Sri Sitarama Kalyanam at Vontimitta : ఏకశిలానగరంలో ఏప్రిల్ 1 బుధవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని TTD, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. TTD ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు TTD ఉన్నత అధికారులు, జిల్లా అధికారులతో సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా ఏప్రిల్ 1న సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.  

కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల‌ మంది  సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.  ప్రతి గ్యాలరీలో  పారా మెడికల్ సిబ్బంది, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టారు.

కళ్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ చేసేందుకు 28 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

కళ్యాణోత్సవానికి వచ్చే ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణం, అన్నప్రసాదం అందిస్తారు. నడిచి వచ్చే భక్తులకోసం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో పాన‌కం, మ‌జ్జిగ‌, చ‌లివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేశారు.

శ్రీ కోదండ‌రామ‌స్వామి వారి ఆల‌యం నుంచి క‌ల్యాణ వేదిక వ‌ర‌కు  చలువ పందిళ్లు, నీటి పిచికారి యంత్రాలు ఏర్పాటు చేశారు. ఆల‌య సమీపంలో 3 వేల మంది భ‌క్తులు వెయిట్ చేసేందుకు, లైన్లలో వెళ్లేందుకు వీలుగా జ‌ర్మ‌న్ షెడ్డు ఏర్పాటు చేశారు. ఆలయం, కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో 38 వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

భద్రతా వివరాలు ఇవే..

TTD విజిలెన్స్ విభాగం, అబ్జర్వేషన్ టీం, ఫైర్ సిబ్బంది 510 మంది, TTD  స్కౌట్స్ 200 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మంది సేవలందిస్తారు.  235 సిసి కెమెరాలు, 12 డ్రోన్ లు, కామాన్ కమెండ్ కంట్రోల్ సెంటర్,  మరో మూడు  3 స‌బ్ కంట్రోల్ రూమ్ ల నుంచి పర్యవేక్షణ సాగుతుంది. 

అన్న‌ప్ర‌సాదం వివరాలు

బ్ర‌హ్మోత్స‌వాల‌కు వచ్చే భ‌క్తుల‌కు ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో, క‌ల్యాణ వేదిక వ‌ద్ద నిరంతరాయంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉంటుంది. ఇందులో భాగంగా  అన్నం, సాంబ‌రు, ర‌సం, మ‌జ్జిగ‌, ప‌చ్చ‌డి, క‌ర్రీ, బెల్లం పొంగ‌లి అందిస్తారు.

కళ్యాణ వేదిక వద్ద

క‌ల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాల‌రీల‌లో ఉండే భ‌క్తులకు సాయంత్రం నుంచి పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, బిస్కెట్ ప్యాకెట్, కారాసు, అరటిపండు, టిష్యూ పేపర్, ఉడెన్ స్పూన్, 3 లక్షల తాగునీరు బాటిల్స్, వాటర్ ట‌బ్బుల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా, 2 లక్షల మ‌జ్జిగ ప్యాకెట్లు, లక్ష టెట్రా ప్యాకెట్లు సిద్ధం చేశారు

ప్రత్యేక బస్సులు

RTC ద్వారా క‌డ‌ప నుంచి ఒంటిమిట్ట వ‌ర‌కు 85 బ‌స్సుల‌తో 425 ట్రిప్పులు, రాజంపేట నుంచి ఒంటిమిట్ట వ‌ర‌కు 40 బ‌స్సుల‌తో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు ర‌వాణా సౌక‌ర్యం ఉంటుంది.  ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్ ప్రాంతాల నుంచి క‌ల్యాణ వేదిక వ‌ర‌కు 20 బ‌స్సులు ఏర్పాటు చేశారు. కడప వైపు 13, తిరుపతి వైపు 5 చోట్ల పార్కింగ్ పాయింట్లు పెట్టారు.  దాదాపు 21 కిలోమీటర్ల మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్‌, ప‌ర్య‌వేక్ష‌ణ టీంలు ఏర్పాటు చేశారు.

కళ్యాణ  వేదిక, ఆలయ పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సంప్రదాయ పూలతో అలంకరణ చేశారు.

ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకుంటున్న సంక్షిప్త రామాయణం

గోవిందనామ సరళిలో రామనామ భజన, సాంస్కృతి కార్యక్రమాలు