ఇస్లాం మతంలో రంజాన్ నెలకు విశేష ప్రాధాన్యత ఉంది. ధానధర్మాలకు ప్రతీకగా చెప్పే ఈ మాసంలో నెల రోజుల పాటూ ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ దీక్షలతో శరీరం, మనసులోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మత పెద్దలు చెబుతారు. సూర్యోదయ సమయంలో ‘సహర్’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే 'ఇప్తార్' వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారు. ముస్లింల పవిత్రగ్రంధం అయిన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెబుతారు.
సౌదీ అరేబియాలో నెలవంక దర్శనమివ్వడంతో పలు దేశాల్లో ఉపవాస దీక్షలు (రోజా) ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియా స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి నెలవంక దర్శనమిచ్చింది. దీంతో శనివారం ఉదయం నుంచి సౌదీ సహా పలు దేశాల్లో (Saudi Arabia) ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఇస్లామిక్ క్యాలెండర్‌ను అనుసరిస్తూ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రపంచంలోని అఫ్గానిస్థాన్, అల్బేనియా, అర్మేనియా, ఆస్ట్రియా, అజర్బైజాన్, బహ్రైన్, బెల్జియం, బొలీవియా, బల్గేరియా , ఇరాక్, ఇటలీ, జపాన్, రష్యా, సింగపూర్, సుడాన్, స్విడెన్ సహా పలుదేశాలు సౌదీ అరేబియా ప్రకటనను ప్రామాణికంగా తీసుకుని రంజాన్పవిత్ర మాసాన్ని ప్రారంభించారు. మనదేశంలో ఈరోజు సాయంత్రం నెలవంక దర్శనమిచ్చే సూచనలు కనిపించడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం నెలవంక దర్శనం ఇవ్వకపోతే సోమవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు.
Also Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
కఠిన నిబంధనలతో ఉపవాసం
- రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన నిబంధనతో కూడిన ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో గడుపుతారు.
- తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి నమాజ్ చేస్తారు. నిత్యం ఐదు పూటలా నమాజ్ చేస్తారు, దీన్ని పంచ్‌వక్త అని అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెల రంజాన్ మాసం.
- నమాజ్-ఇ-యేషా అనంతరం రాత్రి 10 గంటల వర కు పవిత్ర ఖురాన్‌ను చదువుతారు. అనంతరం దాదాపు 20 నమాజ్‌లు చేస్తారు. వీటిని ‘తరవి’ నమాజ్‌లు అని అంటారు.
- 'రోజా' అనే పదాన్ని పవిత్రమైన ఉపవాసం అనేదానికి పర్యాయపదంగా వాడతారు.
- 'రోజా' చేస్తున్న వారు ఉదయం సహర్ నుంచి ఇప్తార్ వరకు కనీసం ఉమ్మీని కూడా మింగకుండా కఠిన ఉపవాసం చేయాలి.
- సహర్ ముందు తిన్న ఆహారమే రాత్రి ఇప్తార్ వరకు మంచినీరు కూడా ముట్టుకోకుండా కఠిన ఉపవాసాలు నిర్వహిస్తారు.
Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
సహర్ అంటే
సహర్ అంటే ప్రతి ముస్లిం రోజా ఉండే రోజు ఉదయం 3 గంటలకు నిద్ర లేచి ఆహారం సిద్ధం చేసుకుని తీసుకుంటారు. సహర్ అనేది ఉదయం ఉపవాసం ప్రారంభించే ముందు తీసుకొనే భోజనం. అనంతరం ఫజార్ నమాజ్ చేసి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు.
జకాత్ అంటే
ప్రతి ముస్లిం జకాత్ చేయాలనేది ముస్లింల విశ్వాసం. జకాత్ అంటే ధానధర్మాలు చేయడం. మనం సంపాదించే దానిలో ఖర్చులకు పోనూ మిగతా సంపాదనలో 2.5 శాతం దానం చేయాలని అర్థం.