Story Behind Sankranti Haridasu and Gangireddu:


అమ్మగారికి దణ్ణం పెట్టు...అయ్యగారికి దణ్ణం పెట్టు.. అంటూ ప్రతి ఇంటిముందూ బసవన్నల సందడి కనిపిస్తుంది. చిన్నారులంతా వాటి వెనుకే పరిగెత్తుతూ..దగ్గరకు వెళ్లేందుకు భయపడుతూ..దూరం నుంచే చూస్తూ సంబరపడిపోతుంటారు.. మరోవైపు సంక్రాంతి పండగ రోజు ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, నుదుటన మూడు నామాలు, తలపై అక్షయ పాత్ర పెట్టుకుని సంక్రాంతి రోజున సంకీర్తనలు పాడుతూ, హరిలో రంగ హరి అంటూ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ ఊరంతా తిరుగుతుంటారు హరిదాసులు. సంక్రాంతి సందర్భంగా వచ్చే వీళ్లకు బియ్యం, వస్త్రాలు సహా తోచిన దానం చేస్తే వెళ్లిపోతారులే అనుకుంటే పొరపాటే.  భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ నాలుగు రోజుల సంబరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హరిదాసు, బసవన్న సాక్షాత్తూ పరమేశ్వరుడు,శ్రీ మహావిష్ణువు రూపాలే... 


Also Read: భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!


శివుడితో కలిసొచ్చిన నంది బసవన్న


నలుగుపిండితో స్నానాలు, భోగిమంటలతో భోగికి స్వాగతం పలుకుతారు. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటి ముందూ రంగవల్లులు కళకళలాడిపోతుంటాయి. రంగురంగుల ముగ్గులు వాటి మధ్య గొబ్బిళ్లు ముచ్చటగొలుపుతాయి. ఆ ముగ్గుల మధ్యలో తిరుగుతూ డూడూ బసవన్న సందడి చేస్తాడు. 


బసవన్న అలంకరణ ప్రత్యేకం


గంగిరెద్దుల అలంకరణ ఆకట్టుకునేలా ఉంటుంది. బట్టలను బొంతలుగా కుట్టి వాటికి అద్దాలు పొదుగుతారు. చెమ్కీ దండలు జతచేసి, మూపురం నుంచి తోక వరకూ కప్పుతారు. ముఖం దగ్గర రంగుల తోలు కుచ్చు, మూతికి తోలుతో కుట్టిన శిఖమారు, కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి బసవన్నను అలంకరిస్తారు. వాటికి ఆడించే కళాకారులూ ప్రత్యేకంగా ముస్తాబవుతారు. రంగురంగుల తలపాగా,  కోరమీసాలు, చెవులకు కమ్మలు, పాత కోటు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి .. సన్నాయి. బూర, డోలు, చేతిలో చిన్న కంచు గంట పట్టుకుని పాటలు పాడుతూ వినోదాన్ని పంచుతారు.  


Also Read: శనివారం ఈ రాశులవారికి ఆనందం, ఆదాయం - జనవరి 13 రాశిఫలాలు


బసవన్న నిలబడిన నేల ధర్మబద్ధమైనది


సంక్రాంతి వేళ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపంగా భావించి ఇంటి వాళ్లు హారతి పట్టి పూజిస్తారు. “డూ..డూ బసవన్న.. రారా బసవన్నా..’ అనగానే ఎద్దులు ముందుకు వస్తాయి. “అమ్మవారికి దండం పెట్టూ..అయ్యగారికి దండం పెట్టు ‘ అనగానే ముందరి కాలెత్తి సలాం చేస్తాయి. “అయ్యగారికి శుభం కలుగుతుందా..? తలపెట్టబోయే కార్యం సఫలమవుతుందా..?’ అనగానే గంగిరెద్దులు తలాడించడాన్ని శుభ సూచికంగా, నందీశ్వరుడి దీవెనగా భావిస్తారు. ఇంటి ముందు ముగ్గులో బసవన్న నిల్చుంటే ఆనేల ధర్మభద్దమైనది అని చెబుతారు.


భూమిని మొస్తున్న విష్ణువే హరిదాసు
తలపై  పాత్ర పెట్టుకుని భక్తుల కోసం నేరుగా శ్రీహరే హరిదాసుగా మారి వస్తాడని నమ్మకం. తలమీద గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర భూమికి సంకేతం. ఆ పాత్రను తలమీద పెట్టుకోవడం అంటే....శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పటం. భక్తులంతా సమానమంటూ తరతమ భేదాల్లేకుండా ఇంటిఇంటికీ తిరుగుతాడు.


Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు!


వెనక్కు తిరిగి చూడరు - సంకీర్తన ఆపరు


ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. నుదుటన మూడు నామాలు, పంచె, పైనా శాలువా కప్పుకుని  వీధుల్లో తిరుగుతూ విష్ణు కీర్తనలు ఆలపిస్తుంటాడు హరిదాసు. ఎవరినీ భిక్షం అడగరు...ఎవరైనా ఇస్తేనే తీసుకుంటారు. వెనక్కి తిరిగి చూడరు, ఇల్లు దాటి వెళ్లాక ముందుకే నడుస్తారు..ఎవరితోనూ మాట్లాడరు, విష్ణు కీర్తనలు చేస్తూ సాగిపోతారు. ప్రతి ఇంటి ముందు హరిదాసు వెళుతున్నప్పుడు కాళ్లు కడిగి ఆశీస్సులు పొందుతారు. సంక్రాంతి పండగ రోజున అందరూ భగవత్ నామస్మరణ చేయాలని, అదే వినాలని, భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్న ఉద్దేశంతో విష్ణు కీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతుంటారు.


Also Read: మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను - సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసే గొబ్బిళ్ల పాటలివే!


ఈ సంక్రాంతి వేళ మీ ఇంటికి ముందుకు వచ్చే హరిదాసు, బసవన్నకి తోచిన సహాయం చేయండి..ఖాళీగా వెనక్కు తిరిగి పంపించవద్దు....


ABP దేశం ప్రేక్షకులందరకీ భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు