Margashirsha Laxmi Puja 2022 : నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతారు. ఆధ్యాత్మిక పరంగా ప్రతిరోజూ ప్రత్యేకమే అయినప్పటకీ కొన్ని ముఖ్యమైన రోజుల్లో లక్ష్మీదేవిని కొలిస్తే సిరిసంపదలకు కొదవ ఉండదు. ఆది లక్ష్మి, ధన లక్ష్మి, విద్యా లక్ష్మి, ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, ధాన్య లక్ష్మి, గజ లక్ష్మి, విజయలక్ష్మి...లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలుగా ఆరాధిస్తారు. ఈ రూపాల వెనుకున్న ఆంతర్యం ఏంటంటే....
ఆది లక్ష్మి
ఆది అంటే ఆరంభం. ఆలోచనతో వేసే తొలి అడుగే ముందుగు నడిపిస్తుంది..జయాపజయాలను నిర్ణయిస్తుంది. అందుకే ఆదిలక్ష్మిని ‘లక్ష్య లక్ష్మి’ అనీ పిలుస్తారు
ధనలక్ష్మి
ఐశ్వర్యానికి దేవత ధనలక్ష్మి. ఆ అమ్మ చేతిలో కలశం ఉంటుంది. కలశం సంకల్పానికి ప్రతీక. సంకల్పం బలమైనది అయితే లక్ష్మీదేవిని ఇంట్లో తిష్టవేసుకులా చేయొచ్చు. ధనాన్నినువ్వు గౌరవిస్తే ఆ ధనం నీకు వైభోగాన్నిస్తుంది. కోట్ల ఆస్తులైనా ఒక్క రూపాయి పొదుపుతోనే మొదలవుతుంది.
ధైర్య లక్ష్మి
ధైర్యే సాహసే లక్ష్మి అంటారు..ప్రపంచం మెచ్చిన దిగ్గజాలంతా చిటికెలో సంపన్నులైపోలేదు. ధైర్యంగా అడుగు ముందుకేయాలి, ఎదురైన వైఫల్యాలకు కుంగిపోకుండా ముందుకు సాగాలి..కొత్తదారి నిర్మించుకోవాలి.విజయం అనేది ధైర్యానికి లభించే విలువైన ప్రతిఫలం.
Also Read: నిలదీస్తే జటాయువు స్థితి - మిన్నకుంటే భీష్ముడి పరిస్థితి తప్పదు!
విద్యాలక్ష్మి
విద్యకు అధిదేవత సరస్వతీదేవి కదా అంటారా..నిజమే..విద్యకు దేవత సరస్వతీ దేవి అయితే..ఆర్థిక విద్యకు అధిదేవత విద్యాలక్ష్మి. సంపాదించడం కాదు.. ఆర్థిక విద్య తెలుసుకుంటేనే ఆ సంపద నిలబడుతుంది.
సంతాన లక్ష్మి
సంతానం కూడా సంపదకు ప్రతీకే. 'ఎంతుంటే ఏంటి పిల్లలు లేరు కదా'..ఈ మాట ఎవరో ఒకరి నోటివెంట వినే ఉంటారు. ఆ పిల్లల ప్రయోజకులు కావాలంటే సంపద అవసరం..ఆ సంపదను పెంచాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.
ధాన్య లక్ష్మి
ధాన్య లక్ష్మిని ‘అన్న లక్ష్మి’ అని కూడా అంటారు. పండే ప్రతి గింజా రైతన్న కష్టానికి ఫలితం. విత్తు నుంచి కోత వరకూ చాలా కష్టపడతారు. సంపాదన అంతా శ్రమకు ఫలితమే. అందుకే తినే అన్నాన్ని గౌరవించాలి. తిట్టుకుంటూ, విసుక్కుంటూ భోజనం చేయకూడదు
గజ లక్ష్మి
లక్ష్మీదేవి వాహనం ఏనుగు కూడా ఓ ఆర్థిక వికాస పాఠమే. గజరాజు కండ్లు చిన్నగా ఉంటాయి కానీ తీక్షణత ఎక్కువ. ఆర్థిక వ్యవహారాల విషయంలో మీరు పెట్టేది తక్కువ మొత్తంఅయినా వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు అపారంగా ఉండాలంటే అంతే పదునైన దృష్టితో చూడాలి.
విజయ లక్ష్మి
గెలుపు శిఖర సమానం. అంతెత్తుకు చేరుకోవడం ఎంత కష్టమో, ఒక్క మెట్టు కూడా జారకుండా.. స్థిరంగా అక్కడ నిలబడటమూ అంతే ముఖ్యం. అందులోనూ సంపద చంచలమైనది...స్థితప్రజ్ఞతతోనే అది సాధ్యం.
Also Read: నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్టి - వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఇలా చేయండి
అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయని చెబుతారు. షోడశ అంటే 16...
1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం, 6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు, 8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం, 12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం, 14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః
అష్టలక్ష్మీ స్తోత్రం
ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||
ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||
ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||
గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||
సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||
విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||
విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||
ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||
ఫలశృతి
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||
శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి