Ayodhya Ram Mandir:  అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలనేది కోట్లాది హిందువుల దశాబ్దాల నాటి కల. త్వరలోనే అయోధ్య రాముడు గర్భగుడిలో కొలువుతీరనున్నాడు. ఈ సందర్భంగా ఓ భక్తురాలి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సందర్భం ఇది..


అయోధ్య రాముడికోసం ఓ భక్తురాలి ప్రతిజ్ఞ


అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని దశాబ్దాలుగా పోరాటం జరిగింది. యాగాలు, వ్రతాలు, నోములు ఎవరికి తోచింది వారు ఫాలో అయ్యారు. కానీ ఓ భక్తురాలు మాత్రం ఏకంగా దీక్ష చేపట్టింది..  జార్ఘండ్ కు చెందిన ఆ భక్తురాలి పేరు సరస్వతీ అగర్వాల్. వయసు 85 సంవత్సరాలు. ఆమెకు శ్రీరాముడంటే ఎంత భక్తి అంటే..అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగి రామయ్య కొలువుతీరే వరకూ మౌనవ్రతం చేయాలని నిర్ణయించుకుంది. అలా 1992లో ప్రతిజ్ఞ చేసిన ఆమె, అప్పట్నుంచి రోజుకు 23 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ప్రధాని మోదీ, ఆలయానికి శంకుస్థాపన చేశారో ఆ రోజు నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల పాటు మౌనవ్రతం పాటించారు.


Also Read: అయోధ్య రాముడి దర్శన వేళలు - పాటించాల్సిన నిబంధనలు ఇవే!


విగ్రహ ప్రతిష్టాపనకు సరస్వతికి ఆహ్వానం


అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి సరస్వతి అగర్వాల్‌కు కూడా ఆహ్వానం అందింది. 1992 మేలో అయోధ్యకు వెళ్లిన సరస్వతి అగర్వాల్.. రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. తర్వాత కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేసిన తర్వాత చిత్రకూట్‌లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. ఇక 1992 డిసెంబర్ 6 వ తేదీన ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్‌ను కలిసి ఆ తర్వాత మౌన వ్రతం ప్రారంభించారు. 


Also Read: సప్త పురాలు అంటే ఏవి - అయోధ్యదే ఫస్ట్ ప్లేస్ ఎందుకు!


ఇకపై జీవితం రాముడికే అంకితం


మూడు దశాబ్ధాలుగా రాముడి భక్తిలో మునిగితేలిన సరస్వతి..ఇకపై కూడా తన జీవితం పూర్తిగా రాముడి సేవకే అంకితం అన్నారు.  అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తికావడంతో ఇకపై అయోధ్యలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాల రాముడు తనను ఆహ్వానించాడని.. 30 ఏళ్లుగా తాను చేస్తున్న తపస్సు విజయవంతమైందని సంతోషపడుతోంది. ఇకపై అయోధ్యలోని మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలో ఉండనున్నట్టు...తన మొత్తం భావాలను రాతపూర్వకంగా తెలియజేశారు సరస్వతి. 


Also Read: ఆ రోజే బిడ్డను కంటాం - రామచంద్రా దీనిని భక్తి అంటారా!


మౌనవ్రతం విరమణ ఎప్పుడంటే


ఎట్టకేలకు భక్తురాలు సరస్వతీ దేవి వ్రతం ఫలించింది. జనవరి 22వ తేదీన ఆలయ ప్రతిష్ట జరగనుంది. రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత....'రామ్, సీతారాం' అంటూ 30 ఏళ్ల మౌన దీక్షను విరమించనున్నారు.  స్థానికులంతా ఆమెను మౌని మాతగా పిలుస్తారు.  35 ఏళ్లక్రితం సరస్వతి అగర్వాల్  భర్త మరణించారు. ఆమెకు ముగ్గురు సంతానం. రాముడికోసం ఆమె చేపట్టిన మౌనదీక్షకు వారంతా సహకరిస్తూ వచ్చారు. అయోధ్యలో రాముడు కొలువుతీరే సమయం ఆసన్నమవుతుండడంతో సరస్వతి అగర్వాల్ ఆనందానికి అవధుల్లేవు...


Also Read: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే!