Maha Shivratri: మహా శివరాత్రి కోసం ఈశా యోగా సెంటర్ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి తరువాతి రోజు ఉదయం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో ఈ మహా శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈశా ఫౌండేషన్, సద్గురు యూట్యూబ్ ఛానళ్లలో ఈశా మహా శివరాత్రి లైవ్ స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ సహా అన్ని ప్రాంతీయ భాషల ప్రముఖ టీవీ ఛానళ్లు సహా 'ఏబీపీ దేశం'లో కూడా ఈ లైవ్ రానుంది.
జాగరణ
మన దేశంలో మహా శివరాత్రి ప్రధాన పండుగల్లో ఒకటి. ఆది గురువుగా పేరున్న శివుడికి ధ్యానం అంటే చాలా ఇష్టం. అందుకే శివరాత్రి రోజు రాత్రి జాగరణ (మేల్కొని ఉండటం) చేయడం ద్వారా మనలో కొత్త శక్తి వస్తుందని భక్తులు నమ్ముతారు. శారీరకంగా, మానసికంగా ఎప్పుడూ జాగృతిగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని గురువులు చెబుతుంటారు. ఆరోజు రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచి ధ్యానంలో ఉండమని సూచిస్తారు.
కొవిడ్ జాగ్రత్తలు
కొవిడ్ వ్యాప్తి తగ్గినప్పటికీ ఈ కార్యక్రమం కోసం తగిన జాగ్రత్తలు చేపడుతున్నారు. ఆహ్వానం ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. కానీ ఈ కార్యక్రమం మొత్తం 16 భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఏటా ఈ కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి మెడికల్ స్క్రీనింగ్, భౌతిక దూరం, మాస్కు ధరించడం, శానిటైజర్ వినియోగం తప్పనిసరి.
ఇలా మొదలు
ధ్యానలింగ దగ్గర పంచభూతాల ఆరాధనతో ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఆ తర్వాత రాత్రి నుంచి ఉదయం వరకు లింగ భైరవి మహా యాత్ర, సద్గురు ప్రవచనం, రాత్రి ధ్యానం, ఆదియోగి దివ్య దర్శనం జరుగుతాయి. ఇవి కాకుండా అద్భుతమైన సంగీత, నృత్య కార్యక్రమాలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కళాకారులు ఇందులో పాల్గొననున్నారు.
2021లో జరిగిన ఈశా మహా శివరాత్రి కార్యక్రమం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ కార్యక్రమం.. గ్రామీ అవార్డ్స్ టెలికాస్ట్ కంటే 50 శాతం ఎక్కువ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. 130 దేశాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
రుద్రాక్ష దీక్ష
రుద్రాక్ష అంటే శివుని కన్నీళ్లు. మహా శివరాత్రి వేడుకలో ఆన్‌లైన్ లేదా నేరుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సద్గురు ప్రత్యేకంగా పూజ చేసిన రుద్రాక్షను పొందే అవకాశం ఉంది. ఆది యోగి కృపను పొందేందుకు రుద్రాక్ష సాయం చేస్తుందని అందరూ నమ్ముతారు. దాదాపు 50 లక్షల రుద్రాక్షలను దేశవ్యాప్తంగా ఉచితంగా పంచిపెడతారు.
ఏడు రోజుల పాటు
ఈ ఏడాది మహా శివరాత్రి వేడుక మరింత ప్రత్యేకం కానుంది. తొలిసారి ఏడురోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నారు. మార్చి 8 వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. మహా శివరాత్రి రోజు సహా తరువాతి ఏడు రోజుల పాటు మహా అన్నదానం జరగనుంది.
వీళ్లే కళాకారులు
పాపోన్
అంగరాగ్ మహంతా.. పాపోన్ అని ఎక్కువగా పిలిచే అసోం గాయకుడు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు.
మాస్టర్ సలీమ్
బాలీవుడ్‌కు చెందిన మాస్టర్ సలీమ్ కూడా ఈ కార్యక్రమంలో పాడనున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలు, ఆల్బమ్స్‌లో ఆయన పాటలు పాడారు.
హన్స్‌రాజ్ రఘువంశీ
శివుని మీద ఎక్కువ పాటలు పాడిన హన్స్‌రాజ్ రఘువంశీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.
మంగ్లీ
మంగ్లీగా అందరూ పిలిచే తెలుగు సింగర్ సత్యవతి రాఠోడ్ కూడా ఇందులో మరోసారి తన పాటలను వినిపించనున్నారు. ఈశా మహా శివరాత్రి వేడుకల్లో ఆమె పాల్గొనడం ఇది రెండోసారి.
సీన్ రోల్డన్
కర్ణాటిక్ సంగీతంలో సుప్రసిద్ధుడైన రాఘవేంద్ర రాజా రావు (సీన్ రోల్డన్) తన మ్యూజిక్‌తో అందర్ని అలరించనున్నారు.