Koti Deepotsavam 2024


అజ్ఞానం అనే చీకటిని తొలగించే దీప యజ్ఞం 
కైలాశాన్నే ఇలకు తీసుకొచ్చినంత వైభవం
సాక్షాత్తూ మహాశివుడే దిగివస్తున్నాడనిపించేలా లింగోద్భవం
దేవదేవుడి  నుంచి శక్తి స్వరూపిణిని వరకు కొలువుతీర్చే సందర్భం
వేలాది భక్తుల పంచాక్షరి నామ స్మరణతో మారుమోగే ప్రాంగణం



 
భక్తి టీవీ ఏటా కన్నుల పండువగా నిర్వహించే ఆధ్యాత్మిక సంబురం కోటీ దీపోత్సవం ఈ ఏడాది కూడా అశేష భక్తవాహిణి మధ్య వైభవంగా జరుగుతోంది. లక్ష దీపోత్సవంతో ప్రారంభమైన ఈ వేడుక కోటి దీపోత్సవంగా మారింది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో సాగుతోన్న ఈ దీపయజ్ఞంలో రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ఆధ్యాత్మిక ప్రవచనాలు వెదజల్లుతున్నారు.  సామాన్య భక్తుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరూ పాల్గొని నేటి తరానికి  సనాతన సంస్కృతిని పరిచయం చేస్తున్నారు.



హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఈ ఏడాది ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని తన సందేశం వినిపించారు. నవంబరు 21 గురువారం 13వ రోజు జరిగిన దీపయజ్ఞానికి  విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఘనంగా స్వాగతం పలికారు నిర్వాహకులు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి సీతక్క కూడా కోటి దిపోత్సవంలో పాల్గొన్నారు. 


దీపోత్స వేడుకలో భాగంగా దీప ప్రజ్వలన చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...పూరీ జగన్నాథునికి  ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి రాష్ట్రపతి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు..




 
ద్రౌపది ముర్ము ఏమన్నారంటే...


దీపం వెలిగించి కార్యక్రమం ప్రారంభించడం మన సంప్రదాయం...భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. కార్తీక మాసంలో అంతా పరమేశ్వరుడిని కొలుస్తారు. అసత్యంపై సత్యం గెలిచిన పండగ ఇది అని.. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం చేయడం ఎంతో ఆనందం. అందరూ ఒక్కటై కోటి దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణం, పూరీ జగన్నాథుని పూజలో పాల్గొనడం నా అదృష్టం అన్నారు ద్రౌపది ముర్ము...






భక్తి టీవీ నిర్వహిస్తోన్న దీపయజ్ఞంలో ఈ ఏడాది ఇప్పటికే 13 రోజులు పూర్తయ్యాయి. గురువారం జరిగిన కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు సీ.ఎస్. రంగరాజన్ ప్రవచనామృతం వినిపించారు. పూరీ జగన్నాథ హారతి, నృసింహ రక్షా కంకణ పూజ నిర్వహించి నేరుగా భక్తులతో నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ చేయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించిన భక్తులు... స్వయంగా యాదగిరిగుట్టలో కొలువైన స్వామినే దర్శించుకుంటున్నామా అనే తన్మయత్వంలో మునిగిపోయారు. అంతరం శేష వాహనంపై దేవదేవుడు భక్తులను అనుగ్రహించాడు. కార్యక్రమంలో చివరిగా లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనంతో కోటి దీపోత్సవం 13 వ రోజు ముగిసింది.  



Also Read: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!


Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!