజుల్లో ఈ నిషేదం కొనసాగుతుందని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. చిల్లర వ్యాపారులు, టకు వర్తకులు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం బియ్య నిల్వల వివరాలను మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే నిల్వలపై పరిమితి విధించే దిశగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన శుక్రవారం యాడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఏది ఏమైనా బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకు బియ్యాన్ని అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే దిశగా చేస్తున్న చర్యలను పలువురు అభినందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల కనీస రూ.700 వరకు బియ్యం బస్తాపై ఆదా అవుతుందని పలువురు మధ్య తరగతి కుటుబాలకు చెందిన ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం 25 కిలోల బియ్యం బస్తా రూ.1300 నుంచి రూ.1900 వరకు ఉంది. కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న బియ్యం 25 కిలోల బస్తా రూ.725కే రానుంది. అంటే, ఒక బస్తాపై సగం కంటే ఎక్కువ ఆదా కానుంది.