Cyber Crime: సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అతడి మార్ఫింగ్ నగ్న వీడియోలు పంపించి డబ్బులు డిమాండ్ చేయడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని బాపట్లకు చెందిన యువకుడు (22) ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోర్సు శిక్షణ కోసం నెల కిందట అమీర్ పేట్ వచ్చాడు. ఎస్సార్ నగర్ లోని ఓ హాస్టల్ లో మరో నలుగురితో కలిసి ఓ గదిలో ఉండేవాడు. ఇటీవల అతనికి ఓ యువతితో వాట్సాప్ లో వీడియో కాల్ చేయడంతో మాట్లాడాడు. సైబర్ నేరగాళ్లు ఆ కాల్ రికార్డును నగ్న వీడియో గా మార్ఫింగ్ చేసి పంపారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపిస్తామనడంతో ఓ సారి రూ.10 వేలు పంపాడు. మరింత డబ్బులు కావాలని వేధించడంతో పాటు కొంతమంది మిత్రులకు ఆ వీడియో పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆందోళనతో హాస్టల్ గదిలో ఉరివేసుకొని మృతి చెందాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


రూ.5 వేల కోసం నానమ్మను చంపాడు


డబ్బు కోసం నానమ్మను హత్య చేసి పరారైన మనవడిని బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. పాడిగడ్డ సమీపంలోని వికారం నగర్ కట్టెలమండి సమీపంలో నివసించే ఆరిఫా బేగం (68) ఈ నెల 14న తెల్లవారుజామున తన ఇంట్లోనే హత్యకు గురైంది. ఆమె భర్త షేక్ హమీద్ ఆర్టీసీలో కండక్టర్ గా పని చేసి మృతి చెందాడు. దీంతో ఆయన పింఛన్ తో పాటు ఇంట్లో ఓ గదిని అద్దెకివ్వగా వచ్చిన ఆదాయంతో ఒంటరిగా నివసిస్తోంది. 


ఈమెకు హబీబ్, ఐజ బేగం ఇద్దరు సంతానం. హబీజ్ కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా.. ఐజ బేగంకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా ఆరిఫా బేగం ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు. చిలకలగూడలో నివసించే ఆరిఫా బేగం మనవడు (కొడుకు కుమారుడు) షేక్ సాబీర్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి గొడవపడి డబ్బులు తీసుకెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆమె ఈ నెల 13న సమీపంలోని మనవడు మూసిన్ ఖాన్ ( కూతురి కుమారుడు) ఇంటికి వెళ్లింది. కొద్ది సేపు అక్కడే ఉండి రాత్రి 10 గంటలకు తిరిగి తాను ఉంటున్న ఇంటికి వచ్చింది. 


అదే రోజు రాత్రి షేక్ సాబీర్ ఆమె ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వమని గొడవపడ్డాడు. ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున బీరువాలోని రూ.5 వేలను తీసుకొని వెళ్తుండగా ఆరిఫా బేగం అడ్డుకుంది. పోలీసులకు చెబుతానని బెదిరించడంతో కిందకు తోసేశాడు. కేకలు వేయబోగా టవల్ తో ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భయపడి అతను మోసిన్ ఖాన్ కు ఫోన్ చేసి చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. 


ఆరిఫా బేగం ముక్కు నుంచి రక్తం కారడం, ఆమె చేతి వేళలో కొన్ని వెంట్రుకలు కనిపించాయి. ఆమె కింద పెదవిపై కొరికిన ఘాట్లు ఉన్నాయి. బాధితురాలని హుటాహుటిన సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె హత్యకు గురైనట్లు తెలిపారు. షేక్ సాబీర్ పై అనుమానంతో మోసిన్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అతన్ని ప్రశ్నించగా తప్పించుకొని పారిపోయాడు. నేరుగా రైలెక్కి అజ్మీర్ కు వెళ్లాడు. ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీయించుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించారు. 3 రోజుల తర్వాత నగరానికి వచ్చిన నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.