మత్స్యావతారం కథ
వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడింది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు మళ్లీ వచ్చిన చేప ఇలా అంది “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు … ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అప్పుడు ఆ చేప... “తాను శ్రీమన్నారాయణుడుని అని , ఏడు రోజులలో ప్రళయం రానున్నదని , సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుందని...నీలాంటి సత్యవంతుడు బతికేఉండాలని పలికింది చేప. అప్పటికప్పుడు పెద్ నౌకను నిర్మించి అందులో పునఃసృష్టికి అవసరమైన ఔషధాలు , బీజాలు వేసుకుని సిద్ధంగా ఉండమని , సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది. చేపరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు.పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రసిద్ధికెక్కాడు.
Also Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
వేదాలు అపహరణ
ప్రళయానంతరం నిద్రలేచిన బ్రహ్మ సృష్టికార్యం చేద్దామనుకోగా వేదాలు అపహరించుకుని సముద్ర గర్భంలో దాక్కుంటాడు సోమకాసురుడు. అప్పుడు బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , మత్స్య రూపంలో ఉన్న విష్ణువు సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొస్తాడు. శంఖాన్ని తాను తీసుకున్న విష్ణుమూర్తి... శిథిలమైన వేదభాగాలను పూరించమని బ్రహ్మను ఆజ్ఞాపిస్తాడు.
మత్స్య జయంతి రోజు ఏం చేయాలి
ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేసిన రోజు. అందుకే వైష్ణవఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, ఉపవాస దీక్షలు చేస్తారు. మత్స్యజయంతి రోజు ఇలా చేస్తే మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారమని భక్తుల విశ్వాసం.
Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
మత్స్య జయంతి రోజు పఠించాల్సిన శ్లోకం
నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోవ్యయః|
అనుగ్రహాయ భూతానాం ధత్తె రూపం జలౌకసామ్ |
నమస్తే పురుషశ్రేష్ఠ! స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర |
భక్తానాం నః ప్రపనానాం ముఖ్యొహ్యాత్మగతిర్విభో
సర్వే లీలావతారాస్తె భూతానాం భూతిహెతవః|
జ్ఞాతుమిచ్ఛామ్యదొ రూపం యథార్థం భవతా వృతమ్
న తేరవిన్దాక్ష పదోపసర్పణం మృషా భవేత్ సర్వసుహృత్ప్రియాత్మనః|
యథెతరెషాం పృథగాత్మనాం సతా మదీదృశొ యద్వపురద్భుతం హి నః
మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. అది తిరుపతికి 70 కి.మీ. దూరంలో నాగలాపురం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారిని వేదనారాయణస్వామి అని పిలుస్తారు.