PM Modi Nomination on Ganga Saptami 2024: గంగా సప్తమి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 14 మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 12 BJP పాలిత, సంకీర్ణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడానామినేషన్ లో చేర్చనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల దాఖలుకు ముందు ప్రధాని మోదీ ఉదయం 9 గంటలకు దశాశ్వమేధ్ ఘాట్ వద్ద గంగా మాతకు నమస్కరించి క్రూయిజ్ ద్వారా నమో ఘాట్ కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి, అక్కడి నుంచి కలెక్టరేట్ కు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. గంగా సప్తమి, పుష్యమి నక్షత్ర కలయిక అఖండ రాజయోగాన్నిస్తుందని పండితులు చెబుతారు. ఈ రోజు ఏ పని తలపెట్టినా తప్పనిసరిగా విజయవంతం అవుతుందని అందుకే ఈ రోజు మోదీ నామినేషన్ దాఖలు చేస్తున్నారని చెబుతున్నారు.
గంగానది పుట్టిన రోజే గంగాసప్తమి...
హరి పాదాన పుట్టావంటే గంగమ్మా..ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా
అనే ఓ పాట వినేఉంటారు.. శ్రీ మహావిష్ణువు పాదం నుంచి ఉద్భవించిన గంగానది భగరీథుడి తపస్సుకి మెచ్చి శివుడి జటాఝూటాన్ని ఓ మజిలీగా చేసుకుని ఆ తర్వాత హిమాలయాలపై అడుగుపెట్టి సగరుడి వంశాన్ని పావనం చేసింది.
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె..
అంటూ గంగానది ప్రయాణం గురించి ఈ పద్యంద్వారా చెప్పారు కవులు. హరిపాదం నుంచి పరమేశ్వరుడి శిరస్సు, హిమగిరి, భూమి, మైదాన ప్రాంతం...అక్కడి నుంచి పాతాళం...ఇలా మూడు లోకాలను పావనం చేసింది గంగానది...
మనదేశంలో ప్రవహించే నదుల్లో ముఖ్యమైనది గంగ. హిమాలయ పర్వతాల నుంచి దాదాపు 2,525 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. గంగమ్మ ప్రవహించే దారంతా పంటభూములను తడుపుతూ, ఎన్నో జీవరాశులకు ఆశ్రయమిస్తూ, మానవ అవసరాలను తీరుస్తూ ప్రయాణం సాగిస్తోంది..అందుకే జీవ నది అంటారు.
గంగానది హరిపాదం నుంచి భూమ్మీదకు ఎందుకు వచ్చింది!
గంగానది భూమ్మీదకు ఎందుకు వచ్చిందో వివరిస్తూ ఓ పురాణ కథ ఉంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి కేశిని, సుమతి అనే ఇద్దరు భార్యలు. భృగుమహర్షి వరంతో కేశినికి అసమంజుడనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి అరవై వేల మంది కొడుకులు పుడతారు. సగరుడు అశ్వమేథ యోగం తలపెట్టడంతో అది విజయవంతం అయితే తనకు ముప్పు ఉందని భావించి ఇంద్రుడు యాగాశ్వాన్ని లాక్కెళ్లి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. అశ్వమేధ యాగం ఆగిపోవడంతో సగరుడు కుమిలిపోతాడు. అప్పుడు సుమతి పుత్రులైన 60వేల మంది యాగాశ్వం జాడ కనిపెట్టి కపిల మహర్షిని దూషిస్తారు. ఆగ్రహంతో కపిలుడు వారిని బూడిద చేసేస్తాడు. కేశిని కుమారుడైన అసమంజుడు సోదరులను వెతుకుతూ వెళ్లి జరిగినది తెలుసుకుంటాడు. గంగను భూమ్మీదకు తీసుకొస్తే సోదరులు మళ్లీ బతుకుతారని తెలిసి తపస్సు ప్రారంభిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి అసమంజుడి కొడుకు కూడా తన పినతండ్రులను వెతుకుతూ కపిలముని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ తర్వాత తరానికి చెందినవాడే భగీరధుడు.
అసమంజుడి తనయుడు భగీరథుడు
సగరుడి కొడుకైన అసమంజుడికి మనవడు భగీరథుడు కూడా తపస్సు కొనసాగిస్తాడు. అప్పుడు ప్రత్యక్షైమైన బ్రహ్మదేవుడు గంగానది భూమ్మీదకు వస్తే తట్టుకునే శక్తి లేదని చెబుతాడు. అలా శివుడి ప్రశన్నం చేసుకుని తన జటాజూఠాన్ని ఓ మజిలీగా మారేలా చేసి భూమ్మీదకు తీసుకొచ్చాడు భగీరథుడు. ఆరోజే వైశాఖ శుద్ధ సప్తమి...గంగా సప్తమి..