రుద్రుడి కంటి నుంచి రాలిపడిన కన్నీటి చుక్కలు రుద్రాక్షలుగా భూమి మీద ఏర్పడ్డాయని నమ్మకం. రుద్రాక్ష వృక్షాల నుంచి వచ్చే కలపలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది చాలా అద్భుతమైనదిగా పరిగణిస్తారు. ఇది శివుడికి చాలా ప్రీతి పాత్రమైంది. శివభక్తులు భక్తిగా ఇష్టంగా ఈ రుద్రాక్షలను ధరిస్తారు.


రుద్రాక్షలు చాలా రకాలు. ఒక్కో రుద్రాక్ష ఒక్కోవిధమయిన ప్రయోజనాన్ని అందిస్తుంది. రుద్రాక్ష ధరించడం శివభక్తులందరికీ ఇష్టమే. చాలా మంది ధరిస్తారు కూడా. కానీ నియమాలను పాటించడం మీద పెద్దగా దృష్టి నిలపరు. చాలా మందికి ఈ నియమాలు ఏమిటనే అవగాహన కూడా ఉండదు. అందువల్ల రుద్రాక్ష ధరించినపుడు రావల్సిన పూర్తి ఫలితాలు రావు.


నియమాలు



  • రుద్రాక్షను ఎరుపు, పుసుపు లేదా తెలుపు దారంలో మాత్రమే ధరించాలి. వెండి, బంగారం, రాగితో చేసిన తీగలో కూడా ధరించవచ్చు. రుద్రాక్ష ధరించే ప్రతి సారి ఓం నమ: శివాయ అని జపించడం మరచిపోవద్దు.

  • రుద్రాక్ష ఎప్పుడైనా సరే స్వంత డబ్బుతో కొనుక్కోవాలి. ఎవరైనా కొని ఇచ్చింది లేదా బహుమతి గా ఇచ్చింది ధరించవద్దు. మీరు కొనుకున్న రుద్రాక్షను ఎవరికీ ఇవ్వొద్దు.

  • రుద్రాక్ష ధరించే ముందు ఒకసారి పండితుల సలహా తీసుకోవడం అవసరం. 27 పూసల కంటే తక్కువ రుద్రాక్షల మాల ధరించకూడదు. ఇలా చేస్తే శని దోషం ఏర్పడవచ్చు.

  • మాంసాహారం తినేవారు, మద్యం తాగేవారు, పొగతాగే అలవాటు ఉన్న వారు రుద్రాక్షలు ధరించవద్దని చెబుతారు. అలా ధరిస్తే రుద్రాక్ష అపవిత్రమవుతుంది. ధరించిన వారు రకరకాల సమస్యల బారిన పడవచ్చు.

  • స్మశానానికి వెళ్లే వారు ఇంట్లో రుద్రాక్ష జపమాల తీసివేసి వెళ్లాలి. ఒకవేళ మరచిపోతే స్మశానంలో ప్రవేశించేందకు ముందే తీసి జేబులో వేసుకోవడం మంచిది.

  • రాత్రి పడుకునే మందు కూడా రుద్రాక్ష తీసేసి పడుకోవాలి. రుద్రాక్ష తీసి దిండు కింద పెట్టుకుని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. పీడ కలలు రావు.

  • ఉదయం తిరిగి రుద్రాక్ష ధరించే సమయంలో రుద్రాక్ష మంత్రం , రుద్రాక్ష మూల మంత్రాన్ని 9 సార్లు జపించాలి. పడుకునే ముందు రుద్రాక్షను తీసిన తర్వాత కూడా ఈ నియమాన్ని పాటించాలి. తీసేసిన రుద్రాక్షను పూజమందిరంలో పెట్టుకోవాలి.

  • ఉదయం స్నానం తర్వాత రుద్రాక్ష ధరించేందకు సరైన సమయం. రుద్రాక్ష ధరించిన ప్రతి సారీ మంత్రాన్ని జపించాలి. రుద్రాక్ష పూజలో ఉంచి నేతిదీపం, దూపం సమర్పించాలి.

  • స్నానానికి ముందు రుద్రాక్ష ధరించ కూడదు, తాకకూడదు.

  • రుద్రాక్షను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే దుమ్ము, ధూళీ పూసలో చేరి ఉండిపోతాయి. వీలైనంత తరచుగా వీటిని శుభ్రం చేసుకోవాలి. దారం మురికిగా మారినా, పాడైపోయినా దారాన్ని మార్చాలి. రుద్రాక్ష శుభ్రం చేసిన తర్వాత పవిత్ర జలాలతో లేదా పాలతో కడగాలి. ఈ జాగ్రత్తతో దాని పవిత్రత నిలిచి ఉంటుంది.

  • స్త్రీలు నెలసరి సమయాల్లో రుద్రాక్ష ధరించకూడదు.

  • అప్పుడే పుట్టిన పిల్లలను చూసేందుకు వెళ్లే వారు కూడా రుద్రాక్ష తీసేసి వెళ్లాలి.


రుద్రాక్ష ధరిస్తే కలిగే ప్రయోజనాలు



  • ఏకాగ్రత పెరుగుతుంది.

  • జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

  • పాపలన్నీ తొలగిపోతాయి.

  • జీవితంలో ఆనందం, శాంతిని చేకూరుస్తాయి.

  • జాతక దోషాలు నివారించబడతాయి.

  • ఇది ధరించడం వల్ల ఎనర్జిటిక్ గా ఉంటారు.

  • ఒత్తిడి, రక్తపోటు అదుపులో ఉంటుంది.

  • రుద్రాక్షతో చర్మ సంబంధ వ్యాధులు కూడా నయమవుతాయి.


Also Read: భార్య, భర్తకు ఎటువైపు నిద్రపోవడం మంచిదో తెలుసా? పడక గదిలో ఈ నియమాలు తప్పనిసరి!