Mahalaya Paksham 2024: భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకూ ఉండే 15 రోజులను పితృపక్షం అంటారు.. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 02 వరకు పితృ పక్షం.


పితృ పక్షం అంటే ఏంటి.. ఎందుకు ఈ 15 రోజులు అత్యంత ముఖ్యమైనవి...
 
శరీపాన్ని విడిచిన ప్రాణం...‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన కర్మను అనుసరించి భూమ్మీదకు జీవాత్మగా వస్తుంది. అన్నాన్ని ఆశ్రయించి పురుషుడి దేహంలోకి ప్రవేశించి..శుక్ల కణంగా మారి..తన కర్మ ఫలానుసారం స్త్రీ గర్భంలోకి ప్రవేశించి..ఆ తర్వాత శిశువుగా మారి భూమ్మీదకు తిరిగి వస్తుంది. 


మరణించిన పితృదేవతలకు మోక్షం కలగాలంటే పూర్వ కర్మలన్నీ పూర్తి కావాలి. ఆ కర్మలను పూర్తిగా అనుభవించాలంటే దేహధారణ చేసి మళ్లీ ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నం అందించాలి... అది కేవలం రక్తం పంచుకు పుట్టిన పుత్రులు మాత్రమే ఇవ్వాలి.అప్పుడు పితృరుణం తీరుతుంది.


పితృ రుణం తీర్చుకోవడం పుత్రుల ధర్మం..అప్పుడే పెద్దల ఆత్మకు శాంతి, మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు సూచించినవే పితృపక్షాలు. ఈ 15 రోజులు అత్యంత ప్రధానమైనవి


Also Read: మలయాళీలకు స్వర్ణయుగం - రాక్షసరాజుకు ఘన స్వాగతం!


బహుళ పక్షం అత్యంత ప్రధానం


భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు వచ్చే 15 రోజులు దేవతాపూజకు అత్యంత విశిష్టమైనవి అయితే.. పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులు పితృదేవతల పూజకు అంత్యంత శ్రేష్ఠమైమది. పితృదేవతల రుణం తీరర్చుకునే ఈ 15 రోజులను పితృపక్షం అంటారు. ఈ రెండు వారాలు తర్పణ, శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి. 


నిత్యం కుదరదు అనుకున్న వారు..తమ పెద్దలు ఏ తిథిలో మృతి చెందారో ఆ తిథి రోజు విధులు నిర్వర్తించాలి..లేదంటే చివరి రోజైనా మహాలయ అమావాస్య రోజు అయినా తర్పణాలు విడిస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది..
 
పితృ పక్షాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయో వివరిస్తూ ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. దాన కర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళుతుండగా దారి మధ్యలో ఆకలి, దాహం వేసింది. ఓ పండ్ల చెట్టును చూసి అక్కడకు వెళ్లి తెంపుకునేందుకు ప్రయత్నిస్తే అది బంగారంలా మారిపోయింది. ఆ తర్వాత నీళ్లు తాగుదామనుకున్నా అదే జరిగింది. అర్థంకాని కర్ణుడు..ఎందుకిలా జరుగుతోందని ఆలోచించాడు. అప్పుడు అశరీరవాణి నుంచి కొన్ని మాటలు వినిపించాయి


" కర్ణా ! దానశీలిగా పేరొందావు..చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపంలో ఇచ్చావు కానీ ఒక్కరి ఆకలి కూడా తీర్చలేదు అందుకే ఇప్పుడు నీకీ దుస్థితి" అని పలికింది అశరీరవాణి...


ఆ మాటలు విన్న తర్వాత కర్ణుడు నేరుగా సూర్యుడి దగ్గరకు వెళ్లి..తండ్రి గారూ నేను ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు. అప్పుడు సూర్యుడు సూచించిన 15 రోజులే పితృపక్షం. 


వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడున్న అన్నార్తులందరికీ అన్న పెట్టి..తల్లిదండ్రులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మని చెప్పాడు సూర్యుడు. తండ్రి సూర్యభగవానుడి సూచనల మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకంలోకి వచ్చి..15 రోజుల పాటు అన్న సంతర్పణలు నిర్వహించి , పితృదేవతలకు తర్పణాలు విడిచి స్వర్గలోకానికి పయనమయ్యాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు నిర్వహించాడో అప్పుడే తనకి ఆకలి, దప్పికలు తీరిపోయాయి. 


Also Read: మూడు అడుగులతో ముల్లోకాలను చుట్టేసిన త్రివిక్రముడి జయంతి!


కర్ణుడు భూలోకంలో అన్న సంతర్పణలు నిర్వహించి, పితృ తర్పణాలు విడిచిన 15 రోజులనే మహాలయ పక్షాలు అని పిలుస్తారు. చివరి రోజైన అమావాస్య ను మహాలయ అమావాస్య అంటారు..
 
కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కాదు..మృతి చెందిన రక్త సంబంధీకులు అందర్నీ తలుచుకుని తర్పణాలు విడుస్తారు.