Lord Krishna Teachings for Better Health: ఎన్నాళ్లు బతికాం అన్నది కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అన్నది ముఖ్యం. ఆరోగ్యాన్ని నిర్ణయించేది సరైన ఆహారం. అన్నిటికీ మించి ఆత్మజ్ఞానం పొందాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉండాలంటే ఆహారం తీసుకోవాలి.
తీసుకునే ఆహారం ఆయుష్షు పెంచుతుందా?
మీరు తీసుకునే ఆహారం సత్వ గుణం పెంచుతుందా?
మీరు తీసుకునే ఆహారం బలాన్ని పెంచుతుందా?
మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యాన్నిస్తుందా?
భగవద్గీత అంటే కేవలం కురుక్షేత్ర సంగ్రామానికి అర్జునుడిని సిద్ధం చేయడానికి శ్రీకృష్ణుడు ఉపదేశించింది మాత్రమే కాదు..జీవన విధానాన్ని కూడా సూచిస్తుంది. అందులో భాగంగా కృష్ణ పరమాత్మ ఆరోగ్యం గురించి , ఆహారం గురించి కొన్ని సూచనలు చేశాడు. ఇందులో భాగంగా సాత్విక, రాజసిక, తామసిక ఆహారాల గురించి కృష్ణుడు బోధించాడు. ఆహారంలో ఎంపిక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక ఎదుగుదలను సాధించవచ్చు.
నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలుంటాయి..మీరు ఎలాంటి దోషం ఉన్న ఆహారం తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
సాత్విక ఆహారం
అంటే.. సులభంగా జీర్ణమయ్యే ఆహారం. దీన్ని తీసుకుంటే శరీరానికి, మనసుకి ఆనందం కలుగుతుంది. శాంతి లభిస్తుంది. గీత 17:8 శ్లోకం ప్రకారం తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, నెయ్యి, హెర్బల్ టీలు లాంటి సాత్విక ఆహారాలు శక్తి, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్షును పెంచుతాయి. తాజాగా ఉండే ఆహారం మూడు గంటల్లోపు తినడం వల్ల జీవశక్తి ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే మేధస్సు పెరుగుతుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. బాదం, పాలు, తేనె, బియ్యంఇవన్నీ శరీరాన్ని తేలికగా ఉంచుతూ మనసుని స్థిరంగా చేస్తాయి.
రాజసిక ఆహారం
జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకునే ఆహారాలను రాజసిక ఆహారాలు అంటారు. వీటిని తీసుకుంటే శక్తి, ఉత్సాహం కలుగుతుంది కానీ అతిగా తీసుకుంటే చికాకు తప్పదు. గీత 17:9 శ్లోకం ప్రకారం ..కాఫీ, ఉప్పు , కారం అధికంగా ఉన్న వంటకాలు, మసాలా ఆహారాలు రాజసిక గుణంతో కూడి ఉంటాయి. ఈ ఆహారాలు శరీరాన్ని వెంటనే ఉత్తేజపరుస్తాయి కానీ ఎక్కువగా తీసుకుంటే అస్థిరత ఏర్పడుతుంది. ఆందోళన పెరుగుతుంది. ధ్యానం, శాంతిని కోరుకునేవారికి ఇలాంటి ఆహారం సరికాదు. ఉదాహరణకు ఎక్కువ మసాలా ఉన్న కూరలు, కెఫిన్ అధికంగా ఉన్న పానీయాలు తాత్కాలిక శక్తినిస్తాయి కానీ దీర్ఘకాలంలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
తింటున్న భోజనం బాగోలేదంటూ విమర్శిస్తూ తింటారు కొందరు..ఆ ఆహారం ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తామసిక ఆహారం
ప్రోసెస్డ్ లేదా నిల్వ ఉంచిన ఆహారం. ఇది తీసుకుంటే మనసు, శరీరం బలహీనమవుతుంది. గీతలో 17:10 శ్లోకం ప్రకారం ... నిల్వ చేసిన ఆహారం, మద్యం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువగా కాల్చిన , రుచి లేని ఆహారాలు తామసిక గుణంతో ఉంటాయి. ఇవి మానసిక ఆందోళనకు కారణం అవుతాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ ఆహారాలు శక్తిరహితంగా ఉంటాయి. జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు రిఫ్రిజిరేటర్‌లో రోజుల తరబడి ఉంచిన ఆహారం లేదా ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి గుణాలు ప్రేరేపిస్తాయి.
ఆహారాన్ని కేవలం శరీర పోషణ కోసం మాత్రమే కాదు ఆత్మశుద్ధికి కూడా ఓ మార్గం అని చెబుతుంది భగవద్గీత. ఆహారం తయారీలో ప్రేమ, శాంతి, శుభ్రత ఉండాలని గీత సూచిస్తుంది. ఆధునిక శాస్త్రం కూడా ఈ సూత్రాలనే చెబుతోంది. సేంద్రీయ, తాజా ఆహారాలు శరీరంలో శక్తిని, మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయి. రాజసిక, తామసిక ఆహారాలను తీసుకోవడం తగ్గిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాలను అనుసరించి రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ అనుసరించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఈ నియమాలు అనుసరించేముందు మీ ఆరోగ్య రీత్యా నిపుణుల సలహాలు , సూచనలు పాటించడం మంచిది...