ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు..  ఆశ్వయుజ శుద్ధ నవమిని ''మహర్నవమి'' అంటారు. ''దుర్గాష్టమి'', ''విజయదశమి'' లాగే ''మహర్నవమి'' కూడా అమ్మవారికి విశేషమైన రోజు అని పండితులు చెబుతున్నారు. మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు.


ఈ రోజున అమ్మవారు సింహ వాహిని గా పది చేతులలో ఆయుధాలు ధరించి మందస్మిత హాసినిగా దర్శనం ఇస్తుంది. మహిషాసుర వధ తర్వాత మహిషాసుర మర్థిని గా ఈరోజున దేవిని కొలుచుకుంటారు. మహార్నవమి రోజున ఎర్రచీరను దేవికి అలంకరిస్తారు.   కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.


అమ్మవారు నవదుర్గలలో ఆఖరి అవతారమైన సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమిస్తారు. సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది కాబట్టి ఆమెకు ‘సిద్ధిదాయిని’ అని పేరు. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. సిద్ధిదాయినీ దేవి చతుర్భుజ. సింహవాహిని. సిద్ధులన్నింటినీ ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులనూ దేవికృప వల్లనే పొందారని ‘దేవీ పురాణం’ పేర్కొంటోంది. ఆమె పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. ఈ రోజున అమ్మవారికి పులిహోర, గారెలు, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించుకుంటారు.


దేవీ ఉపాసకులు కుండలినీ శక్తితో సాధన చేసినవారు తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది విధాలుగా భావించి అర్చిస్తారు.10వ రోజున ‘దశ’ అవస్థలో విజయాన్ని పొందుతున్నారు. కాబట్టి నవరాత్రి వ్రతానికి విజయదశమి ముగింపుగా చెప్పారు. బాలా త్రిపుర సుందరి మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీ లలితా త్రిపురసుందరి, దుర్గ, మహిశాసురమర్దిని రాజరాజేశ్వరి,అనే పేర్లతో విభిన్నమైన అలంకారంతో పుజిస్తారు. కొంతమంది కుమారి పూజ వివిధ వయస్సులలో ఉన్న చిన్న పిల్లలు 10 సం.లు లోపు ఉన్న వారిని కుమారి త్రిమూర్తి కళ్యాణి, రోహిణి కాళిక, చండిక శాంభవి, దుర్గ సుభద్ర తదితర పేర్లతో పుజిస్తారు .


భాద్రపదంలో నిర్విఘ్న కార్యసిద్దికి వినాయకుని పూజించి ఆశ్వయుజ మాసంలో ఆదిశక్తి-జగజ్జనని అయిన అమ్మవారిని వివిధ రూపాలలో అమ్మవారిని అర్చించడం ద్వారా విజయ అందుకోవచ్చు. కాబట్టి ఈ పర్వదినం విజయదశమి. అర్జునుడు ఈ రోజునే ఉత్తర గోగ్రహణంలో విజయం పొందాడని – విజయదశమి నాడు శ్రీ రాముడు రావణుని సంహరించడాని అంటారు.


శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,


శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే


అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే ”దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.



Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం



Also Read: శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు, తింటే ఏమవుతుంది!