Ambajipeta News : కోనసీమ జిల్లా అంబాజీపేట అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది జగ్గన్న తోట సంక్రాంతి ప్రభల తీర్థం. అయితే ఇక్కడ దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా మరొక విశేషమైన ఉత్సవం ఉంది. అంబాజీపేటలో 13 ప్రాంతాల నుంచి సుందరంగా అలంకరించిన 13 ప్రత్యేక వాహనాలపై దేవుని విగ్రహాలను తీసుకొచ్చి, ఒక చోట కలిపే అపురూప దృశ్యం ఈ నెల 11న అంబాజీపేటలో ఆవిష్కృతం కానుంది. ఏటా దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత విజయ బేతాళ స్వామి వాహన మహోత్సవాన్ని పట్టణంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అంబాజీపేటలో ఈనెల 11న ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. అనుకున్న లక్ష్యాల్ని సాధించేందుకు విజయ బేతాళుడిని పూజించడం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. సుమారు 56 ఏళ్లుగా ఇక్కడ విజయబేతాళస్వామి వారి వాహన మహోత్సవాన్ని నిర్వహిస్తుండడం విశేషం.
వివిధ ప్రాంతాల నుంచి
అంబాజీపేటలోని శ్రీనివాస నగర్ నుంచి గరుత్మంతుడు, పెచ్చెట్టివారిపాలెం నుంచి గరుత్మంతుడు, మాచవరం శ్రీరామ నగర్ నుంచి విజయ దుర్గమ్మ, దొమ్మేటివారిపాలెం పోస్టువీధి నుంచి కృష్ణుడు, దొమ్మేటివారిపాలెం మహిళల ఆసుపత్రి వీధి నుంచి ఆంజనేయ స్వామి, పోతాయిలంక నుంచి ఆంజనేయ స్వామి, గంగలకుర్రు మలుపు నుంచి విజయ గణపతి స్వామి, మాచవరం ఇటికాలమ్మ వారిపాలెం నుంచి రాజహంస, కొత్తపాలెం నుంచి హంస, చప్పిడివారి పాలెం నుంచి షిర్డీ సాయిబాబా, గుత్తుల వారి పాలెం నుంచి సింహ వాహనం, నందంపూడి నుంచి రాజరాజేశ్వరీ అమ్మవారు, శ్రీనివాసనగర్ నుంచి ఏనుగు విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేడుక జరిగే ప్రదేశానికి తీసుకొస్తారు. మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విజయబేతాళస్వామి వారి తీర్థం జరుగుతుంది.
ఇదీ నేపథ్యం
ఇక్కడ ఏటా విజయదశమి అనంతరం వాహన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 1967లో అంబాజీపేటలో ఏర్పాటైన అభ్యుదయ సంక్షేమ సంఘం, ఉత్సవ కమిటీల నేతృత్వంలో అయిదున్నర దశాబ్దాలుగా ఈ వాహన మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఇక్కడి 13 గ్రామాలకు చెందిన ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలపై దేవుళ్ల విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా అంబాజీపేట కూడలికి తీసుకొస్తారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు అర్ధరాత్రి వరకు వేచి చూస్తుంటారు. విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించిన దేవుళ్ల విగ్రహాలను వాహనాలపై అమర్చి ఆయా ప్రాంతాల నుంచి డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, చెడీ తాళింఖానాల నడుమ అత్యంత వైభవంగా స్థానిక చౌరస్తాకు తీసుకొస్తారు. ఈ ఉత్సవంలో చెడీ తాళింఖానా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.