Sri Venkateswara Swamy Temple - Karnataka: నీళ్లు, పాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. అయితే గబ్బూరులో కొలువైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఓ వింత దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి విగ్రహానికి సెగలు కక్కే నీటితో అభిషేకం చేస్తారు.. ఆ నీరు తలనుంచి పాదాల దగ్గరకు వచ్చేసరికి చల్లగా మారిపోతాయి. రెప్పపాటులో జరిగే ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తరించేందుకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి వందలఏళ్ల చరిత్ర ఉంది.
సాధారణంగా పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడిగా, శ్రీ వేంకటేశ్వరుడిని అలంకార ప్రియుడిగా పిలుస్తారు. ఆ హరిహరులిద్దరూ కొలువుతీరిన క్షేత్రమే కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గబ్బూరులో ఉన్న లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం. ఇక్కడ శివయ్య -వెంకన్న కొలువుతీరడం వెనుక ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది.
Also Read: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
పన్నెండో శతాబ్దానికి చెందిన సేవన వంశ రాజు సింహనుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంలో వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ ఆలయాన్ని శివుడి కోసం నిర్మించారు. లింగాన్ని ఏర్పాటు చేసేందుకు గర్భగుడిలో ఓ పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ..తనకూ ఈ ఆలయంలో చోటుకావాలన్నాడట శ్రీహరి. విష్ణువు మాటమేరకు శివుడు తనకోసం ఏర్పాటు చేసిన పీఠంపై వేంకటేశ్వరుడి విగ్రహం ప్రతిష్టించేలా చేశాడట. ఆ తర్వాత కాలంలో అగస్త్యముని...శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం.
శివకేశవులు కొలువుతీరిన అరుదైన ఆలయాల్లో ఈ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. ప్రసన్న వేంకటరమణ, ప్రసన్న రాజేశ్వరుడిగా పూజలందుకుంటున్నారు హరిహరులు. ఇక్కడ స్వామివార్లను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో శివలింగంపై ప్రత్యేక గీతలు కనిపిస్తాయి..అందుకే దీనిని అరుదైన శివలింగంగా భావిస్తారు భక్తులు.
ఇక్కడ స్వామివార్లకు నిత్యం చేసే పూజలు ఒకెత్తు..ఆదివారం రోజు వేంకటేశ్వరుడికి జరిగే అభిషేకం మరో ఎత్తు. ఎందుకంటే ఆ రోజు కలియుగ దైవానికి వేడి వేడి నీటితో అభిషేకం నిర్వహిస్తారు. కానీ ఆ నీరు రెప్పపాటు కాలంలో చల్లగా మారిపోతుంది. కొన్నేళ్ల క్రితం కొందరు స్వామీజులు ఇక్కడకు వచ్చినప్పుడు..తొలిసారిగా వేడినీటిని తెప్పించి అభిషేకం చేశారని..అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నాం అని చెప్పారు ఆలయ అర్చకులు. కేవలం తలపై పోసిన నీరు చల్లగా మారిపోవడమే కాదు..మరో వింత కూడా ఉంది. చల్లటి నీటిని స్వామివారి నాభిస్థానంలో పోస్తే వేడిగా మారిపోతుంది.
Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!
స్వామివారికి వేడినీటి అభిషేకం కేవలం ఆదివారం మాత్రమే నిర్వహిస్తారు. ఈ వింతను చూసేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివెళతారు. ఈ ఆలయంలో శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనమి..ఇలా ప్రతి పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పారు అర్చకులు. ముఖ్యంగా శివరాత్రిరోజు ఇక్కడ నిర్వహించే రుద్రాభిషేకం, అఖండ క్షీరాభిషేకాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ క్షేత్రంలో హరిహరులతో పాటుగా హనుమంతుడు, లక్ష్మీనారాయణుడిని కూడా దర్శించుకోవచ్చు.
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!