ఈ సంవత్సరపు చివరి చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన ఏర్పడనుంది. చంద్రగ్రహణం ఈ సారి కార్తిక మాసంలో ఏర్పడుతోంది. సూర్యుడు, చంద్రుడు భూమికి సరిగ్గా వ్యతిరేక దిశల్లో ఉన్నపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మంగళవారం కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే చంద్రగ్రహణం.. సంపూర్ణ చంద్రగ్రహణం.

  


చంద్రగ్రహణ తేది - నవంబర్ 8, 2022


గ్రహణం మొదలయ్యే సమయం - సాయంత్రం 5.32 ని.


గ్రహణం పూర్తయ్యే సమయం - సాయంత్రం 6-18 ని.


పూర్తి గ్రహణ సమయం - 45 నిమిషాల 52 సెకండ్


గ్రహణ సూతక కాలం - నవంబర్ 8, 2022,  ఉదయం 9.21 ని. మొదలవుతుంది. సాయంత్రం 6.18 నిమిషాలకు పూర్తవుతుంది.


ఏయే దేశాల్లో కనిపిస్తుంది? ఇండియాలో ఎక్కడ?


ఈ చంద్రగ్రహణం మన దేశంలో మాత్రమే కాదు.. అన్ని ఆసియా దేశాలకు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, ఉత్తర, తూర్పు యూరప్ కోన్ని ప్రాంతాలలో, సౌత్ అమెరికాలో కూడా కనిపిస్తుంది.


ఇండియాలో తూర్పు ప్రాంతాల వారు మాత్రమే సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడగలరు. దేశంలోని మిగతా భాగాలలో పాక్షిక చంద్ర గ్రహణం మాత్రమే కనిపిస్తుంది.


జ్యోతిష్యం ప్రకారం ఈసారి వచ్చే చంద్రగ్రహణం కాస్త గంభీరమైనదే. ఇది చాలా సహజమైన ఖగోళ పరిణామమే. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గ్రహణాలు చాలా తరచుగా ఏర్పడుతున్నాయి. జ్యోతిష్యం గ్రహణ పరిణామాలు మన జీవితాల మీద చాలా ప్రభావాన్ని చూపుతాయని చెబుతోంది. అందుకు తగినట్టుగానే గత కొన్ని సంవత్సరాలుగా మానవ జీవితాలు చాలా రకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఆర్థిక, మానసిక, ఆవేశపరమైన రకరకాల ఒడిదొడుకులను మనం గమనిస్తూనే ఉన్నాం.


గ్రహణ ప్రభావం


ఇటీవలే దీపావళి తెల్లవారి సూర్యగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. జ్యోతిష్య పండితురాలు నందిని శర్మ చెప్పిన వివరాలు ఆధారంగా.. ఈ చంద్ర గ్రహణం మంగళవారం నాడు ఏర్పడుతోంది. చంద్రుడు భరణి నక్షత్రంలో మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది అంత మంచి పరిణామం కాదు. దీని ప్రభావంతో సునామి, అధిక వర్షాలు, సముద్ర గర్భంలో అగ్ని పర్వతాలు బద్ధలవడం వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలున్నాయి. మనుషుల్లో మానసిక సంతులనం దెబ్బతినవచ్చు.


గ్రహణ కథ


సముద్ర మథనం తర్వాత లభించిన అమృతం దేవదానవులకు పంచడానికి విష్ణువు మోహినీ అవతారంలో వస్తాడు. స్వభాను అనే పేరు కలిగిన దానవుడు దేవతల పంక్తిలో కూర్చుని అమృత సేవనకు ప్రయత్నిస్తాడు. దేవతలైన సూర్య, చంద్రులు స్వభాను అమృతం తాగడం గమనించి విష్ణు మూర్తికి తెలియజేస్తారు. విష్ణువు జరిగిన మోసాన్ని గమనించి స్వభాను తల ఖండిస్తాడు. అయినప్పటికి అమృతం తాగిన స్వభాను మరణించడు. తల భాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా ఏర్పడతాడు. ఈ రాహు కేతువులు సూర్య చంద్రులకు శత్రువులైపోతారు.


గ్రహణ దోషం నుంచి రక్షించే మంత్రాలు


⦿ మహా మృత్యుంజయ మంత్రం


త్రయంబకం యజామహే


సుగంధిం పుష్టి వర్థనం


ఊర్వారుక మివ బంధనాత్


మృత్యోర్మూక్షియ మామృతాత్


⦿ ఓం నమ: శివాయ:


⦿ విష్ణు సహస్రనామం


⦿ శ్రీ రామరామేతి రమేరామే మనోరమే


సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాణనే




Also Read: కార్తీకమాసంలో ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఎలాంటి వత్తులు ఉపయోగించాలి?




గ్రహణం చూసే విధానం


గ్రహణం ఎప్పుడూ కూడా నేరుగా కంటితో చూడ కూడదు. నాసా వారి లైవ్ వివిధ ప్లాట్ ఫాంలలో అందుబాటులో ఉంటుంది. లేదా బైనాక్యూలార్ల ద్వారా, టెలీస్కోప్ ద్వారా, DSLR కెమెరా సహాయంతో చూడడం మంచిది.