Ram Navami 2025 Date and 9 Days Ramayana parayana: ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మొదటి రోజు చేయాల్సిన పారాయణ...
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపంఆజానుభాహుం అరవింద దళాయతాక్షంరామం నిశాచర వినాశకరం నమామి శ్రీమద్ రామాయణం ఆదికావ్యం
వాల్మీకి మహర్షి ఒకరోజు తమసా నదికి స్నానమాచరించేందుకు వెళ్లారు. అక్కడ ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మమీద ఆనందసాగరంలో ఉన్న ఓ పక్షుల జంటలో మగపక్షిపై కిరాతుడు బాణం వేశాడు. అది విలవిలకొట్టుకుంటూ నేలరాలింది. ఆ మగపక్షి చుట్టూ తిరుగుతూ ఆడపక్షి విలపించడం చూసి వాల్మీకి మహర్షి మనసు ద్రవించింది. ఆ సమయంలో ఆయన హృదయంలో శోకమే ఈ శ్లోకం
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |
ఓ కిరాతకుడా క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయుండగా ఓ పక్షిని చంపావు. నువ్వు ఎక్కువకాలం జీవించవు అని శపించారు. ఆ క్షణంలో ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు..నీ నోట కవిత్వ వచ్చింది. నువ్వు రామాయణ మహాకావ్యాన్ని రచించి మానవాళిని తరింపజేయి అని సూచించి వెళ్లిపోయాడు.
అలా మొదలైంది రామాయణ కావ్య రచన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి బాలకాండ
అయోధ్యలో శ్రీ రామ లక్ష్మణ భరత శతృఘ్నులు ధనుర్ విద్యలో ప్రావీణ్యం పొందారు.మహర్షుల యాగాలకు ఆటంకం కలిగిస్తున్న రాక్షసులను అంతం చేయడానికి దశరథమహారాజు సహాయం కోరారు విశ్వామిత్రుడు. సకల మర్యాదలతో విశ్వామిత్ర మహర్షికి స్వాగతం పలికిన దశరథుడికి తాను వచ్చిన పని వివరించాడు. మారీచ సుబాహువులనే రాక్షసులు యజ్ఞయాగాలకు ఆటంకం కలిగిస్తున్నారు..వారిని శపించవచ్చు కానీ, యజ్ఞ క్రతువులో నిమగ్నమైనపుడు కోపం దరిచేరకూడదు..అందుకే ఇలాంటి పరిస్థితులలో యాగరక్షణ జరగాలంటే శ్రీరాముడిని తనతో పంపాలని కోరాడు. లేక లేక కలిగిన సంతానాన్ని ఇలా రాక్షస సంహారానికి పంపాలా అని బాధపడ్డాడు. రాముడి బదులు తాను వస్తానన్నాడు కానీ ఇది రాజధర్మమా మాటతప్పుతావా అని ప్రశ్నించాడు విశ్వామిత్రుడు. వశిష్ఠ మహర్షి సూచన మేరకు విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులను పంపడానికి నిర్ణయించాడు దశరథుడు.తనను అనుసరించి వచ్చిన రామలక్ష్మణులకు సరయూ నదీతీరంలో - ఆకలి, దప్పికలు లేకుండా బల , అతి బల అనే విద్యలు నేర్పించాడు ను విశ్వామిత్రుడు. అంటే ఆకలి దప్పులు దరిచేరని విద్య అది.
ఆ రాత్రి వారు అక్కడే సేదతీరాలు...తెలవారుతుండగా కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని స్తుతిస్తూ మేల్కొలిపాడు విశ్వామిత్రుడు. పురుషోత్తమా తెల్లవారుతోంది, దైవ సంబంధాలైన కార్యక్రమాలు చేయవలసి ఉంది లెమ్ము అని అర్థం. మహర్షి మేల్కొలుపుతో లేచి, సంధ్యావందనం ముగించుకుని వారు అక్కడి నుంచి బయలుదేరారు. అలా నడుచుకుంటూ వారు మహారణ్యంలో ఓ జనపదం చేరగానే అక్కడ తాటకిని చూశారు. అగస్త్యుని ఆశ్రమ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ జనాన్ని తింటూ బతుకుతున్న తాటకికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని చెప్పాడు. స్త్రీ కదా చంపడం ఎలా అనే సంకోచం లేకుండా దుష్టశక్తిని హరింపజేయమని కోరాడు విశ్వామిత్రుడు. తాటకి సంహారం అనంతరం విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలు ప్రసాదించాడు. దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణు చక్ర,బ్రహ్మాస్త్ర, కాలపాశ,ధర్మపాశ, వరుణపాశ, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇలా సమస్త్ర అస్త్రాలు అందించాడు.
తాటకి వధ అనంతరం విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తున్న సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ విశ్వామిత్ర మహర్షి యాగం మొదలు పెట్టగానే రాక్షసులు మారీచ సుబాహువుల అనుచరగణం అక్కడకు చేరుకుంది. రాముడు బాణాల వర్షం కురిపించి హతమార్చాడు. ఆ తర్వాత రాక్షసులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. యాగం నిర్విఘ్నంగా సాగింది. ఆ తర్వాత అక్కడ నుంచి మిథిలా నగరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకుని అక్కడ అహల్య శాప గాథను విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు. పూర్వరూపంతో కనిపించిన అహల్యకు నమస్కరించి ముందుకు సాగారు.
మిథిలా నగరంలో సీతా స్వయంవరం వార్త తెలుసుకుని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మిథిలకు తీసుకువెళ్లాడు. శివధనస్సును విరిచి సీతమ్మ స్వయంవరంలో విజేతగా నిలిచాడు రాముడు. దశరథుడికి కబురుపంపి సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. లక్ష్మణ భరతశత్రుఘ్నులకూ వివాహాలు జరిపించారు. దశరథుడు కొడుకులు, కోడళ్లతో అయోధ్యకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో పరశురాముడు ఎదురై శివధనుస్సు విరిచినందుకు ఆగ్రహించాడు. తన దగ్గర ధనుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్టమని రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాణం సంధించి వదిలిన బాణం లక్ష్యాన్ని ఛేధించక తప్పదు. రాముడి శక్తి సామర్ధ్యాలను కీర్తించి పరశురాముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి