Water Fasting for Detox : ఈ రోజుల్లో సోషల్ మీడియాలో డిటాక్స్ అనే పదం చాలా ట్రెండింగ్‌లో ఉంది. బరువు తగ్గాలన్నా, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలన్నా శరీరాన్ని నిర్వీషకరణం చేయడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఉంది. దీనిలో భాగంగా ఈ మధ్య సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇది చాలా సులువైన ఖర్చు అవసరం లేని.. బాడీని డీటాక్స్ చేసే ట్రెండ్‌గా చెప్తున్నారు. అదేంటో.. దానివల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో చూసేద్దాం.
వాటర్ ఫాస్టింగ్..
ఎలాంటి ఫుడ్ లేకుండా.. 24 నుంచి 72 గంటల పాటు కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ ఉండడమే వాటర్ ఫాస్టింగ్. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఈ పద్ధతిని ఆరోగ్య చిట్కాగా ఫాలో అవుతున్నారు. మరి ఇది నిజంగా సేఫ్‌నా? నిపుణుల సూచనలు ఏంటో చూసేద్దాం.
వైద్య నిపుణుల ప్రకారం.. కేవలం నీటితో ఉపవాసం చేయడం అనేది ఎప్పుడూ సొంతంగా చేయకూడదు. వైద్య పర్యవేక్షణ లేకుండా ఇలా ఉపవాసం చేయడం శరీరానికి ప్రమాదకరం కావచ్చని అంటున్నారు. ఎందుకంటే మొదట్లో కొంత బరువు తగ్గినట్లు అనిపించినా.. అది నిజంగా ఫ్యాట్ లాస్ కాదని.. శరీరంలోని నీరు, గ్లైకోజెన్ తగ్గడం వల్ల వచ్చే తాత్కాలిక మార్పేనని అంటున్నారు.
వాటర్ ఫాస్టింగ్ చేస్తే జరిగే మార్పులు ఇవే..
వాటర్ ఫాస్టింగ్ ప్రారంభించిన తర్వాత శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మొదటి రెండు, మూడు రోజుల్లో గ్లైకోజెన్ ఖాళీ అవుతుంది. దీంతో శరీరం కీటోసిస్‌లోకి వెళ్తుంది. క్రమంగా కండర బలం తగ్గుతుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. బయటకు బరువు తగ్గినట్లు కనిపించినా.. లోపల మాత్రం శరీరం బలహీనమవుతోంది. కానీ బరువు తగ్గడం వల్ల ఇది మంచి ఫలితాలు ఇస్తుందని భావించి.. చాలామంది దీనిని ఫాలో అయ్యేందుకు చూస్తున్నారు.
వాటర్ ఫాస్టింగ్ వల్ల వచ్చే సమస్యలు
వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల అలసట, బలహీనత వస్తుంది. తలనొప్పి, తల తిరగడం, డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, యూరిక్ యాసిడ్ పెరగడం వంటివి జరుగుతాయి. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. జుట్టు రాలిపోవడం, స్కిన్‌లో మార్పులు జరుగుతాయి.
అలాగే ఈ వాటర్ ఫాస్టింగ్ ఎక్కువ రోజులు చేసి.. తర్వాత ఆహారం తీసుకుంటే రీఫీడింగ్ సిండ్రోమ్ అనే పరిస్థితి రావచ్చు. ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు. ఎందుకంటే ఇది గుండె, మెదడు మీద కూడా ప్రభావం చూపుతుంది.
ఎవరు అస్సలు చేయకూడదంటే..
కొన్ని సమస్యలున్నవారు ఈ వాటర్ ఫాస్టింగ్ అస్సలు చేయకూడదంటున్నారు. టైప్ 1 డయాబెటిస్, పోషకాహార లోపంతో ఉండేవారు దీనిని చేయకూడదు. ఇప్పటికే బలహీనంగా ఉంటూ.. క్రమం తప్పకుండా మందులు తీసుకునేవారు దీనిని అస్సలు చేయకపోవడమే మంచిదని అంటున్నారు. ఇది వారికి మంచి ఫలితాలు ఇవ్వడం కాదని.. ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.
వైద్యుల సూచనలివే..
మీరు వాటర్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే.. ముందుగా ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలని సూచిస్తున్నారు. ఉపవాసం తర్వాత ఆహారం ఎలా ప్రారంభించాలో ప్లాన్ ఉండాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. డిటాక్స్ పేరుతో నీటి ఉపవాసం చేయడం ట్రెండ్ అయిపోయింది. కానీ ఆరోగ్యం విషయంలో ట్రెండ్‌ను ఫాలో అవ్వడం కంటే.. శాస్త్రీయంగా సేఫ్ మార్గాన్ని ఎంచుకుంటే మంచిది.
బరువు తగ్గాలనుకుంటే..
హెల్తీగా బరువు తగ్గాలనకుంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. కేలరీలు కంట్రోలే చేయాలి. డైట్లో ప్రోటీన్ చేర్చుకుంటూ.. రెగ్యులర్ వ్యాయామం చేయాలని.. స్ట్రెంత్ పెంచుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
