‘జగనన్న తోడు’ (Jagananna Thodu) పథకం కింద ఏపీ సీఎం వైస్ జగన్ (YS Jagan) నిధులను విడుదల చేశారు. రోడ్ల పక్కన లేదా తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు వంటి చిరు వ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చిరు వ్యాపారులు మొత్తం 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్లను విడుదల చేసింది. వీరికి ఇచ్చే రూ.10 వేల రుణాలను వడ్డీ లేకుండా పంపిణీ చేస్తున్నారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్‌ 25న ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడతలో 5,35,112 మందికి, రెండో విడతలో 3,70,517 మందికి, రెండు విడతల్లో కలిపి మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది.


మూడో విడతలో భాగంగా జరిగిన ఈ రుణాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిధులు విడుదల చేసి ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ (CM Jagan) మాట్లాడారు. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు పథకం లక్ష్యం అని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని, లక్షల మంది చిరు వ్యాపారులు స్వయంగా ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.


వారి కాళ్ల మీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తాను చేసిన పాదయాత్రలో చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలు చూశానని జగన్‌ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. వడ్డీ లేని రుణాలు తీసుకున్నవారికి క్రమం తప్పకుండా మళ్లీ లోన్లు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి లబ్ధి కలిగేలా చేయగలిగామని వెల్లడించారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు.


ఈ జగనన్న తోడు (Jagananna Thodu) పథకానికి అర్హులై ఉండి ఒకవేళ రుణం కనుక రాకపోతే, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. లబ్ధి దారులకు ఈ పథకం గురించి సందేహాలు ఉంటే 08912890525 అనే నెంబరుకు కాల్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అవినీతికి, అక్రమాలకు చోటు లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందిస్తున్నామని వివరించారు. ఎవరికైనా డబ్బులు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.