Jagananna Thodu: రేపు(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు(Jagananna Thodu) పథకాన్ని అమలు చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు వేయనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. చిరు వ్యాపారులకు రోజు వారీ పెట్టుబడి కోసం వడ్డీ లేని రుణాలను జగనన్న తోడు పథకం ద్వారా అందించనున్నారు. వడ్డీ వ్యాపారుల అవసరం లేకుండా ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ. 10 వేలు రుణం(Loan) అందిస్తుంది. మొత్తం 5.10 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 510 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తుంది. వడ్డీ రీఎంబర్స్ మెంట్ రూ. 16.16 కోట్లు కలిపి మొత్తం రూ.526 కోట్లు సోమవారం ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటి వరకూ 14.16 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1416 కోట్ల రుణాలు అందించారు. లబ్ధిదారుల తరపున ప్రభుత్వం బ్యాంకుకు రూ.32.51 కోట్ల వడ్డీ చెల్లించింది. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది.
జగనన్న తోడు పథకం
ఏపీలో అధిక వడ్డీల భారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రారంభించింది. జగనన్న తోడు పథకం క్రింద బ్యాంకుల్లో ఒక్కోక్క చిరు వ్యాపారులకు ఏటా 10 వేల రుపాయలు వరకు వడ్డీలేని రుణం అందిస్తోంది. పది వేల రుపాయలకు ఏడాదికి అయ్యే వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందిస్తుంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 వడ్డీలేని రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల భారిన పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం తీసుకొచ్చింది.
అర్హులు వీరే
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక దుకాణాలు(Shops) ఉన్న వారందరూ ఈ పథకానికి అర్హులు. ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు అమ్ముకునే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు(Tiffen Center) నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్ సైకిళ్ళు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారికి ఈ పథకం ద్వారా వడ్డీలేని రుణాలు అందించనున్నారు. చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవారు, బొబ్బలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవించే వారికి జగనన్న తోడు పథకం ద్వారా రుణాలు అందిస్తున్నారు. అర్హత కలిగి జాబితాలో పేర్లు నమోదు కాని వారు కంగారు పడాల్సిన పనిలేదని, గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.