Pancha Bhoota Linga Temples: సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు పంచభూతాలు సైతం తానే అంటాడు. అందుకే శివం పంచభూతాత్మకం అంటారు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాలకు ప్రతిరూపంగా పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలే పంచభూత లింగ క్షేత్రాలు..వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
ఆకాశలింగం-చిదంబరం ( తమిళనాడు)
చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం
భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు
దీనిని సూచిస్తూ మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే కనిపిస్తుంది. అంటే నిరాకారుడుగా ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటాడు. శంకరుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. చిదంబర క్షేత్రం చెన్నై నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!
పృథ్వి లింగం-కంచి ( తమిళనాడు)
పంచభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం. ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు. ఓ సమయంలో గంగమ్మ... లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు. స్వామి మామిడి చెట్టు కింద వెలిసాడు కాబట్టి ఏకాంబరుడు అని అంటారు. ఈ క్షేత్రం చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!
వాయులింగం- శ్రీకాళహస్తి ( ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం. ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మిస్తారు. శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే. కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో ఉంటాయి. దీంతో స్వామి వారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు. అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి. విజయవాడకు 377 కిలోమీటర్ల దూరంలో...తిరుపతి నుంచి దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకుంటారు.
Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
జలలింగం- జంబుకేశ్వరం ( తమిళనాడు)
తమిళనాడులో కొలువైన మరో పంచభూతలింగక్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ ఒకప్పుడు జంబూవృక్షాలు అంటే నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే జంబుకేశ్వరం అని పేరొచ్చిందని చెబుతారు. శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. పానపట్టంపై .
కప్పిన ఓ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు తీసి నీళ్లు పిండి మళ్లీ వేస్తుంటారు. చెన్నై నుంచి 331 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం.
Also Read: ఈ రాశివారి మేధో సామర్థ్యం అద్భుతం, జనవరి 25 రాశిఫలాలు
అగ్నిలింగం-అరుణాచలం ( తమిళనాడు)
కొండ మీద వెలిసే దేవుడిని దర్శించుకుని ఉంటారు..కానీ ఏకంగా దేవుడే కొండరూపంలో వెలసిన క్షేత్రం అరుణాచలం. ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు. పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం.