Medaram Jathara Last Day 2024


మేడారం జాతరలో ఆఖరి ఘట్టం


ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో వనం నుంచి జనం మధ్యకు వచ్చిన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఫిబ్రవరి 24 శనివారం సాయంత్రం వన ప్రవేశంతో మేడారం జాతర ముగియనుంది. 


Also Read: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం - భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!


మొక్కులు చెల్లించుకున్న గవర్నర్, సీఎం


మూడు రోజుల్లో దాదాపు కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారని అంచనా.  తెలంగాణ గవర్నర్‌‌ తమిళిసై, సీఎం రేవంత్​ రెడ్డి సమ్మక్క సారలమ్మను దర్శించుకుని నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు.  చివరి రోజు దాదాపు 20 లక్షల మంది భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారని భావిస్తున్నారు. అడవి బిడ్డల జాతరలో అన్నీ తానై నిర్వహించిన మంత్రి సీతక్క జాతర సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. చివరిరోజు సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వెల్లువలా తరలివచ్చి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.  గంటల తరబడి క్యూలో నిలబడి మరీ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.


Also Read: ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది!


జాతరలో కీలక ఘట్టాలివే


కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో మేడారంలో మహాజాతర ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ములుగు జిల్లా మేడారానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని చిన్న ఆలయంలో ప్రతిష్టించిన సారలమ్మను జాతరలో మొదటి రోజు సాయంత్రం మేడారంలోని గద్దె వద్దకు చేరుస్తారు. మధ్యాహ్నమే కన్నెపల్లికి చేరుకున్న వడ్డెలు రెండు గంటల పాటు పూజలు చేస్తారు.  కన్నెపల్లి గ్రామ ఆడపడుచులు హారతులు ఇచ్చి అమ్మవారిని మేడారానికి సాగనంపుతారు. సారలమ్మ గద్దె పైకి రాకముందే ఏటూర్‌నాగారం మండలంలోని కొండాయి నుండి గోవిందరాజులను, పూనుగోండ్ల నుంచి పగిడిద్ద రాజును అటవీ మార్గం మీదుగా కాలినడకన మేడారానికి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సారలమ్మ సహా వీరిని తీసుకువచ్చే ముగ్గురు వడ్డెలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అనంతరం వారి వారి గద్దెలపై ప్రతిష్టింపజేస్తారు.  రెండోరోజు సమ్మక్క తల్లి సాయంత్రం గద్దెపైకి వస్తుంది.  మొదటగా గిరిజన పూజారులు  మేడారం సమీపంలోని చిలుకల గుట్టకు వెళ్ళి వెదురు కర్రలు తీసుకొచ్చి గద్దెలపై పెట్టి పూజిస్తారు. ఆ తర్వాత సమ్మక్క పూజా మందిరం నుంచి పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. తర్వాత మళ్ళీ చిలుకల గుట్టకు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే మహాఘట్టం మొదలవుతుంది.  తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె   తన్మయత్వంతో పరుగు పరుగున గుట్ట దిగుతాడు.  జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం మొత్తం శివసత్తుల పూనకాలతో హోరెత్తి ఊగిపోతుంది. దారి పొడవునా భక్తుల జన ప్రవాహం సాగుతుంది..అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా జంతు బలులు ప్రారంభమవుతాయి. కుంకుమ భరణిని గద్దెలపైకి చేర్చిన తర్వాత మహా జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. గద్దెలపైకి సమ్మక్క-సారమ్మ వనదేవతలు ఆసీనులైన మూడో రోజు భక్తులు పోటెత్తుతారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన   అమ్మవార్లను దర్శించుకుంటారు. కానుకలు చెల్లిస్తారు.  వన దేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు, కుంకుమలు, చీరె, సారె, పెడతారు. ఒడిబియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం నైవేద్యాలుగా పెడతారు. 


Also Read: మేడారం జాతరలో బెల్లమే బంగారం ఎలా అయింది!


నాలుగో రోజు సాయంత్రం తిరిగి వన ప్రవేశం
మేడారం మహాజాతరలో నాలుగోరోజు సమ్మక్కను చిలుకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవింద రాజును కొండాయికి, పగిడిద్ద రాజును పూనుగొండ్లకు కాలనడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది.  సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఈ క్రతువు ముగుస్తుంది. సమ్మక్క చిలుకల గుట్టపైకి, సారలమ్మ కన్నెపెల్లికి తరలివెళ్ళిన తర్వాత భక్తులు తిరుగు పయనమవుతారు. మళ్ళీ రెండేళ్ళపాటు భక్తులు తల్లుల రాక కోసం వేచి చూస్తుంటారు.