మహా పాతకం అంటే నిష్కృతిలేనిది అని అర్థం. అంటే ఈ జన్మకు ఏం చేసినా ఈ పాపాలను కడుక్కోవడం కుదరదు. వాటి ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. కొన్ని పాపాలకు పరిహారం ఉంటుంది కానీ పంచమహాపాతకాలు అని చెప్పుకునే వీటికి మాత్రం ఎలాంటి నిష్కృతి ఉండదు.
అధర్వణ వేదంలో ప్రస్తావించిన పంచమహాపాతకాలు
1.తల్లిదండ్రులను దూషించడం
తల్లిదండ్రులను దూషించేవాడికి నిష్కృతి లేదు. దూషించడమే తప్పు అంటే ఇక హత్య చేస్తే ఆ పాపం జన్మజన్మలకీ కడుక్కోలేరు
2. గురువుని ఏకవచనంలో పిలవడం
కలలో కూడా గురువుని ఏకవచనంతో పిలవడకూడదు. పిలిచారంటే తన మనసులో ఏమూలో అలా పిలవాలనే ఆలోచన వచ్చి ఉండాలి. మన ఆలోచనలే కలలకు ప్రతిరూపం అంటారు కదా. మరి కలలోనే గురువుని ఏకవచనంతో పిలవకూడదు అంటే వాస్తవంలో పిలిస్తే ఏమనుకోవాలి.
3. తాగే నీటికి కలుషితం చేయడం- నడిచే దారిని మూసేయడం
పది మంది తాగే నీటిని కలుషితం చేయకూడదు... ఎందరో దాహం తీర్చే గంగను తాగేందుకు వీల్లేకుండా చేసిన పాపానికి ఏం చేసినా పరిహారం ఉండదు. ఇక అంతా నడిచే దారిని మూసేయడం మహాపాపం. గ్రామాల్లో కొన్ని ఊర్లలో ఒకరికి మరొకరితో తగాదాలు వచ్చినప్పుడు దార్లు కట్టేస్తుంటారు, ఇక కాంక్రీట్ జంగిల్లా మారిన పట్టణాల్లో పరిస్థితి చెప్పేదేముంది. దార్లేం ఖర్మ శ్మశానాలు వదలడం లేదు. ఈ రెండు పాపాలు చేస్తే ఆ పాపం పిల్లల భవిష్యత్, ఆరోగ్యంపై పడుతుంది. అది కూడా ఈ జన్మలోనే అనుభవించకతప్పదు.
4. గోవుని అకారణంగా కొట్టడం
పెంచేవాడు, పని చేయించుకునేవాడు ఓ అవసరం కోసం గోవుని కంట్రోల్ చేయడం కోసం కొట్టొచ్చు..అది తప్పు కాదు. కానీ ఆకతాయిగా,ఎలాంటి అవసరం లేకుండా కొడితే గోవు చర్మంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు ఎత్తినా ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది.
Also Read: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది
5.ఆత్మహత్య
పరమేశ్వర స్వరూపంలో జీవుడిని ఇచ్చింది తండ్రి... శరీరాన్ని తయారు చేసింది తల్లి. అంటే ఈ శరీరం మన సొంతం కాదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఓ అద్దె ఇంట్లో ఉంటూ యజమానికి తెలియకుండా ఆ ఇల్లు అమ్మేయడం అన్నమాట. అంటే నీది కాని ఆస్తిని, యజమానికి తెలియకుండా నువ్వు అమ్ముకోవడం అని అర్థం. మొదటి నాలుగు పాపాలకు ఆ జీవుడు మాత్రమే అనుభవిస్తాడు. కానీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అటు ఐదు తరాలు, ఇటు ఐదు తరాలు సర్వనాశనం అయిపోతాయ్. ( మహాపాతకాల్లో అత్యంత ముఖ్యమైన ఆత్మహత్యా పాతకం గురించి ప్రత్యేక కథనంలో ఉదాహరణలతో సహా చెప్పుకుందాం)
బ్రహ్మపురాణం ప్రకారం పంచమహాపాతకాలు
1.స్త్రీ హత్య ( స్త్రీ ని చంపడం)
2. శిశు హత్య ( పిల్లల్ని చంపడం)
3. గో హత్య ( ఆవుని చంపడం)
4. బ్రహ్మ హత్య ( వేదం చదువుకున్న బ్రాహ్మణుడిని చంపడం)
5. స్వర్ణస్తేయము ( బంగారం దొంగిలించడం)
Also Read: శనివారం సాయంత్రం ఈ చెట్టుకింద దీపం వెలిగిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి