ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కార్తీక పూర్ణమి రోజున ఏర్పడుతోంది. అయితే ఈ చంద్రగ్రహణ సమయాన్ని సూతకాలంగా చెబుతారు. ఈ నేపథ్యంలో గ్రహణం రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. మరి అవేంటో వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా సూర్య, చంద్ర గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడితే వాటిని అశుభంగా పరిగణించాలి. ఈ సంవత్సరం రెండు గ్రహణాలు కేవలం పదిహేనురోజుల వ్యవధిలోనే ఏర్పడ్డాయి. నవంబర్ 8, మంగళవారం రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది దేశంలోని అనేక ప్రాంతాల్లో పాక్షికంగా ఏర్పడితే, తూర్పు ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణంగా ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు ముగుస్తోంది. గ్రహణ వ్యవధి దాదాపు 45 నిమిషాల 49 సెకన్లు ఉంది. గ్రహణ ప్రారంభం నుంచి గ్రహణ మోక్ష కాలం వరకు మధ్య ఉన్న ఈ కాలాన్ని గ్రహణకాలం అంటాం. ఇక మంగళవారం కార్తీక పూర్ణమి కాబట్టి దీపాలను వెలిగించుకోవాలి అనుకునేవారు ఉదయం 8 గంటల లోపల కానీ, లేదా సాయంత్రం 6.30 నిమిషాల తర్వాత ఇంటిని శుద్ది చేసుకుని వెలిగించుకోవచ్చు.
ఇక గ్రహణ వేదన అనేది నవంబర్ 8, మంగళవారం రోజున ఉదయం 9.15 నుంచే ప్రారంభమవుతుంది. దీన్నే సూతకాలం అంటారు. సాధారణంగా గ్రహణం ఏర్పడే సమయానికి తొమ్మిది గంటల ముందే సూతకాలం ప్రారంభమవుతుంది. సోమవారం సాయంత్రం 4.15 నుంచి మంగళ వారం 4.31 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి మంగళవారం కూడా కార్తీక పూర్ణమి జరుపుకోవచ్చు. చంద్రగ్రహణాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఈ నేపథ్యంలో కొన్ని నియమాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
సూతకాలంలో ఈ పనులు అస్సలు చేయకూడదు
- సూతకాలం మొదలైన తర్వాత ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అలా చేస్తే ఎలాంటి ఫలితాలు లభించవు. పైగా ఇంటికి అరిష్టం కూడా.
- ఈ సమయంలో చాలా దేవాలయాలు కూడా మూసి ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలను మాత్రం వాటి వాటి స్థలమహాత్యం అనుగుణంగా తెరిచి ఉంచుతారు.
- గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను వండకూడదు, తినకూడదు. అయితే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు లేదా ముసలివాళ్లు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఉంటే వారికి ఈ నియమం వర్తించదు.
- గ్రహణ సమయంలో నిద్రించకూడదు..అలాగే ప్రయాణాలు కూడా చేయకూడదు.
- ముఖ్యంగా గర్భిణులు పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడకూడదు కనుక ఈ గ్రహణ సమయంలో బయటకి వెళ్లకూడదు.
- అలాగే గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేసి మళ్లీ శుచిగా ఆహారాన్ని వండుకుని తినాలి.
- నిలువ ఉండే పదార్థాలపై దర్భలను వేసి ఉంచాలి.
- ఇక ఈ గ్రహణ సమయంలో జపం చేసుకుంటూ ఉండడం చాలామంచిది. దైవధ్యానం వల్ల మానసిక ప్రశాంతతో పాటూ, గ్రహణం వల్ల ఏర్పడే దుష్ప్రభావాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. పైగా ఈ సమయంలో జపం చేయడం వల్ల అధిక ఫలం లభిస్తుంది.
Also Read: నవంబరు 8న చంద్రగ్రహణం, పట్టు-విడుపు సమయాలు, ఏ రాశులవారు చూడకూడదంటే!