Ravan Dahan On Vijayadashami: దసరా రోజు చాలా ప్రాంతాల్లో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారు. శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజు ఇదే కావడంతో  రావణుని దిష్టి బొమ్మ తగులబెట్టే సంప్రదాయం మొదలైంది. రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏంటంటే  పరస్త్రీ వ్యామోహంలో పడినవారు, వేధింపులకు గురిచేసేవారు  ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారనే సందేశం కూడా ఉంది. అయితే రావణుడు  కేవలం విలన్‌గానే తెలుసు కానీ రావణ బ్రహ్మ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా...


Also Read: రావణుడు చనిపోతూ లక్ష్మణుడికి ఏమని జ్ఞానబోధ చేశాడు?


రావణుడు సగం బ్రాహ్మణుడు-సగం రాక్షసుడు
రావణుడి తండ్రి  విశ్వ వసు బ్రహ్మ ( ఈయన బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుని కుమారుడు). రావణుడి తల్లి కైకసి ( రాక్షస వంశానికి చెందిన సుమాలి కుమార్తె).  విశ్వావసుకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య  వరవర్ణినికి పుట్టిన వాడు కుబేరుడు. రెండో భార్య కైకసికి పుట్టిన వారు రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు. రావణుడికి చిన్నప్పటి నుంచీ సాత్విక స్వభావం లేదు. తండ్రి నుంచి వేదాలు, తాత నుంచి రాజ్యపాలనా విషయాలు నేర్చుకున్న రావణుడికి సర్వలోకాలు జయించాలనే కోరికతో ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే..అమరత్వం అడుగుతాడు. దాన్ని నిరాకరించిన బ్రహ్మ మరేదైనా కరోకోమంటాడు. తనకు దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని కోరగా సరే అంటాడు  బ్రహ్మ


Also Read: ఓ తెల్లవారుజామున జారుతున్న వస్త్రంతో అశోకవనానికి రావణుడు, ఆ సమయంలో లంకాధిపతి - సీత మధ్య డిస్కషన్ ఇదే!


రావణుడికి ఆ పేరు ఎలా వచ్చింది
రావణుడికి పుట్టినప్పటి నుంచీ పేరు లేదు. పది తలలతో పుట్టడంవలన దశగ్రీవుడు అనేవారు. అయితే ఓసారి కైలాస పర్వతాన్ని చేతులతో పెకిలిస్తున్నప్పుడు  శివుడు తన కాలి వేలితో రావణుని ముంజేతులను నలిపేస్తూ పర్వతాన్ని నొక్కుతాడు. అప్పుడు చేసిన ఆర్తనాదం కారణంగా రావణుడు ( అరుస్తున్న వ్యక్తి) పిలిచారు.  అప్పటి నుంచి రావణుడికి ఆ పేరు స్థిరపడిపోయింది. రావణుడు శివుని గొప్ప భక్తుల్లో ఒకడు మాత్రమే కాదు.. శివ తాండవ స్తోత్రం రచించింది రావణుడే.


రాముడి చేతిలో మరణం శాపం
రావణుడు శ్రీరాముడు జన్మించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు  అనారణ్యను చంపాడు.  మరణిస్తున్నప్పుడు అనారణ్య తన వంశంలో జన్మించిన వ్యక్తి చేతిలో నీ మరణం తథ్యం అని శపిస్తాడు. ఆ శాపంలో భాగంగానే రాముడి చేతిలో రావణుడి మరణం సంభవించింది. 


వాలిబలం తెలుసుకుని స్నేహం
ఎవరెవరు బలవంతుడో తెలుసుకుని వాళ్లతో యుద్ధం చేసి గెలవాలనే తాపత్రయంతో ఓసారి వాలిని చంపేందుకు వెళతాడు రావణుడు. సముద్ర తీరంలో సూర్యుడిని ప్రార్థిస్తున్న వాలిని సంహరించేందుకు ప్రయత్నించిన రావణుడిని...అత్యంత శక్తివంతుడైన వాలి మోసుకుంటూ కిష్కిందకు తీసుకెళ్లాడు. యద్ధం అవసరం లేకుండానే వాలిబలం తెలుసుకున్న రావణుడు స్నేహం చేయమని కోరుతాడు. అలా వాలి-రావణుల స్నేహం ఏర్పడింది. 


తన చావుకి ముహూర్తం నిర్ణయించుకున్న రావణుడు
రావణుడు తండ్రి విశ్వావసుడి నుంచి వేదం నేర్చుకున్నాడు. అందుకే ముహుర్తాలు నిర్ణయించడంలో దిట్ట. రాముడు లంకపై దాడి చేయడానికి, అందుకోసం వానరసేనతో రామసేతు నిర్మాణానికి ముహూర్తం నిర్ణయించింది రావణుడే. అక్కడ వృత్తి ధర్మాన్ని పాటించిన రావణుడు రాముడికి విజయం వరించే ముహూర్తమే నిశ్చయించాడు.  


జ్యోతిష్యశాస్త్రంలో నిపుణుడు
రావణుడు వేదాలతో పాటూ జ్యోతిష్యశాస్త్రంలో కూడా నిపుణుడు.  కుమారుడు మేఘనాధుడు జన్మించినప్పుడు రావణుడు అన్ని గ్రహాలను, సూర్యుడిని తగిన స్థితిలో ఉండాలని ఆదేశించాడు. తద్వారా మేఘనాథుడు చిరంజీవిగా ఉండాలన్నది రావణుడి కోరిక. కానీ శని అకాస్మాత్తుగా తన స్థానం మార్చుకున్నాడు. ఇది గమనించిన రావణుడు శనిదేవుడిపై తన జడతో దాడి చేసి ఓ కాలు విరిచేశాడని చెబుతారు.


Also Read : ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!


మరణ రహస్యం 
రామ రావణ యుద్ధంలో భాగంగా రావణుడిని చంపాలంటే నాభి వద్ద కొట్టాలని తన సోదరుడి మరణ రహస్యం చెప్పాడు విభీషణుడు. ఆ మాటని అనుసరించి రావణుడి నాభి వద్ద తన బాణాన్ని కొట్టి దుష్టసంహారం చేశాడు రాముడు. 


మనిషి చేతిలోనే చావు
తనకు దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని బ్రహ్మ దేవుడి నుంచి పొందుతాడు రావణుడు. అయితే మనుషుల నుంచి రక్షణ కోసం వరాన్ని కోరుకోలేదని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మించి రాముడిని సంహరించాడు. 


రావణుడి రాజనీతి
రావణాసురుడి సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి వద్దకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకోమని రాముడు తన సోదరుడు లక్ష్మణుడిని ఆదేశిస్తాడు. బ్రాహ్మణోత్తముడు, రాజు అయిన రావణుడు అప్పుడు లక్ష్మణుడికి ఏం చెప్పాడంటే..రథ సారథి, పాలవాడు, వంటవాడు, సోదరులతో ఎల్లప్పుడూ స్నేహంగా మెలగాలి. వారితో శతృత్వం పెట్టుకుంటే ఎప్పుడైనా హాని చేసే ప్రమాదం ఉంది. ఒక్కో సందర్భంలో ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు. మనతో ఉంటూ మనల్ని విమర్శించే వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి కానీ పొగిడే వారిని అసలు నమ్మవద్దు. విభీషణుడి విషయంలో తాను చేసిన తప్పును పరోక్షంగా ప్రస్తావించాడన్నమాట. విజయం ఎల్లప్పుడూ నిన్నే వరిస్తుందని అనుకోవం తప్పు, శత్రువు చిన్నవాడేనని తక్కువ అంచనా వేయరాదు ఎవరి బలమెంతో ఎవరికి తెలుసు. హనుమంతుడిని కోతేకదా అని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నానని లక్ష్మణుడితో తెలిపాడు. రాజుకు యుద్ధంలో గెలవాలనే కోరిక ఉండాలి కానీ అత్యాశపరుడై ఉండకూడదు. సైన్యానికి అవకాశం ఇచ్చి అలిసిపోకుండా రాజు పోరాటం సాగిస్తేనే గెలుపు సొంతమవుతుందని లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు వదిలాడు రావణ బ్రహ్మ.


రావణ సామ్రాజ్యం
రావణ సామ్రాజ్యం ఇప్పటికీ మలయాద్వీప్ (మలేషియా), అంగద్వీప, వరాహద్వీప, శంఖద్వీప, యావద్వీప, కుశద్వీప సహా పలు ద్వీపాల్లో విస్తరించి ఉందని చెబుతారు.