Ganesh Chaturthi 2023: ఖైరతాబాద్ మహా గణేశుడుకి పూజలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం తొలి పూజలో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ తో పాటు, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి నేతలు హారతినిచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.... భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ప్రతి పండగలో ఒక సందేశం ఉంటుందన్నారు. మనం చేసే ఏ కార్యక్రమమైన ఇలాంటి విఘ్నాలు లేకుండా సాగాలంటే వినాయకుడిని పూజించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ చైర్మెన్ సుదర్శన్ ను గవర్నర్ అభినందించారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు రాలేకపోయామన్నారు. కరోనా వంటి వ్యాధులు రాకుండా ఉండాలని గణపతిని ప్రార్ధిస్తున్నట్టుగా గవర్నర్ చెప్పారు. మనమంతా తెలంగాణ అభివృద్ది కోసం పనిచేయాలని గవర్నర్ కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 63 అడుగుల భారీ ఆకారంతో దిశవిద్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. గణేశుడికి కుడివైపు పంచముఖ లక్ష్మి నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీకేర్లు ఏర్పాటు చేసినట్లు ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ కమిటీ వెల్లడించింది.
ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ చవితి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు.
ఖైరతాబాద్ లో తొలిసారిగి మట్టి విగ్రహన్ని ఏర్పాటు చేశారు. 50 అడుగుల మట్టి విగ్రహన్ని తయారు చేయించింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి. ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహనికి తొలి పూజలు చేసిన తర్వాత విగ్రహన్ని సందర్శించుకొనేందుకు భక్తులకు అనుమతిని ఇచ్చారు.
ట్రాఫిక్ ఆంక్షలు.......
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకొనేందుకు వందలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందను ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గణేష్ విగ్రహన్ని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ ప్రాంతంలో 9 మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పోలీసులు అనుక్షణం పరిశీలించనున్నారు. గణేష్ మండపం వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
భక్తుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల ప్రయాణం సులువుగా... సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపడతామని చెప్పింది. భక్తుల ప్రయాణానికి, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. గణేష్ చతుర్ధికి అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పించేలా మెట్రో రైలు సేవలు పెంచుతామని ప్రకటించింది. గణేష్ నవరాత్రుల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడపనుంది. గతంలో మాదిరిగానే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకునే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఖైరతాబాద్ స్టేషన్‌లో అదనపు టికెట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు టికెట్లు కొనేందుకు ఆలస్యం కాకుండా చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా టిక్కెట్లు తీసుకుని రైళ్లలో ఎక్కే అవకాశం కల్పిస్తున్నారు. భక్తుల భద్రతకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర మాత్రమే కాకుండా... ఇతర కీలకమైన మెట్రో స్టేషన్లలో దగ్గర కూడా అదనపు భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు.