విజయనగర సామ్రాజ్యం అంటేనే దసరా వేడుకలకు పెట్టింది పేరు. పది రోజులు పాటు జరిగే ఆ ఉత్సవాలు చూడడానికి పక్క రాజ్యాల నుంచే కాకుండా విదేశీ యాత్రికులు సైతం వచ్చేవారు. అప్పుడు వారు రికార్డ్ చేసిన అనుభవాలు నేటికీ పదిలంగా ఉన్నాయి.
దక్షిణ భారతదేశ సంస్కృతిని 300 ఏళ్లపాటు వివిధ రకాల దాడులను కాపాడిన ఘనత విజయనగర సామ్రాజ్యానిదే. కాకతీయ సామ్రాజ్యం పతనం మొదలు ఆంగ్లేయుల ఉధృతి బలపడే వరకు విజయనగర రాజుల ప్రభావం కొనసాగింది.
300 సంవత్సరాల మధ్య కాలంలో నాలుగు వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. వేరు వేరు రాజులు హంపీని పరిపాలిస్తున్న టైం లో వేరు వేరు విదేశీ యాత్రికులు అక్కడ పర్యటించారు. విజయ నగర వైభవాన్ని అక్కడ దసరా జరిగే విధానాన్ని చక్కగా రికార్డ్ చేసి పెట్టారు. ఇప్పుడు రాజులు రాజ్యాలు పోయినా ఆ టూరిస్టుల అనుభవాలు మనకు అప్పటి చరిత్రను అందిస్తున్నాయి.
Also Read: దాండియా నృత్యాలతో కలర్ ఫుల్‌గా సాగే గుజరాతీ దసరా "గర్బా"
దేవరాయ-2 కాలంలో (1423-1446)
మనం విజయనగర రాజుల్లో అతి గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే అనుకుంటాం.కానీ ఆయన కంటే వందేళ్లు ముందే విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించినవాడు సంగమ వంశానికి చెందిన రెండవ దేవరాయలు. ఆయన కాలంలో సామ్రాజ్యం శ్రీలంక నుంచి గుల్బర్గా వరకు, ఒరిస్సా నుంచి మలబార్ (కేరళ ) వరకూ విస్తరించి ఉండేదని ఆ కాలంలో ఇరాన్ నుంచి వచ్చిన యాత్రికుడు అబ్దుల్ రజాక్ రాశాడు. ఆ కాలంలో దసరా "నవరాత్రి" అని మాత్రమే పిలిచేవారట. పదవరోజును " దశ హర " లేదా విజయదశమి పేరుతో ఉత్సవం చేసేవారు. రెండో దేవరాయలు కు లెక్కలేనన్ని ప్యాలెస్ లు ఉండేవని "నవరాత్రులు " టైం లో ఒక్కో రోజు ఒక్కో ప్యాలెస్ లో ఉత్సవం జరిపించేవారట. దసరా సందర్భంగా దేవి రూపంతో ఉన్న కొన్ని ప్రత్యేక బంగారు నాణేలు ముద్రించేవారు. రాజ్యమంతటా ఆ పది రోజులు ఉత్సవాలు, మల్ల యుద్ధ పోటీలు జరుగుతూ ఉండేవని అబ్దుల్ రజాక్ రికార్డ్ చేశారు.
శ్రీ కృష్ణ దేవరాయలు (1509-29) కాలం లో దసరా నెక్స్ట్ లెవెల్
జీవితం లో ఓటమి ఎరుగని చక్రవర్తిగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయల పాలన తెలుగు చరిత్రలోనే స్వర్ణయుగం గా పేరుపొందింది. "సాహితీ సమారాంగణ సార్వ భౌముడి " గా పేరు తెచ్చుకున్న ఆయన కాలంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేవని ఆయన కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు డోమింగో పయస్ తన సొంత అనుభవాల్ని రికార్డ్ చేసి పెట్టాడు.
శ్రీకృష్ణ దేవరాయలు తన రాజధాని హంపీ లో జరిపే దసరా ఉత్సవాలను ప్రజలందరూ చూసేలా ఎత్తైన వేదికను నిర్మించాడు. ఇప్పటికీ దాని పేరు "దసరా దిబ్బ " గానే పిలుస్తున్నారు. దీనిపై కూర్చుంటే 360 డిగ్రీల కోణం లో చుట్టూ జరిగే దసరా వేడుకలను చూడొచ్చట. దసరా వేడుకల మొదటి రోజు శ్రీ కృష్ణ దేవరాయలు తన అంతపురం నుంచి దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి తన గుమ్మం ముందు చెక్కలతో ఒక టవర్ ఏర్పాటు చేసి ఆ టవర్ పైన విగ్రహాన్ని పెట్టేవారు. విగ్రహం చుట్టూ బంగారు, కెంపు,ముత్యాలతో అలంకరించిన కొన్ని పలకలపై బంగారం తో చేసిన దేవతల చిత్రపటాలు ఏర్పాటుచేసి ఆ దేవీ విగ్రహం ఉన్న టవర్ కి ఎదురుగా తన సింహాసనాన్ని ఉంచేవారు. తెల్ల వారుఝామునే బ్రాహ్మణులతో కలిసి వచ్చి దేవీ విగ్రహానికి పూజలు చేసేవారు. తర్వాత అమ్మవారి ముందు సంగీతం,నాట్యప్రదర్శన జరిగేది.అవి ముగిసాక శ్రీకృష్ణదేవరాయలు తన గుర్రాలు, ఏనుగులకు పూజలు జరిపేవారు. తర్వాత బ్రాహ్మణుల ఆశీస్సులు తీసుకుని అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి సింహాసనంలో కూర్చునే వారట. అప్పుడు దళపతులు, సైన్యాధిపతులు, మంత్రులు ఆయనకు నమస్కారాలు చేసేవారు. అక్కడితో ఉదయం పూట కార్యక్రమాలు ముగిసేవి.
Also Read: దేవీ త్రిరాత్ర వ్రతం - దసరాల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం!
మధ్యాహ్నం మల్ల యుద్దాలు
మధ్యాహ్నం పూట రాజ్య ప్రజలు దసరా వేడుకలు చూడడం కోసం అక్కడికి చేరుకునేవారు. రాజ కుటుంబీకులు, బంధువులు, మంత్రులు వారి వారి సీట్లలో కూర్చునేవారు. ప్రధానమంత్రి తిమ్మరుసు వచ్చి పరిస్థితి అంతా సక్రమంగా ఉందని తెలిపాక శ్రీ కృష్ణ దేవరాయలు బంగారు ఆభరణాలు ధరించి, వజ్రాలతో చేసిన పువ్వులు అతికించిన తెల్లటి బట్టలు ధరించి వచ్చి సింహాసనంలో కూర్చునేవాడు. అప్పుడు ప్రముఖులు అందరూ వచ్చి రాజ్ కు నమస్కారం చేయడంతో పాటు విలువైన కానుకలు ఆయనకు సమర్పించేవారు. ఆ తర్వాత మల్ల యుద్ధాలు, నృత్య, సంగీత ప్రదర్శన లు జరిగేవి. అలాగే గుర్రపు పోటీలు, ఏనుగుల పోటీలు, బళ్లాలు విసిరే పోటీలు,వీరుల మధ్య కత్తి యుద్దాలు జరిగేవి అని పయస్ రాసారు. వీటిలో గాయపడిన వారికి వెంటనే ప్రధమ చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పక్కనే ఉండేవట.
రాత్రి పూట బాణాసంచా
ఇక రాత్రిపూట నగరం మొత్తం దీపాల వెలుతురులో మెరిసిపోతూ ఉండేది. దానికి తోడు బాణసంచా వెలుగులు అదనం. ఆ సమయంలో రాజుగారి ముందు గుర్రాల కవాతు జరిగేది. ఇవన్నీ పూర్తయ్యాక చక్రవర్తి మరోసారి దేవీ విగ్రహానికి నమస్కారం చేసి తన అంతపురం లోపలికి వెళ్లిపోయేవారు. అనంతరం బ్రాహ్మణులు ఆ దేవీ విగ్రహాన్ని రాజప్రసాదం లోపలికి తీసుకొని వెళ్ళిపోయేవారు. "నవరాత్రుల "సమయం లో ప్రతిరోజూ ఇదే విధంగా సాగేది.
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!
"విజయదశమి" రోజు సైనిక బల ప్రదర్శన
పదో రోజైన " విజయదశమి " నాడు శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యం మొత్తాన్ని పరిశీలించేవాడు. సైనిక వందనం స్వీకరించడంతోపాటు ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకున్న గుర్రాలు,ఆయుధాలను ప్రదర్శించేవారు. అనంతరం అమ్మవారికి మరోసారి పూజలు నిర్వహించడంతో దసరా వేడుకలు ముగిసేవి. వీటిని చూడడం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా గుడారాలు, భోజనాలు ఏర్పాటు చేయడానికి కొందరు దళపతులకు బాధ్యతలు అప్పజెప్పే వారు. ఇవన్నీ చూసే ఆ కాలం లో భారతదేశంలోనే ఇటువంటి రాజు మరొకడు లేడనీ, విజయనగర రాజధాని "రోమ్ " నగరాన్ని తలపిస్తుందనీ నాటి యాత్రకులు రికార్డ్ చేసారు.